వక్రీకరణలు, అబద్దాలు.. అసెంబ్లీలో శైలజానాథ్ అడ్డగోలు వాదనలు

ఆధిపత్య భావజాలం.. ప్రతి చేష్టలోనూ అహంకారం.. ప్రతి భావనలోనూ అహంభావం.. ప్రతి మాటలోనూ చరిత్ర వక్రీకరణ..! రాజ్యాంగంమీద ప్రమాణం చేసి మంత్రి పదవిలో కూర్చున్న సీమాంధ్ర నాయకుడు సాకే శైలజానాథ్.. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై చేసిన ప్రసంగం తీరుతెన్నులపై వ్యక్తమైన విమర్శలివి!! రాజ్యాంగంలోని మూడవ అధికరణం కింద తాను ఈ ముసాయిదాను పంపుతున్నానని సాక్షాత్తూ రాజ్యాంగాధినేత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పేర్కొన్నదానిని సైతం తీసిపారేస్తూ.. అసలీ బిల్లే రాజ్యాంగ విరుద్ధమంటూ మొదలుపెట్టిన సాకే ధిక్కార స్వరం.. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది విశాలాంధ్ర ఏర్పాటుకేనన్నట్లు సాగింది! ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తెలంగాణ విజ్ఞప్తి మేరకే జరిగిందనేదాకా వెళ్లింది! తెలుగుజాతి చరిత్రలో ఏ కొద్దికాలమో మినహా అంతా ముక్కలు చెక్కలుగానే బతికిన వాస్తవాన్ని మరుగునపడేసి..
assemblyవేల సంవత్సరాలుగా తెలుగు జాతి కలిసే ఉన్నదంటూ పాత అబద్ధాన్నే వల్లె వేసింది! విడిపోవడం ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్యగా చెబుతూ తెలుగుజాతి ఐక్యత కోసం గుండెలు బాదుకున్న మంత్రి.. అదే తెలుగుజాతిలో భాగమైన తెలంగాణవారు.. కలిసుండటం తమ ఆత్మగౌరవ సమస్య అంటూ దశాబ్దాలుగా గోస పెడుతుంటే గేలి చేశారు! విద్యార్థులు చేసిన అపూర్వ ఉద్యమాలను కిరాయి కార్యక్రమాలుగా జమకట్టారు! అసలు హైదరాబాద్ ఆంధ్రుల పట్నమని తేల్చేశారు! పిలిస్తేనే తాము వచ్చామని.. విలీనానికి తెలంగాణదే బాధ్యతని ఆరోపణ చేశారు! సత్యదూర ప్రసంగాన్ని సహించలేకపోయిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పటికప్పుడు శైలజానాథ్‌కు అడ్డుతగిలి.. సరి చేసేందుకు ప్రయత్నించినా.. ధోరణి మార్చుకోని మంత్రి.. ఆద్యంతం తన వక్రీకరణల ప్రసంగాన్ని కొనసాగించి..

స్పీకర్ సమయం లేదంటున్నా కొనసా…గించి.. మరుసటి రోజుకు కూడా మిగుల్చుకున్నారు! సాకే ప్రసంగం సాగిన దాదాపు మూడు గంటల వ్యవధిలో అనేకమార్లు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొంది. బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ శైలజానాథ్ ప్రసంగాన్ని ప్రారంభించడంతో వెంటనే అడ్డుకున్న టీడీపీ టీ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు.. మంత్రిగా ఉండి.. రాష్ట్రపతి ద్వారా వచ్చిన బిల్లును వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధమని, రాజీనామా చేసి మాట్లాడాలని తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించిన డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క.. ఎర్రబెల్లి ఉపయోగించిన అభ్యంతరకర పదాన్ని రికార్డుల నుంచి తొలగించారు. అప్పటికే టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు సభ్యులు పోడియం వద్దకు చేరుకుని శైలజానాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా ప్రసంగం ఆపని మంత్రి.. అదే ధోరణిలో మాట్లాడుతూ పోయారు. దీంతో సీనియర్ మంత్రి జానారెడ్డి కలుగజేసుకుంటూ.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చర్చ జరిగితే మంచిదని చెప్పారు. రాష్ట్రపతి ద్వారా వచ్చిన బిల్లును రాజ్యాంగ వ్యతిరేకం అని వాదించడం సహేతుకం కాదని సూచించారు. తాను చేసిన ఈ సూచన ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తుందని అన్నారు.

మంత్రులు ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడి రాజ్యాంగానికి అపభ్రంశం తేవద్దని విన్నవించారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత ఈటెల రాజేందర్ నిలబడి.. చర్చను తాము ఆహ్వానిస్తున్నామని, హేతుబద్ధంగా, హుందాగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో మాట్లాడాలని స్పష్టం చేశారు. 2004లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ అంశం చేర్చినప్పుడు ఈ దమ్ము, ధైర్యం ఏమైందని నిలదీశారు. టీడీపీ శాసన సభ ఉపనాయకుడు అశోకగజపతిరాజు మాట్లాడుతూ మంత్రులే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగంపైనా ప్రజలపైనా విశ్వాసం పెట్టి ప్రతి మాటను శాసనసభలో వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ శైలజానాథ్ ఉపన్యాస తీరుతెన్నులు మారలేదు. విభజనకు ఏర్పాటైన కమిటీలో ఎవరూ తెలుగువారు లేరని, బిల్లు పూర్తిగా పక్షపాతపూరితమైనదని, తెలంగాణలోని వారు కూడా ఆలోచించాలని మంత్రి అన్నప్పుడు టీడీపీ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మాట్లాడాల్సినదాన్ని అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, బొత్స సత్యనారాయణ కూడా తెలుగువారికి రెండు రాష్ర్టాలుంటే తప్పేంటన్నారని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా మాట్లాడటానికి శైలజానాథ్ సాధారణ సభ్యుడు కాదని, రాష్ర్టానికి మంత్రన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. అప్పటికీ ఆయన వక్రీకరణల ప్రసంగం దారినపడలేదు.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలపాటు సాగిన ప్రజాస్వామిక ఉద్యమాలను పూర్వపక్షం చేస్తూ.. అసలు ఈ బిల్లు ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తేల్చారు. స్వాతంత్య్రానికి పూర్వమే మహా నగరంగా విలసిల్లిన హైదరాబాద్.. సమైక్య రాష్ట్రంలోనే అభివద్ధి చెందిందని పాత అసత్యాన్నే వల్లె వేశారు. ఒక దళితుడిని సీఎం చేస్తామని ఉద్యమనేతలు ప్రకటించడాన్నీ జీర్ణించుకోలేకపోయిన శైలజానాథ్.. దానినీ తప్పుపట్టారు. పదే పదే దొరలు.. దేశ్‌ముఖ్‌లు పటేల్ పట్వారీలు.. అంటూ శైలజానాథ్ మాట్లాడినప్పుడు అడ్డుపటిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. సమైక్య భావం గురించి చెప్పుకుంటే తప్పులేదని కానీ.. ఆ ముసుగులో తెలంగాణ ప్రజలను అవమానిస్తే సహించేది లేదన్నారు. లక్షల కోట్ల అవినీతి కారకులైనవారు సీమాంధ్రవారేంనంటూ జగన్, గాలి జనార్దన్‌రెడ్డి తదితరుల పేర్లు ప్రస్తావించారు. అభివద్ధి పేరుతో తెలంగాణను దోచుకువెళ్లారని మండిపడ్డారు. దొరల గురించి మాట్లాడుతున్న శైలజానాథ్.. రాయలసీమలో నక్సలైట్లు ఎందుకు వచ్చారో చెప్పాలన్నారు. అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రసంగం సందర్భంగానూ వాగ్వాదాలు జరిగాయి. తాను కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయంతీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పిన మాట నిజమేనని, అయితే ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తుదీ సభలో చెబుతానని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.