లేటుకే లీకులు! రాయల టీ రచ్చ!

తెలంగాణ నేతలను ఆరాతీస్తున్న ఐబీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో అపశ్రుతి!.. ఎవరి మాటా లెక్కచేయకుండా నిబ్బరంగా ప్రక్రియ కొనసాగిస్తున్న కేంద్రం తాజాగా రాయల తెలంగాణ అంశంపై ఆరాలు తీస్తోందని తెలిసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత రెండు మూడు రోజులుగా తెలంగాణ నేతలనుంచి అభిప్రాయసేకరణ జరుగుతున్నట్టు తెలియవచ్చింది. నాలుగు ప్రశ్నలు: 1.రాయల తెలంగాణ ఏర్పాటైతే ఎలా ఉంటుంది? 2. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? 3. ప్రజలు ఎంతవరకు అంగీకరించే అవకాశముంది? 4. రెండు జిల్లాలు కలుపుకొంటే రాజకీయంగా సుస్థిరత వస్తుందా?.. అనే ప్రశ్నలు వేసి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అయితే, అలాంటి అభిప్రాయాల సేకరణ జరగడం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నా ఆయా వర్గాల అధికారులతో నేరుగా పరిచయాలున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు ఫోన్ల ఆరా అంశాన్ని ధ్రువీకరించారు.

నవంబర్ 24 :రాయల తెలంగాణ ఏర్పాటు అంశంపై ఐబీ ఆరా అనేక సందేహాలకు తావిస్తున్నది. ఇన్నాళ్లూ హడావిడి చేసి చేసి .. చివరకు శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు దాటవేతకే కేంద్రం ఇప్పుడు రాయల తెలంగాణ అంశం తెరపైకి తెచ్చిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అభిప్రాయ సేకరణ అందులో భాగమేనని భావన ఏర్పడుతున్నది. ఇంకోవేపు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెలంగాణపై మాట మార్చేస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీయడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి. తెలంగాణ బిల్లు తుదిరూపం దిద్దుకుంటున్న సమయంలో ఇలాంటి ఫోన్లేమిటో, దీని మర్మమేమిటో అర్థంకాక ఎమ్మెల్యేలు అయోమయంలో పడ్డారు. పది జిల్లాల తెలంగాణ తప్ప మరేదానికి తాము అంగీకరించేది లేదని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు ఐబీ వర్గాలకు స్పష్టంచేసినట్టు తెలిసింది. ఈ విషయం ఆరా తీసిన విలేకరులకు దాదాపు ఎమ్మెల్యేలంతా ఇదే విషయాన్ని చెబుతున్నా, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానం ఒప్పుకొంటే రాయల తెలంగాణకు కూడా సరేనన్నట్టు తెలిసింది.

మొత్తంమీద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిర్మొహమాటంగా రాయల తెలంగాణను తిరస్కరిస్తే , అధికారపార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొద్ది మంది తప్పని పరిస్థితుల్లోనే రాయల తెలంగాణకు అంగీకరిస్తామని చెప్పారు. ఇది తెలంగాణ వాదుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం ఇన్నాళ్లూ చెప్పి, ఇపుడు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకురావడం సీమాంధ్రుల కుట్రేనని మెజారిటీ తెలంగాణ ఎమ్మెల్యేలు దుయ్యబడుతున్నారు. విభజనకు సమయం దగ్గరపడ్డాక రోజుకో సరిహద్దు సమస్యను, జలవివాదాలను తెరమీదకు తెస్తున్న సీమాంధ్ర నాయకులు రాయల తెలంగాణ పేరిట మొత్తం ప్రక్రియకు గండి పెట్టే ప్రయత్నం
చేస్తున్నారంటున్నారు. రాయల తెలంగాణ వల్ల రాజకీయ అస్థిరత తొలగుతుందని, జలవివాదాలు కూడా పరిష్కారమవుతాయని కేంద్రాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ నాయకులు కూడా ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం చేసి ఐబీని రంగంలోకి దింపారని భావిస్తున్నారు. వెన్నెముకలేని కాంగ్రెస్ నేతలు మొగ్గుచూపితే దాని ఆధారంగా తమ వాదనకు కార్యరూపం ఇవ్వాలనేది వారి ఆలోచనగా ఉంది.

రాయల ప్రతిపాదనతో అసెంబ్లీలో తెలంగాణబిల్లు వీగిపోకుండా ఉంటుందని, లేకపోతే గందరగోళం ఏర్పడుతుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.ఈ ప్రతిపాదనకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలతో అభ్యంతరం లేదని చెప్పించేందుకు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రాయల తెలంగాణ వల్ల రెండు రాష్ట్రాల్లో 42 ఎంపీ స్థానాలు చెరిసగమవుతాయని వాదిస్తున్నారు. 294 ఎమ్మెల్యే స్థానాల్లో రాయల తెలంగాణకు 147 స్థానాలు వస్తాయని అధిష్ఠానానికి ఆశ చూపుతున్నారు.

అదంతా వట్టిదే : ఐబీ అధికారి
రాయల తెలంగాణ విషయమై అభిప్రాయాలు తీసుకున్నట్టు వచ్చిన వార్తలను రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు కొట్టివేస్తున్నాయి. తాము ఇలాంటి ప్రయత్నమేమీ చేయలేదని చెబుతున్నాయి. ఐబీ అలాంటి ఆరాలు తీయడంలేదని ఇంటలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు ‘టీ మీడియా’కు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లోనే తెలంగాణ బిల్లును కేంద్ర కేబినేట్ ఆమోదిస్తుందని సమాచారమున్న నేపథ్యంలో కొత్తగా కేంద్రానికి సమాచారం పంపించాల్సిన అవసరం లేదని ఆ అధికారి చెప్పారు. ఇదంతా రూమర్ లేదా ఐబీ పేరుతో ఇతరులు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చనని అభిప్రాయపడ్డారు. అనుమానాలను రేకెత్తించేందుకు, అయోమయం కలిగించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశముందని చెప్పారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.