రేపు తెలంగాణ బంద్-మరో సమరమేనన్న కేసీఆర్

 రాయల తెలంగాణ ప్రతిపాదనపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. ఎవరినడిగి రాయల తెలంగాణ ఇస్తున్నారని కేంద్రాన్ని నిలదీశారు. వందల మంది తమ బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది, కేసులు భరించింది పది జిల్లాల తెలంగాణ కోసమేగానీ.. రాయల తెలంగాణ కోసం కాదని స్పష్టం చేశారు. తమ వ్యతిరేకతలను కాదని కేంద్రం రాయల తెలంగాణపైనే ముందుకు పోవాలనుకుంటే మరో సంగ్రామం తప్పదని హెచ్చరించారు. ఆరు నూరైనా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామన్న కేసీఆర్.. సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో యుద్ధానికి టీఆర్‌ఎస్, తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 5న తెలంగాణ సంపూర్ణ బంద్‌కు టీఆర్‌ఎస్ అధినేత పిలుపునిచ్చారు. బుధవారం పది జిల్లాల్లోని పల్లెలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని తెలంగాణ ఉద్యమశ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఎన్నటికీ రాయల తెలంగాణను ఒప్పుకోడని, సంపూర్ణ తెలంగాణ కోసం యుద్ధం చేస్తాడని చెప్పారు. సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే…

‘సీడబ్ల్యూసీ తీర్మానంలో కేవలం 10 జిల్లాల తెలంగాణే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తీర్మానంలో కూడా 10 జిల్లాల తెలంగాణే ఉంది. ఇప్పుడు రాయల తెలంగాణ అంటే వారి నిర్ణయాన్ని వారే వ్యతిరేకించుకున్నట్లు అవుతుంది. మా ప్రాణాలు పోయినా రాయల తెలంగాణను అంగీకరించేది లేదు. మరో యుద్ధానికి తెరతీస్తాం. రెండుమూడు రోజులుగా సైలెంట్‌గా ఉన్నా. బాధ్యతాయుతమైన సంస్థగా తొందరపాటు పడలే. జీవోఎం, కేబినెట్ సమావేశాలు రేపు, ఎల్లుండి ఉన్నాయి కాబట్టే కార్యాచరణను రూపొందించాం.

రాయల తెలంగాణపై కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలతోపాటు.. నాకు ఢిల్లీలో ఉన్న సోర్స్ ద్వారా కూడా తెలుస్తున్నది. వాటి ఆధారంగా ఇప్పుడు మాట్లాడుతున్నా. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నా. టీఆర్‌ఎస్ కరాఖండిగా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు లోబడే టీఆర్‌ఎస్ నడుచుకుంటుంది. రాయల తెలంగాణను ఆరునూరైనా అంగీకరించేది లేదు. ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ, జీవోఎం పెద్దలకు కూడా కుండబద్దలు కొట్టి..తెలియజేస్తున్నా. కేవలం రాయలతెలంగాణే కాకుండా చాలా విషయాల్లో తెలంగాణ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందింది. 13 సంవత్సరాల తరువాత కాంగ్రెస్ పార్టీ 10 జిల్లాల తెలంగాణ అంటూనే 119 నియోజకవర్గాల తెలంగాణ అని చెబుతూ సరిహద్దులను కూడా తేల్చుతూ తీర్మానం చేసింది. ఆ తరువాత రెండు మూడు రోజుల్లోనే కేంద్రం కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు దానికి మసిబూసి మారేడు కాయ చేసినట్లుగా వాళ్లకు వాళ్లే భిన్న వాదనలు ముందుకు తెస్తున్నారు.

మా పిల్లల చేసిన బలిదానాలు రాయల తెలంగాణ కోసం కాదు. ఇవాళ శ్రీకాంతాచారి వర్ధంతి. అలాగే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నవారు రాసిన వాంగ్మూలాల్లో కేవలం 10 జిల్లాల తెలంగాణే అడిగారు కానీ రాయల తెలంగాణ అడుగలేదు. మేం జీవోఎంకు ఇచ్చిన నివేదికలో కరాఖండిగా చెప్పాం. ఎవరి సమస్యలను పరిష్కరించేందుకు సమావేశం పెట్టారని కూడా అడిగాం. ఆంధ్రప్రదేశ్ అనేది విఫల ప్రయోగం కనుక తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నాం. మద్రాస్ నుండి ఆంధ్రులు విడిపోయి, కర్నూలు రాజధానిగా ఏర్పడ్డారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా.. అది విఫలమైంది. కనుక వారికొచ్చిన నష్టం లేదు. హ్యాపీగా ఉంటారు. లేనిపోనివి తెచ్చి పెడితే ఒప్పుకోం. కేవలం10 జిల్లాల తెలంగాణే కావాలని కరాఖండిగా చెప్పాం.

అంతా సవ్యంగా జరిగితే తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పాటవుతుంది. దేశంలోని 28 రాష్ట్రాలు కేంద్రంతో ఎలాంటి సంబంధాలు కలిగిఉన్నాయో అలాగే ఉండాలని తెలియజేశాం. భారతదేశానికి ఒక రూల్, తెలంగాణకు ఒక రూల్ ఎలా ఒప్పుకుంటాం? అదే సమయంలో రాజ్యాంగంలో ఎక్కడా ఉమ్మడి రాజధాని అనే పదమే లేదు. మాకూ రాజ్యాంగం తెలుసు. అయినా మేం పెద్ద మనసు చేసుకుని, విడిపోయిన తెల్లవారే వారిని పంపించకుండా ఇక్కడ ఉండటానికి అంగీకరించాం. వారుకూడా మా సోదరులే కనుక ఇక్కడ ఉండొచ్చు అన్నాం. దాన్ని అలుసుగా తీసుకుని ఎక్కడా లేని పద్ధతుల్లో మండళ్లు, కౌన్సిళ్లు అంటే మమ్మల్ని అవమానించినట్లే. మద్రాసు నుండి ఆంధ్రవారు విడిపోయినప్పుడు అప్పటి జనాభాలో తెలుగువారు 19.3శాతం. నేడు శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్‌లో 5 శాతమే ఆంధ్రులున్నారని చెప్పింది. అప్పుడు లేని శాంతిభద్రతల అంశం ఇప్పుడెందుకు పెడతారని చిదంబరంను కూడా ప్రశ్నించాం. ఇలా ఆంక్షలు అనడం వితండవాదం, తెలివితక్కువతనం కాదా? ఇలా నిర్ణయాలు తీసుకుంటే భారతదేశానికి ఒక చెత్త ధోరణిని పరిచయం చేసినట్లు అవుతుందని కూడా చెప్పాం. ఈ పని కేంద్రప్రభుత్వం చేయదగ్గది కాదు. దాదాపు గంటరన్నర పాటు అన్ని అంశాలను చెప్పాం. అయినా మేం చెప్పింది అరోణ్యరోదనే అన్నట్లుగా రాయల తెలంగాణ, ఆంక్షలు అంటూ మాట్లాడుతున్నారు.

కేసీఆర్ ఏనాడూ కూడా రాయల తెలంగాణను అడుగలేదు. అయినా రాయల తెలంగాణను ఎవరడిగారు? నల్లగొండ జిల్లాలో లక్షన్నర మంది ఫ్లోరైడ్‌తో బతుకులు నాశనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జనాభా 35 లక్షలు అయితే ప్రతియేటా 15 లక్షల మంది వలస వెళ్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? కర్నూలు, అనంతపురంలో కట్టిన గాలేరు, నగరి అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తామా? మా తెలంగాణను పచ్చపడగొట్టుకుంటాం కానీ హక్కులు కోల్పోవడానికి తెలంగాణ రాష్ట్రం అడుగుతలేం. మా నిరసనను తెలియజేడానికే కార్యాచరణను రూపొందిస్తున్నాం. కొంతకాలం వ్యతిరేకించినా అంగీకరిస్తారులే అన్నోళ్లు సన్నాసులు. 14 సంవత్సరాల కాలంలో ఎంతో మంది బుడ్డరఖాన్లు వచ్చారు. కానీ కేసీఆర్ వెనకడుగు వేయలే. ఎందుకు రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చారో వారే చెప్పాలి. కేబినెట్‌లో ఆమోదం పొందిన బిల్లు ఆధారంగానే మా కార్యాచరణ, పోరాటం కొనసాగుతుంది. పొలిట్‌బ్యూరోలో మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఇప్పటికే 38 పార్టీల నుండి మద్దతు లేఖలు తెచ్చిన. ఎక్కని కొండలేదు.. మొక్కని బండలేదు. ఇప్పడు కూడా సంపూర్ణ తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తా.

పార్లమెంట్‌లో సవరణలు ప్రతిపాదిస్తా
రాయల తెలంగాణ పెడితే వెంటనే నేను, మా ఎంపీలు సవరణలను ప్రతిపాదిస్తాం. 100శాతం పార్లమెంట్‌కు వెళ్తా. నా వాణి వినిపిస్తా. నా ఆందోళన తెలియజేస్తా. ఏ తెలంగాణ కావాలో చెబుతా. రాయల తెలంగాణ అయితే విద్యుత్ సమస్య తీరుతుందని అంటున్న దాంట్లో వాస్తవంలేదు. మాకు తెలివి లేదా. విద్యుత్ ఎలా ఉత్పత్తి చేయాలో మాకు తెలుసు. మాకు కావాల్సినంత బొగ్గు ఉంది. నీళ్లున్నాయి. అయినా శ్రీశైలంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కేవలం వర్షాలు కురిస్తేనే. అది ఆధారపడ్డతగ్గది కాదు. ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణను అంగీకరించేదే లేదు. జగన్ మాట్లాడే మాటలపై స్పందించను. ఆయన చిన్నపిల్లవాడు’ అని కేసీఆర్ తెల్చి చెప్పారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, ఎంపీ మందా జగన్నాథం, పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహారెడ్డి, నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, రామ్‌లక్ష్మణ్, గోయల్, మధుసూదనాచారి పాల్గొన్నారు.

కార్యాచరణ ప్రకటన
-డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో నిర్వహించబోయే మండల స్థాయి శిక్షణా తరగతులను వాయిదా వేస్తున్నాం. ఈ మూడు రోజల్లో కార్యాచరణ రూపొందించుకున్నాం. డిసెంబర్ నాలుగో తేదీన అన్ని మండల, నియోజకవర్గ, గ్రామ స్థాయిల్లో యువకులు, విద్యార్థులు ర్యాలీలు తీయాలి. రాయల తెలంగాణ వ్యతిరేక ర్యాలీలుగా, సంపూర్ణ 10 జిల్లాల తెలంగాణ అనుకూల ర్యాలీలుగా ఇవి సాగాలి.
-డిసెంబర్ 5న సంపూర్ణ తెలంగాణ బంద్ నిర్వహిస్తున్నాం. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి. వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా సహకరించాలి. ఇది తెలంగాణ లోకానికి సంబంధించినది. అత్యంత కీలకమైన సందర్భం ఇది. మన అభిప్రాయం ఏంటో 100శాతం తెలియజేయాల్సి ఉంది. 14 సంవత్సరాల పాటు మీరు నడిపించారు. సకలజనుల సమ్మె సమయంలో వచ్చిన దసరా, బతుకమ్మ పండుగల సమయంలో ఇబ్బందులున్నా సహకరించారు. జంట నగరాల్లోని వారు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఐటీ, ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా బంద్‌లో పాల్గొనాలి. ఎవరూ మీ వద్దకు వచ్చి బంద్ చేయమని అడుగరు. మీకు మీరే కేసీఆర్‌లు అయి బంద్‌లో పాల్గొనాలి.
-డిసెంబర్ 6న అత్యవసర పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నాం. ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు పార్టీ నేతలంతా భవన్‌లోనే ఉంటారు. కేబినెట్ ఆమోదించే బిల్లుపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం. కేంద్రం మొండిగా పోతే మరో యుద్ధానికి సిద్ధమవుతాం.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.