లగేరహో రహెమున్నీసా!

raju-munnisa talangana patrika telangana culture telangana politics telangana cinema

చుట్టుముట్టిన ఖాకీల నడుమ
నువ్ శివమూగిన కాలికమ్మవు
జన్మనిచ్చిన గడ్డమీద
నీకెంత పాయిరం తల్లీ !
ఒడువని యుద్ధాన్ని భుజానేసుకొని
సిరిసిల్ల ఎర్రబస్సెక్కినవా…
త్యాగాల మట్టిమీద సరికొత్త చరిత్ర రాసినవ్
భయమెరుగని కొదమసింగమై
అవినీతి రాబందుల మీద గర్జించినవ్
సమ్మక్క సారక్కల సాలుదప్పని
చాకలి ఐలమ్మవైనవ్
గుండెరగిలిన నాలుగు కోట్లమంది
కోపాన్నంత ఒంటినిండా పులుముకొని
పటపట పండ్లు కొరికిన పౌరుషమా
నీ తెగింపుకు సలాం
వాళ్ళ శవరాజకీయాల కంపు చూసి
చలించిపోయావా బహెన్
ఉరిపోసుకున్న మగ్గాల ఉసురంత
నీ కడుపుమంటై ఎగిసిందా బిడ్డా
గుండాలుంటేనేం…
గుండ్లు నిండిన తుపాకులుంటేనేం
బలగాలుంటేనేం…
బట్టేబాజీ రౌడీలుంటేనేం
మానుకోట కొట్లాటను యాది జేసి
శత్రువుకు చెప్పు చూపిన నీ తెగువకు సలాం
సిరిసిల్ల ఇప్పుడు…
నీ సత్తువ నింపుకున్న పోరుఖిల్ల
(విజయమ్మ గూండాల చేతిలో గాయపడ్డ
బహెన్ రహెమున్నీసా కోసం)

-పసునూరి రవీందర్

This entry was posted in POEMS.

Comments are closed.