రేపే చర్చ ముగించండి- కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌తో కేసీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఈ ప్రక్రియను తొందరగా ముగించాలని చూస్తోంది. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కంటే ముందే సభలో చర్చ చేపట్టేలా చూడాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే.. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఢిల్లీలోని ఆయన ఇంటివద్ద కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాంరమేశ్ శనివారం రాత్రి కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

kcrsuit తెలంగాణ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని జైరాంను కేసీఆర్ కోరినట్టు సమాచారం. టీఆర్‌ఎస్ సూచించిన పలు సవరణలపై వారిద్దరి మధ్య చర్చ జరగగా.. కొన్నింటిపై సర్దుకుపోవాలని కేసీఆర్‌కు జైరాంరమేశ్ సూచించినట్టు తెలిసింది. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన పరిణామాలతో పాటు పలు సవరణల అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. సోమవారం సమావేశంలోనే తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభించి, బిల్లుకు ఆమోదముద్ర వేయించాలని కేసీఆర్ కోరారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కంటే ముందే ఈ ప్రక్రియను ముగించాలని కోరినట్టు తెలిసింది. అదేవిధంగా తాము సూచించిన సవరణల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే మీరు సూచించిన సవరణలపై పట్టువిడుపులు ఉండాలని జైరాం రమేశ్ సూచించినట్టు సమాచారం.

ఉమ్మడి రాజధానిగా కొనసాగినంత కాలం హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాలు ఉంటాయని జైరాం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్‌ను సీమాంధ్రకే చెందుతుందని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాలపై సహకరించాలని జైరాం.. కేసీఆర్‌ను కోరినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రం కోసం మరో భవనాన్ని కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.