లోపభూయిష్ట బిల్లును తిప్పిపంపాలి: సభలో చంద్రబాబు

హైదరాబాద్, జనవరి 25 : రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు లోపభూయిష్టంగా ఉందని, బిల్లును రాష్ట్రపతికి తిప్పి పంపాలని, రాజ్యాంగం ప్రకారమే అందరం పనిచేస్తామని టీడీపి అధినేత చంద్రబాబు అన్నారు. బిల్లుపై చర్చలో భాగంగా శనివారం సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ, తనకు తెలియకుండానే ఢిల్లీ నుంచి బిల్లు వచ్చిందని, తప్పుల తడకగా ఉందని సీఎం అన్నారు. అయితే విభజన బిల్లు రూపకల్పనలో పేర్కొన్న అంశాలు, వివరాలు సీఎం వద్దనుంచి వెళ్లలేదా అని ప్రశ్నించారు. సీఎంకు తెలియకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా..? ఫెడరల్ స్ఫూర్తితో పనిలేకుండా కేంద్రమే రాష్ర్టాన్ని పాలిస్తుందా చెప్పాలన్నారు.

సీఎంనుద్దేశించి మాట్లాడుతూ, మీకు తెలియకుండా సమాచారం వెళ్లడం తప్పు…ఒకవేళ కేంద్రం ఆ విధంగా భావిస్తే మిమ్మల్ని డిస్మిస్ చేసి అలా వ్యవహరించాలి అని చంద్రబాబు అన్నారు. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం సమాచారం కావాలని తమను అడిగిందని, సమాచారాన్ని ఇవ్వాలని తానే సీఎస్‌కి చెప్పానని అన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనం కోసం ఇదంతా చేస్తున్నారని కాంగ్రెస్‌ను విమర్శించారు. అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఎగతాళి చేస్తున్నారు. నేను సోమవారం అన్ని విషయాలపైనా అభిప్రాయాలను వెల్లడిస్తా అంటూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రపతికి బిల్లును తిప్పిపంపి హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రికి సూచించారు. శాసనసభ ఎవరికో సర్వెంట్ కాదు. బిల్లును తిప్పి పంపండి అని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.