వచ్చేఎన్నికల్లో వార్‌ వన్‌సైడే!

 

KCR-telangana – 100 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపుదాం
– 15 మంది ఎంపీలను పార్లమెంటుకు గెలిపిద్దాం
– సంకీర్ణ యుగంలోరాజకీయ బలంతోనే రాష్ట్ర సాధన
– హర్షధ్వానాల మధ్య టీఆర్‌ఎస్ తీర్మానం ఆమోదం
– పొత్తులంటూ కాంగ్రెస్, టీడీపీ మోసం చేశాయన్న హరీశ్
– ఆవిర్భావ సదస్సులో అన్నీ తానై నడిపిన అధినేత కేసీఆర్
– 31 తీర్మానాలు.. 4 గంటలపాటు సుదీర్ఘ చర్చ

వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరాటం చేయనున్నట్లు టీఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆవిర్భావ సదస్సులో తీర్మానాన్ని ఏకక్షిగీవంగా ఆమోదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేయాలని తీర్మానంలో పేర్కొంది. ఏడోసారి పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన శనివారం ఆర్మూర్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి ప్రతినిధుల మహాసభలో మొత్తం 31 తీర్మానాలను ఆమోదించారు. ఒంటరి పోటీపై తీర్మానాన్ని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టీ హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో పొత్తుల నేపథ్యంలో జరిగిన మోసాలు, దగా, నయవంచన వల్ల జరిగిన రాజకీయ నష్టాలను బేరీజు వేశారు.

ఆ రెండు పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన అంశానికి వచ్చేసరికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను టీడీపీ, కాంగ్రెస్ కాలరాశాయని చెప్పారు. అందుకోసమే తెలంగాణ సమాజం ఏకీకృతమై, బలమైన రాజకీయ శక్తిగా ఏర్పడటం ద్వారా చట్టసభల్లో బలాన్ని పెంచుకోవాలన్నారు. తద్వారానే శాసించి తెలంగాణ తెచ్చుకోవచ్చని హరీశ్‌రావు హర్షద్వానాల మధ్య ప్రకటించారు. వంద మంది ఎమ్మెల్యేలను, 15 మంది ఎంపీలను చట్టసభలకు పంపితే రాబోయే సంకీర్ణ యుగంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ తీర్మానాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు జగదీశ్వర్‌డ్డి బలపరిచారు. తీర్మానాన్ని ఆమోదానికి పెట్టిన కేసీఆర్.. ఒంటరిగా పోటీ చేద్దామా, వద్దా? అని ప్రతినిధులను ప్రశ్నించగా ఒంటరిపోరేనంటూ హర్షాతిరేకాల మధ్య సభ నినదించింది.

తెలంగాణ సమాజం తిరుగులేని స్వీయ రాజకీయ శక్తిగా అవతరించేలా ఈ ఎన్నికల్లో తీర్చిదిద్దేందుకు ప్రజలు ఆశీర్వదించాలని పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహాడ్డి మరో తీర్మానం ప్రవేశపెట్టారు. బలమైన రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం సులభం అవుతుందని అన్నారు. దేశంలో మెజార్టీ పార్టీలు తెలంగాణ లేఖ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ మొండివైఖరితో రాష్ట్ర ఏర్పాటుకు మొండి చెయ్యి చూయించిందన్నారు. మరో పొలిట్ బ్యూరో సభ్యులు నిరంజన్‌డ్డి తీర్మానాన్ని బలపరచటంతో కార్యకర్తలు ఆమోదించారు.

చట్టసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్: విజయశాంతి
తరతరాలుగా అణచివేతగా గురవుతున్న మహిళలకు రాజకీయ అధికారం కావాలని మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఆమె మాట్లాడారు. పార్లమెంటులో మహిళాబిల్లును పెండింగ్‌లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తీర్మానాలు చేయటమేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్‌ను అమలుపరచాలని కేసీఆర్‌ను విజయశాంతి సభాముఖంగా కోరారు. ఢిల్లీలో నేటికీ మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసి చంపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ తీర్మానాన్ని గొంగలి సునీత బలపరిచారు.

జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు: ఈటెల రాజేందర్
జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం చట్టసభల్లో బీసీలు 15 శాతం కూడా అడుగుపెట్టలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు బీసీలపై చిత్తశుద్ధిలేదన్నారు. కులవృత్తులకు కార్పొరేషన్ నిధులను కేటాయించకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రత్యేకంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీనవర్గాలు బలపడాలంటే రాజ్యాధికారం రావాలన్నారు. 123 కులాలుంటే 10 కులాలు కూడా చట్టసభల్లో అడుగు పెట్టలేక పోయాయని ఈటెల అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి టీఆర్‌ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. పొలిట్‌బ్యూరో సభ్యులు మధుసూదనాచారి ఈ తీర్మానాన్ని బలపరిచారు.

తెలంగాణ హక్కు అయిన బయ్యారం ఉక్కును విశాఖకు తరలించుకుపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు రాజేందర్ దిండిగాల తీర్మానం ప్రవేశపెట్టగా ఖమ్మం జిల్లాకు చెందిన టీ రవీందర్ బలపరిచారు. ప్రాణహిత-చే పనులు నత్తనడకన సాగుతున్నాయని, తెలంగాణలోని ప్రాజెక్టుల పట్ల వివక్షకు ఇది ప్రత్యేక నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. 165లక్షల 40వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అరకొర నిధులు కేటాయిస్తూ కేంద్రం దయకు వదిలేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం మాదిరిగానే జాతీయ హోదా కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందని విమర్శించారు.

యుద్ధ ప్రాతిపదికన ప్రాణహిత-చే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నారదాసు డిమాండ్ చేయగా, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు బలపరిచారు. కంతనపల్లి ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించి పనులు వేగిరం చేయాలని పొలిట్‌బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్‌డ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని.. పొలిట్‌బ్యూరో సభ్యులు కర్నె ప్రభాకర్ బలపరిచారు. కరీంనగర్ జిల్లాలోని నేదునూరు, వరంగల్ జిల్లాలోని శంకరపల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని కెప్టెన్ లక్ష్మీకాంతరావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఆంధ్రాలో ఏడు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ఉండగా, తెలంగాణలో ఇప్పటివరకు గ్యాస్ కేటాయింపులు జరుగలేదని, వెంటనే వివక్షను వీడాలని తీర్మానంలో కోరారు. దీనిని విజయరామారావు బలపరిచారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేస్తూ వ్యవసాయ పనుల కాలంలో అదనపు పని దినాలను కల్పించి కూలీలకు, వ్యవసాయదారులకు మేలు కలిగేవిధంగా పథకంలో మార్పులు చేయాలని పొలిట్‌బ్యూరో సభ్యులు భూమాడ్డి తీర్మానం ప్రతిపాదించగా.. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు వేముల సురేందర్‌డ్డి బలపరిచారు. తెలంగాణ ఉద్యోగులపై కక్షసాధింపును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రం చేస్తున్నదని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, దేశవూదోహం కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తే భయపడేది లేదని, ఉద్యోగులకు అండగా టీఆర్‌ఎస్ ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యోగులపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు ఖండిస్తూ స్వామిగౌడ్ తీర్మానం ప్రవేశపెట్టగా, పొలిట్‌బ్యూరో సభ్యులు యాదవడ్డి బలపరిచారు.

కరెంటు కోతలతో రైతాంగం విలవిల్లాడుతోందని, పంట నష్టం జరిగి కుంగిపోతున్నదని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌డ్డి అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించి, 7 గంటలు నిరంతర కరెంటు సరఫరా చేయాలని ఆయన ప్రతిపాదించిన తీర్మానాన్ని పొలిట్ బ్యూరో సభ్యులు బండారి నరేందర్ బలపరిచారు. 100 టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మించి, జూరాల ప్రాజెక్టులోకి నీటిని వదిలి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే జూపల్లి కృష్టారావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చించి నారాయణపూర్ డ్యాం ద్వారా సాగునీటిని విడుదల చేయించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.

ఈ తీర్మానాన్ని మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌డ్డి బలపరిచారు. చేనేత సమస్యల పరిష్కారానికి రూ.3వేల కోట్లు కేటాయిస్తూ చేనేత కార్మికులను ఆదుకోవాలని పొలిట్‌బ్యూరో సభ్యులు మార్కండేయ ప్రతిపాదించిన తీర్మానాన్ని టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్ బలపరిచారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను పునరుద్దరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటంలేదని మాజీ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అన్నారు. గీతవృత్తిని ఎక్సైజ్ శాఖ నుండి వేరు చేసి సహకారశాఖకు అప్పగించాలని, హైదరాబాద్‌లో కల్లు దుకాణాల పునరుద్దరణతో పాటు గీత కార్మికుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని తీర్మానం పెట్టగా.. ప్రతినిధుల సభ బలపరిచింది. సింగూరు ప్రాజెక్టు నిర్మాణంతో మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతాంగం పూర్తిగా దెబ్బతిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌డ్డి అన్నారు. జంటనగరాల నీటి కోసం కృష్ణజలాలను వాడుకుని, సింగూరు జలాలను నిజాంసాగర్‌కు వదిలివేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ బలపరిచారు.

వడగళ్ళ వానతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నష్టపోయిన రైతాంగానికి యుద్ధ ప్రాతిపదికన పరిహారం అందించాలని కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డాక్టర్ పరమేశ్వర్‌డ్డి బలపరిచారు. ఆసియా ఖండంలోనే ప్రసిద్ధిగాంచిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటుకు ధారాదత్తం చేశారని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌డ్డి అన్నారు. పదివేల మంది ఉద్యోగులకు ఉపాధి లేకుండా చేసిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వాపసు తీసుకోవాలని ఆమె తీర్మానం ప్రతిపాదించగా.. బిగాల గణేశ్‌గుప్తా బలపరిచారు. రూ.10 కోట్ల 80లక్షల ఎర్రజొన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి జీవన్‌డ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, ప్రకాష్‌గౌడ్ బలపరిచారు.

ఆర్మూర్ ప్రాంతంలో పసుపు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకబోర్డు ఏర్పాటుతో పాటు పసుపు శుద్ధి కర్మగారాలు నిర్మించాలని బాల్కొండ నియోజకర్గ ఇన్‌చార్జి వేముల ప్రశాంత్‌డ్డి తీర్మానించగా, రైతు నాయకులు మార గంగాడ్డి బలపరిచారు. రూ.4,200 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు కారణంగా 298 గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఈ ప్రాజెక్టును తక్షణం ఆపాలని కేసీఆర్ ప్రతిపాదించగా, ప్రతినిధుల సభ ఆమోదించింది. సమయాభావం వల్ల తొమ్మిది తీర్మానాలను కేసీఆర్ ప్రవేశపెట్టారు. వికలాంగులు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్ పెంచాలని, సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను ఉపసంహరించుకుని, కొత్త గనులు ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి వ్యయం పెరిగినందున నిధులను పెంచాలని, లంబాడితండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులందరికి ఉద్యోగ భద్రత కల్పించి క్రమబద్ధీకరించాలని, మంచినీటి ఎద్దడి నివారణకు ప్రతిజిల్లాకు రూ.25కోట్ల బడ్జెట్‌ను విడుదల చేయాలని, బీడీ కార్మికులకు తీవ్రమైన అవస్థలు జరుగుతున్నందున కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి నుంచి స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని, ప్రతీ కార్మికురాలికి నెలకు 22 రోజులు పని కల్పించాలని ఆయన తీర్మానాలు ప్రతిపాదించారు. రైల్వేలైన్‌లో తెలంగాణ ప్రాంతంపై జరుగుతున్న వివక్షను విడనాడాలని కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టగా, ప్రతినిధులు చప్పట్లద్వారా బలపరిచారు. మొదట 28 తీర్మానాలకే పరిమితం కాగా, మరో 3 తీర్మానాలను అదనంగా జోడించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.