లోక్‌పాల్‌కు రాజ్యసభ ఓకే

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఎన్నో రాజకీయ ఆటంకాలు ఎదుర్కొంటూ.. ఎంతోకాలంగా ఆమోదం కోసం ఎదురుచూస్తున్న చరివూతాత్మకమైన లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదం పొందింది. అవినీతి నిరోధక జవాబుదారీ వ్యవస్థ(అంబుడ్స్‌మన్) ఏర్పాటు దిశలో ఈ మేరకు మరో కీలక ముందడుగు పడింది. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు-2011పై మంగళవారం పెద్దలసభ దాదాపు ఐదు గంటలపాటు చర్చ చేపట్టి.. మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదానికి దాదాపు అన్ని పార్టీలు అంగీకరించగా, ఒక్క సమాజ్‌వాదీ పార్టీ మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభ నుంచి ఉదయమే వాకౌట్ చేసింది. సామాజికవేత్త అన్నా హజారే పోరాటంతో మళ్లీ తెరపైకి వచ్చిన లోక్‌పాల్ బిల్లు మరోసారి బుధవారం లోక్‌సభకు ముందుకు వెళ్లనుంది.

annahaz1ఈ బిల్లును 2011 డిసెంబర్‌లో లోక్‌సభలో ఆమోదించినప్పటికీ, బిల్లులో తాజాగా చేసిన పలు సవరణలపై దిగువసభ ఆమోదం కోరనుంది. పలు రక్షణలతో ప్రధానమంవూతిని లోక్‌పాల్ పరిధిలో తేవడంతోపాటు పలు కీలక సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పబ్లిక్ సర్వెంట్లను కూడా బిల్లు పరిధిలోకి తెచ్చింది. రాష్ట్రాలలో లోకాయుక్త ఏర్పాటు తప్పనిసరి అన్న నిబంధనను తొలగించింది. ఈ నిబంధన కారణంగానే లోక్‌పాల్ బిల్లు 2011 డిసెంబర్ 29న రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం పొందలేదు. దీంతో బిల్లును తిరిగి పార్లమెంటు స్థాయీ సంఘానికి నివేదించారు. బిల్లుపై విస్తృత ఏకాభివూపాయం సాధ్యమయ్యేలా పలు సవరణలు సిఫారసు చేస్తూ స్థాయీ సంఘం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ సవరణలన్నింటికీ దాదాపు ప్రభుత్వం ఒప్పుకోవడంతో బిల్లు ఆమోదానికి మార్గం సుగమమైంది.

బిల్లుపై వివిధ పార్టీల సభ్యుల అభివూపాయాలు
– లోక్‌పాల్‌కు మద్దతిస్తున్నాం. ఈ బిల్లు పరిధిలోకి ప్రైవేటు సంస్థలైన కార్పొరేట్ కంపెనీలు, చారిటబుల్ సంస్థలు, విదేశీ ఎన్జీవోలను తీసుకురావాలి. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల్లోని అక్రమాలపై కూడా లోక్‌పాల్ దర్యాప్తు అధికారం ఉండాలి – సీతారాం ఏచూరి (సీపీఎం)
– లోక్‌పాల్ బిల్లుకు పూర్తిగా మద్దతిస్తున్నాం. ఈ బిల్లుపై అఖిలపక్షం సమావేశానికి మమ్మల్ని పిలువకపోవడం సరికాదు- సతీశ్‌చంద్ర మిశ్రా (బీఎస్పీ)
– బిల్లుకు మద్దతిస్తున్నాం. అయితే లోక్‌పాల్ చైర్మన్ లేదా సభ్యులుగా ప్రజావూపతినిధులను ఎన్నుకోరాదని పేర్కొనడంలో హేతుబద్ధత లేదు- సుఖ్‌దేవ్ శేఖర్‌రాయ్ (టీఎంసీ)
– బిల్లును స్వాగతిస్తున్నాం. బీహార్ సర్కారు అవినీతి అధికారుల ఆస్తుల స్వాధీనానికి ఇప్పటికే చట్టం తెచ్చింది- శివానంద్ తివారీ (జేడీయూ)

– ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురాకూడదు- వీ మైత్రేయన్ (అన్నాడీఎంకే)
– సీఎం పదవిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలి- డీఎంకే
– విజిల్ బ్లోయర్ బిల్లును కూడా ప్రభుత్వం వెంటనే సభలో ప్రవేశపెట్టాలి. ప్రధాని కార్యాలయాన్ని లోక్‌పాల్ పరిధిలోకి తేవాలి- రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ)
– లోక్‌పాల్‌ను వ్యతిరేకిస్తున్నాం. ఇది మరో రాజ్యాంగ సంస్థను సృష్టించడమే అవుతుంది. లోక్‌పాల్ మన రాజ్యాంగ స్ఫూర్తిని దారుణంగా దెబ్బతీస్తుంది. లోక్‌పాల్ వ్యవస్థ విఫలమైతే దానిని ఎలా తొలగిస్తారు- అనిల్ దేశాయ్ (శివసేన)
– బిల్లుకు మద్దతిస్తున్నాం. దీనిని గత ఏడాది తీసుకువచ్చివుంటే ఆంధ్రవూపదేశ్ ప్రయోజనం పొంది ఉండేది- వైఎస్‌చౌదరి (టీడీపీ)

చరివూతాత్మక ముందడుగు: ప్రధాని హర్షం
లోక్‌పాల్ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ హర్షం వ్యక్తంచేశారు. ఇది చరివూతాత్మక ముందడుగు అని ఆయన అభివర్ణించారు. బిల్లుకు మద్దతునిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

annahazలోక్‌పాల్‌లో కీలక సవరణలు
– పలు రక్షణలతో లోక్‌పాల్ పరిధిలోకి ప్రధాని
– లోకాయుక్త ఏర్పాటు రాష్ట్రాలకు తప్పనిసరి కాదు
– లోక్‌పాల్ పరిధిలో దర్యాప్తుచేసే సీబీఐ, పోలీసులకు సోదాలు చేసి స్వాధీనం చేసుకునే అధికారాలు
– లోక్‌పాల్ నివేదించే కేసులను దర్యాప్తుచేసే సీబీఐ అధికారిని బదిలీ చేయడం కుదరదు
– లోక్‌పాల్ నియామక కమిటీలో మార్పు.. ఈ కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి నియమించే ప్రముఖ న్యాయవేత్త సభ్యులుగా ఉంటారు

లోక్‌పాల్ ఒక్కటే అవినీతిని నిర్మూలించలేదు: సిబల్
లోక్‌పాల్ బిల్లుపై మంగళవారం సభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబల్ మాట్లాడుతూ బిల్లుపై ఏకాభివూపాయం వ్యక్తమైన ఈ దినం చరిత్మాత్మకమని, సంబురాలు చేసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి వీ నారాయణస్వామి భార్య అనారోగ్యం కారణంగా సభకు హాజరుకాకపోవడంతో కపిల్ సిబల్ చర్చను ప్రారంభించారు. పలు అంశాలపై సభ్యుల భయాలను దూరం చేసేందుకు ప్రయత్నించిన సిబల్.. లోక్‌పాల్ చేపట్టబోయే అవినీతి కేసుల విచారణలో ప్రభుత్వ జోక్యం ఉండబోదని స్పష్టంచేశారు. లోకాయుక్త నమూనా బిల్లులను అన్ని రాష్ట్రాలు తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌పాల్ ఒక్కటే అవినీతి నిర్మూలించలేదని, కానీ అవినీతిపరులపై కఠినంగా వ్యవహరించేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

మారిన పరిస్థితుల వల్లే..: జైట్లీ
ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించారు. ‘మారిన పరిస్థితుల’ నేపథ్యంలో బిల్లులో కోరిన మార్పులన్నింటికీ ప్రభుత్వం అంగీకరించిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల్లో లోక్‌పాల్ డిమాండ్‌తో పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ప్రస్తుత లోక్‌పాల్ బిల్లును మెరుగుపరిచేందుకు ఎంతో అవకాశముందని పేర్కొన్న ఆయన.. మత రిజర్వేషన్ల ప్రాతిపదికన లోక్‌పాల్‌లో నియామకాలు చేపట్టడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని, ఇది రాజ్యాంగపరంగా చెల్లదన్నారు. 2011 డిసెంబర్ 29న పెద్దలసభలో గందరగోళం వల్ల లోక్‌పాల్ ఆమోదం పొందని పరిస్థితి పునరావృతం కారాదని పేర్కొన్నారు.

లోక్‌పాల్ వల్ల ప్రభుత్వ నిర్ణయాధికారానికి ఆటంకమేర్పడుతుందన్న వాదన సరికాదని, దీనివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోరాదన్న స్పృహ పెరిగి.. విధాన నిర్ణయ ప్రక్రియ మరింత మెరుగవుతుందని జైట్లీ అభివూపాయపడ్డారు. లోక్‌పాల్ పరిధిలోని దర్యాప్తు యంత్రాంగానికి నోటీసు ఇవ్వకుండానే సోదాలు చేసి స్వాధీనం చేసుకునే అధికారం ఉందా? లేదా? ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌పాల్ పరిధిని విస్తరించాలని కోరారు. కేంద్రమంత్రి సిబల్ స్పందిస్తూ 2011 డిసెంబర్‌లో సాంకేతిక కారణాల వల్ల లోక్‌పాల్ సభ ఆమోదం పొందలేదన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి వల్లే ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిందన్న జైట్లీ పరోక్ష విమర్శలను తోసిపుచ్చారు. కాగా, లోక్‌పాల్ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమంటూ ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.