మహబూబ్‌నగర్: తెలంగాణ ఉద్యమంలో లాఠీలకు, తూటాలకు భయపడేదిలేదని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ జైళ్లు, లాఠీలు, తూటాలు ఉద్యమాన్ని ఆపలేవని ఆయన హెచ్చరించారు. అక్రమంగా తెలంగాణ ఉద్యమనేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. ఏం నష్టానికి పాల్పడ్డారని టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ నేతలను అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించారు. ఇది కిరణ్ సర్కార్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తోన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అరెస్టు చేస్తారా?: కేసీఆర్
తెలంగాణ వాదులు శాంతియుతంగా సడక్‌బంద్ కార్యక్రమం నిర్వహిస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా? అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏం తప్పు చేశారని టీఆర్ఎస్, జేఏసీ నేతలను అరెస్టు చేసి జైళ్లో పెట్టారని నిలదీశారు. ఈ అరెస్టులు అప్రజాస్వామికమని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నానని కేసీఆర్ చెప్పారు.
సీఎం కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నడు: కేసీఆర్
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నాడని కేసీఆర్ మండిపడ్డారు. నియంతల్లాంటి సీఎంలను చాలా మందిని చూశామని ఆయన అన్నారు. బ్రహ్మనందరెడ్డి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ఇలాంటి ఎంతో మంది సీఎంలను చూశామని తెలిపారు. మంచేదో చెడేదో ప్రజలే చూస్తున్నారని అన్నారు.
అంతిమంగా తెలంగాణ ప్రజలదే విజయం: కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో అంతిమంగా తెలంగాణ ప్రజలే గెలుస్తారని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పోరాటం గెలిచి తీరుతదని ఆవేశంతో అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికైనా ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.
కాంగ్రెస్ మాట నిలుపుకోలేదు: కేసీఆర్
తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌పార్టీ మాట నిలుపుకోలేదని కేసీఆర్ విమర్శించారు. మూడేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలుపుకోలేక పోయిందని దుయ్యబట్టారు.