లైసెన్స్‌కు లాటరీయే!

తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సమైక్య రాష్ట్రంలో గతేడాది అమలుచేసిన విధానాన్ని స్వలంగా సవరిస్తూ 2014-15 వార్షిక ఎక్సైజ్ పాలసీని రూపొందించింది. మద్యం షాపుల లైసెన్సును ఒక్క సంవత్సరానికే పరిమితం చేస్తూ, ఈ ఏడాది కూడా లాటరీ పద్ధతిలోనే లైసెన్సులను కేటాయించాలని నిర్ణయించింది. నూతన విధానం జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. లైసెన్సుల రుసుములలో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో గతేడాది లైసెన్సు రుసుము రూ. 1కోటీ నాలుగు లక్షలుండగా తాజా పాలసీలో రూ. 90 లక్షలకు కుదించింది. 5 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.64 లక్షలుండగా దానిని రూ. 68 లక్షలకు పెంచింది. 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో గతేడాది వసూలు చేసిన రూ.46 లక్షల లైసెన్సు రుసుమును రూ. 50 లక్షలకు పెంచింది. 

Padma

మిగిలిన స్లాబుల్లో రుసుములను యథావిధిగా కొనసాగిస్తూ నూతన పాలసీని రూపొందించింది. ఈ ఏడాదిలో 2,216 మద్యం దుకాణాల ద్వారా ఆబ్కారీశాఖ రూ.9,800 కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. లైసెన్సు ఫీజుల ద్వారా రూ.900 కోట్లు వస్తాయని అంచనావేసింది. గతేడాది లైసెన్సు ఫీజుల భారం కారణంగా 20 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో దుకాణాలను తీసుకొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపకపోవటంతో భారీగా మిగిలిపోయాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 157 మద్యం దుకాణాలు మిగిలాయి. మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో 6,596 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీచేయగా, అందులో సుమారు 1200 దుకాణాలకు దరఖాస్తులే రాలేదు. పదిసార్లు రీ నోటిఫికేషన్లు జారీ చేసినా చివరకు 290 దుకాణాలు మిగిలిపోయాయి. దీనిని దష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అధిక లైసెన్సు రుసుము భారం ఉన్న మొదటి స్లాబులో రూ.14 లక్షలు తగ్గించింది.

ఈ నష్టాన్ని పూరించుకొనేందుకు ఇతర స్లాబుల్లో రుసుమును పెంచింది. అదేవిధంగా అన్ని మద్యం దుకాణాలకు రూ. ఒక లక్ష లైసె న్సు రుసుముతో పర్మిట్ రూములను అనుమతించాలని పాలసీలో నిర్దేశించింది. ఒకే విధమైన లైసెన్సు రుసుములు ఉన్న ప్రాంతాల్లో డిమాండ్‌కు అనుగుణంగా దుకాణాలను ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి మార్చేందుకు అనుమతించడం ద్వారా మిగిలిన దుకాణాలను కూడా తెరిపించాలని సర్కార్ నిర్ణయించింది. తాజా లైసెన్సులు ఈ ఏడాది జులై 1నుంచి 2015 జూన్ 30వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. మరిన్ని ప్రాంతాల్లో తెలంగాణ బ్రీవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎక్సైజ్ యాక్టు 18(1) ప్రకారం ఔట్‌లెట్లు కొనసాగిస్తామని శనివారం నాటి ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. దీంతో వ్యాపారులు ముందుకురాని ప్రాంతాల్లో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. మద్యం దుకాణాలు తమ లైసెన్సు ఫీజులకంటే 7ట్లు అధిక మద్యం విక్రయాలు జరిపితే అదనంగా 8శాతం అమ్మకం పన్నును వసూలు చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. మద్యం కారణంగా కలిగే దుష్ఫలితాలను ప్రజలకు వివరించేందుకు కార్యాచరణను చేపట్టనున్నట్లు కూడా ఈ ఏడాది ఆబ్కారీ విధానంలో పొందుపర్చారు.
2014-15 మద్యం పాలసీలో ప్రధానాంశాలు..
-2011 జనాభా లెక్కల ఆధారంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాలు, గ్రామాలకు లైసెన్సుల కేటాయింపు.
-లైసెన్సుల దరఖాస్తులకు తుది గడువు ఈనెల 21 సాయంత్రం 5గంటల లోపు.
-23న ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీలు.
-24న ప్రొవిజనల్ లైసెన్సుల జారీ.
-30న తుది లైసెన్సుల జారీ.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.