వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 13 ఎంపీ స్థానాలు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కారు ఫుల్ జోరుగా సాగుతుందని ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో క్లీన్‌స్వీప్ చేస్తుందని ఇండియా టుడే పత్రిక నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల జయాపజయాలపై నిర్వహించిన సర్వేలో టీఆర్‌ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో ఓటింగ్ ఏకపక్షంగా సాగుతుందంటూ.. 13 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని పేర్కొంది. సీమాంధ్రలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుందని పత్రిక అభిప్రాయపడింది.
carగురువారం ఆ పత్రిక నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లోని 42 స్థానాలకుగాను.. టీఆర్‌ఎస్‌కు 13, వైఎస్సార్సీపీకి 13, టీడీపీకి 8, కాంగ్రెస్‌కు 7స్థానాలు, మజ్లిస్ ఒక స్థానం దక్కుతుందని వెల్లడైంది. బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కక పోవచ్చని పేర్కొంది. కాగా, తెలంగాణ ఐదేళ్ల క్రితం వరకు సందిగ్ధంగా ఉన్న కాంగ్రెస్ రూటు మార్చుకుని తెలంగాణ ప్రకటించినా.. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని సర్వే చెబుతున్నది. ఫలితంగా 2009లో రాష్ట్రంలో 33 స్థానాలున్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 7స్థానాలకు పడిపోనున్నది.

అయితే, తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో, సీమాంధ్రలో వైఎస్సార్సీపీతో కాంగ్రెస్ పొత్తులపై వస్తున్న ఊహాగానాలతో ఆ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉద్యమంతో తెలంగాణలో గట్టి పట్టును సాధించిన టీఆర్‌ఎస్.. పార్లమెంట్ సభ్యుల సంఖ్యను భారీగా పెంచుకోబోతున్నది. 2009లో రెండు స్థానాలున్న టీఆర్‌ఎస్ జోష్‌తో వచ్చే ఎన్నికల్లో 13 స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు దండిగా ఉన్నాయని సర్వే చెబుతున్నది. తెలంగాణ ప్రకటన కాంగ్రెస్ చేసినా, ఆ క్రెడిట్‌ను ప్రజలు టీఆర్‌ఎస్ ఖాతాలోనే వేస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి ఎంతోకొంత లాభం చేకూరుతున్నది. క్లీన్‌స్వీప్ చేయకున్నా.. 2 నుంచి 8స్థానాలకు ఎగబాకుతున్నదని సర్వే పేర్కొంటున్నది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.