రేపటి తొలి పొద్దు తెలంగాణల్నే..

కన్నీళ్ళ కత్తుల వంతెనల్ని దాటి
కదనరంగం వైపు అడుగులేస్తున్నం
గొంతు గొంతును కలుపుకుంటూ
గుండె గుండెను తడుముకుంటూ
నినాదాల హోరులో, నారజీరే కమ్మకత్తుల
నై తెలంగాణన్న కుత్కెల మీద మిట్కరిస్తున్నం.
అమరుల పీన్గుల మీద పమాణం జేసినోళ్ళారా
నాల్కెలు పెగుల్తలేవు/ పేల్తలే
గొంతుల పచ్చనోట్ల కట్టలడ్డంపడ్డయి గదా?
నా తల్లి బొండిగ మీద తులాభారాలు తూగేటోళ్ళారా!
తూగేటోళ్ళ కాళ్ళకు ఊడిగం చేసేటోళ్ళారా!
నా తల్లి తెలంగాణను ఢిల్లీకి రైనుబెట్టినోళ్ళారా!
ఖబద్దార్! .. తెలంగాణ ఆత్మగౌరవం
మీ బొందల మీద కవాతుజేస్తది….
గడప గడపకు నెత్తురుబొట్లు దిద్దినోళ్ళం
మా వేళ్ళమీద ఇంకుసుక్కల్ని రక్తంతో అద్దుకుంటాం
తెచ్చేది మేమే … ఇచ్చేది మేమేనన్న
రెండు కండ్లు, రెండు నాల్కెల్ని మా పనికత్తికి బలిస్తం….
గంగమ్మైనా, కిష్టమ్మైనా
ఉద్దెమపు అమరుల పాదాల్ని కడగాలని…
కన్నీటి కాల్వల్ని/ వలయాల్ని దాటుకుంటూ
కడుపుల పేగుబంధాన్ని గుండెల దాసుకొని
రాలిన పువ్వుపూన్నని దుఃఖపడుతూ
నా తల్లి పొడుస్తున్న సూర్యున్ని నిలేస్తుంది…
రేపటి తొలిపొద్దు స్వతంత్ర తెలంగాణల్నేనని…
– విశ్వనాథుల పుష్పగిరి

This entry was posted in POEMS.

Comments are closed.