లా పతా భూములూ ఆంధ్రోళ్ల ఖాతాకే

హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైనపుడు నిజాం ఆధీనంలో ఉండిన లక్షల ఎకరాల భూములు సీమాంధ్ర పాలనలో అన్యాక్రాంతమయ్యాయి. వీటి విలువ కోట్లలోనే ఉంటుంది. వీటితో పాటు నిజాం ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు, పరివారంలో పనిచేసిన సిబ్బందికి సైతం భారీగా వ్యవసాయ భూములు, తోటలు ఉండేవి. మిలిటరీ చర్యతో భీతిల్లి, రాత్రికి రాత్రే కొందరు, ఇతరత్రా కారణాలతో మరికొందరు పాకిస్థాన్, లండన్ వలస వెళ్లిపోయారు. అలా అనాథగా మిగిలిన ఆస్తులన్నీ ‘బొనావేకెన్షియా’ స్థలాలుగా గుర్తించి, నిబంధనల ప్రకారం వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బొనావేకెన్షియా స్థలాలు వందల్లో ఉండేవి. అవన్నీ ఏమయ్యాయన్నదానికి సీమాంధ్ర సర్కారు దగ్గర సమాధానం లేదు.
book
వాస్తవానికి నిజాం సంస్థానాన్ని స్వాధీన పరుచుకున్న అనంతరం పాలన చేపట్టిన మిలిటరీ ప్రభుత్వం సర్వేయర్ల సాయంతో నిజాం నుంచి స్వాధీనపరుచుకున్న భూములు, భవనాలు, అనాథలుగా మిగిలిన భూములు, ప్రభుత్వ భూములను గుర్తించి ఆ వివరాలతో ఓ ఫైలు తయారు చేయించింది. దాన్ని రెడ్‌బుక్ అని పిలిచేవారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఉండాల్సిన ఆ ఫైలు తర్వాత కాలంలో గల్లంతైంది. ఆ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అదే సమయంలో సీమాంధ్ర నుంచి ఇక్కడకి వచ్చి చేరిన అధికారులు, పెట్టుబడి దారులకు అకస్మాత్తుగా భవనాలు భూములు పుట్టుకొచ్చాయి. విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ సంస్థానంలో పుట్టి పెరిగిన వారికి వందల ఎకరాలు, స్థలాలు పెద్దగా లేవు. ఇక్కడ నిజాం హయాంలో జాగిర్దార్లు, భూస్వాములున్నారు. వారికి సంపదకు కొదవ లేదు. అయినా వారెవరికీ లేని సంపద సీమాంధ్రులకు మాత్రం సాధ్యమైంది. అనాథ భవనాల్లో స్థానికులు నివసించిన సందర్భాల్లో సీమాంధ్ర అధికారులు కావాలని పిటిషన్లు వేయించి వివాదం సృష్టించి మధ్యవర్తులను దింపి బేరసారాలతో చవగ్గా కొట్టేసిన కేసులు వందల్లో ఉన్నాయన్నది తెలంగాణ వాదుల ఆరోపణ.

రెండు లక్షల ఎకరాల సర్ఫేకాజ్ ….
నిజాం సంస్థానంలో 16 జిల్లాలు ఉండేవి. ఇందులో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు సర్ఫేకాజ్ భూమి. అంటే నిజాం స్వంత అవసరాల కోసం తన ఆధీనంలో ఉంచుకున్న భూమి. వివిధ ధార్మిక సంస్థలకు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల నిర్వహణకు, పేదలకు, అధికారులకు దానంగా విరాళంగా ఇచ్చిన భూమి కాకుండా ఆయన ఆధీనంలో రెండు లక్షల ఎకరాలకు పైగా భూమి ఉండేది. వచ్చే ఆదాయాన్ని తన సొంత ఖర్చులకు వినియోగించుకునే వాడు. అలాగే హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత నిజాం రాజ్యంలో పని చేసిన మంత్రులు, ఉన్నతాధికారులు వందలాది మంది విదేశాలకు వలసపోయారు. వీరంతా సంపన్నులే. వెళ్లిపోయేటప్పుడు డబ్బు నగలు వంటి విలువైన ఆస్తులన్నీ తీసుకెళ్లినా, వారి పేరిట ఉన్న వేలాది ఎకరాల భూములు, విశాలమైన భవనాలు అనాథలుగా వదిలేసి వెళ్లారు. బంజారాహిల్స్, నాంపల్లి, సైదాబాద్, జూబ్లీహిల్స్, చార్మినార్, ఖైరతాబాద్, అమీర్‌పేట ప్రాంతాల్లోనే ఆ అధికారులు అధికంగా నివసించేవారు. హైదరాబాద్ జిల్లాలో బొనావేకిన్షియా స్థలాలు వందల్లో ఉండాలన్నది చారిత్రక సత్యం.

చట్టం చెబుతున్నదేమిటంటే..
బొనావేకెన్షియా (యజమానులు లేని భూమి, దిక్కు లేని భూములు) చట్టం-1974 సెక్షన్ 9 ప్రకారం వారసులు లేకుండా చనిపోయిన వారి భూములను స్థానిక తహసీల్దార్లు స్వాధీనం చేసుకోవచ్చు. జాయింట్ కలెక్టర్ సెక్షన్-11(1) కింద నోటిఫికేషన్ ఇస్తారు. మూడు నెలల్లోపు ఎవరైనా అభ్యంతరాలు చెప్పాల్సి ఉంటుంది. ఇలా స్వాధీనం చేసుకునే భూములను 13 సంవత్సరాల వరకు ఎవరికి కేటాయించకూడదు. ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నప్పటికీ బదలాయింపు అధికారం ఉండదు.ఇదే తరహాలో నిజాం కాలంలో నాన్ ఇండియన్ సెక్యురిటీ ఫోర్సు కింద కొన్ని స్థలాలు ఉండేవి. వాటిని పూర్తిగా ప్రభుత్వ ఖాతాలో లేదా ల్యాండ్ బ్యాంకులో వేసుకోవడానికి అభ్యంతరాలు ఉండవు.

ఖరీదైన ప్రాంతాల్లోనే ఎక్కువ
నాంపల్లి, షేక్‌పేట, అమీర్‌పేట, ఆసిఫ్‌నగర్, చార్మినార్, ఖైరతాబాద్, సైదాబాద్, బండ్లగూడ మండలాల్లోనే నిజాం సంస్థానంలో పని చేసే అధికారులు, ఉద్యోగులు ఉండేవారు. ఉన్నతాధికారులందరికీ పెద్ద పెద్ద భవంతులు, విశాలమైన స్థలాలు ఉండేవి. వీరిలో చాలా మంది వలసపోయారు. వలస పాలకులు ఆ భూములను అధికారికంగా స్వాధీనం చేసుకోలేదు. ఇదే అవకాశంలో అధికారుల అండదండలు, పాలకుల సహకారంతో పలువురు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి వాటిని కాజేశారు. పక్క ప్లాటు లేదా పక్కనే ఉన్న సర్వే నెంబర్లతో యాజమాన్య హక్కులను సంపాదించుకున్న పెద్దలు కొందరైతే, క్రమబద్ధీకరణ ప్రక్రియతో కాజేసిన అక్రమార్కులు మరికొందరు ఉన్నట్లు తెలంగాణవాదులు చెబుతున్నారు.

నిజాం ఔదార్యం గాల్లో కలిసింది
హైదరాబాద్ సంస్థానంలో ఉండే ఇతర దేశీయుల రక్షణ కోసం నాన్ ఇండియన్స్ సెక్యురిటీ ఫోర్సు పేరిట కొన్ని స్థలాలు ఉంచారు. కానీ ఆ నిజాం ఔదార్యం నేడు సర్కారు లెక్కల్లో కనిపించడం లేదు. ఇలా నాన్ ఇండియన్స్ సెక్యురిటీ ఫోర్సు కింద సికింద్రాబాద్, బంజారాహిల్స్, మారేడుపల్లి, కంటోన్మెంట్ ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఉండేవి. వాటిని కూడా అక్రమార్కులు ఏనాడో వారి ఖాతాలో జమ చేసుకున్నారు.

స్వాధీనం ఇంతేనా..?
కొంత కాలం క్రితం చార్మినార్ మండలంలో బొనావేకెన్షియా చట్టం కింద నోటీసులు జారీ చేసి కొంత భూమిని స్వాధీనం చేసుకున్నారు. 2003లో షేక్‌పేట మండల పరిధిలోని 2.20 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు జారీ, ఆ తర్వాత మూడు నెలలకు సర్కారు ఖాతాలో చేర్చారు. దాని విలువ ప్రస్తుత మార్కెట్‌లో సుమారు ₹ 80 కోట్లకు పైమాటే. అయితే దాన్ని విక్రయించడానికి లేదా ప్రజావసరాలకు వినియోగించాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందే. అయితే దీన్ని ఆక్రమించడానికి ప్రయత్నించే పెద్దలకు ఓ జిల్లా స్థాయి అధికారి సంపూర్ణ సహకారం అందించి విఫలమైనట్లు గుసగుసలు ఉన్నాయి. మారేడుపల్లి మండల పరిధిలోనూ 2 వేల గజాల స్థలాన్ని ఖాతాలో వేసుకోవడంలో అధికారులు విఫలమయినట్లు సమాచారం.

పెద్దలు గద్దలుగా..
నగరానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతో ఇలాంటి స్థలాలను స్వాహా చేశారు. ఆసిఫ్‌నగర్ మండలం మల్లేపల్లి గ్రామ రెవెన్యూ రికార్డు ప్రకారం టౌన్ సర్వే నెం.17లో సుమారు 1200 గజాల స్థలాన్ని ఓ మంత్రి అనుచరుడు కబ్జా చేసి, కనీసం నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం కూడా తీసుకోకుండానే నాలుగంతస్తుల భవనాన్ని నిర్మించేశాడు. దీనిపై రెవెన్యూ అధికారులు కదిలే సమయానికి సదరు మంత్రి నుంచి హెచ్చరికలు రావడంతో వెనక్కి తగ్గారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అనేక స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. ఇంకా ఖాళీగా ఉన్నాయనుకుంటున్నట్లు అధికారులు భావిస్తున్న స్థలాలన్నీ పెద్దల చేతుల్లో నలిగిపోతున్నాయి. పక్కా డాక్యుమెంట్లు సృష్టించి సొంతం చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఏం చేయాలి..?
– బొనావేకిన్షియా స్థలాలను 1974 సంవత్సరం నాటి స్థితిగతులను గుర్తించి, ప్రస్తుతం ఎన్ని అందుబాటులో ఉన్నాయో సర్వే నిర్వహించాలి. థర్డ్ పార్టీ నుంచి వెంటనే స్వాధీనం చేసుకోవాలి.
-నాన్ ఇండియన్ సెక్యురిటీ ఫోర్స్ కింద నిజాం కాలంలో ఎక్కడెక్కడ స్థలాలు, ఎంత మేరకు ఉన్నాయో రికార్డులను పరిశీలించాలి. వీటిలో లీజుకు ఇచ్చిన, క్రమబద్ధీకరించిన స్థలాలను గుర్తించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలి.

This entry was posted in ARTICLES.

Comments are closed.