రేపటినుంచి ‘వింటర్’ హీట్

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పన్నెండురోజుల పాటు జరుగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గురువారం నుంచి జరిగే సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టే పలు అస్త్రాలతో బీజేపీ సహా ప్రతిపక్షాలు సిద్ధమవుతుండగా, విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు పన్నుతోంది. నరేంద్రమోడీ పాల్గొన్న పాట్నా ర్యాలీలో పేలుళ్లు, మహిళలపై నేరాలు తదితర అంశాలను సభలో లేవనెత్తనున్నట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే బొగ్గు కుంభకోణం, సీబీఐ దుర్వినియోగం వంటి అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇక సమావేశాల తొలిరోజునే ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానం ఇస్తామని వామపక్షాలు స్పష్టం చేశాయి. అలాగే ముజఫర్‌నగర్ అల్లర్ల అంశంపై కూడా చర్చకు డిమాండ్ చేయనున్నట్టు తెలిపాయి.
మరోవైపు మోడీకి సంబంధమున్నట్టు భావిస్తున్న యువతిపై గూఢచర్య వివాదంపై సమావేశాల్లో బీజేపీని ఇరుకున పెట్టాలని అధికార కాంగ్రెస్ సభ్యులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే 38 బిల్లులను ఆమోదించుకోవాలని భావిస్తోంది. వీటిలో మహిళా రిజర్వేషన్, లోక్‌పాల్ బిల్లుల ఆమోదం తమకు ప్రాధాన్యమని పేర్కొంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభ ఆమోదించాల్సి ఉంది. ఇక లోక్‌పాల్ బిల్లు ఆమోదం కూడా ఆసక్తి రేపుతోంది. మరోవైపు బీమా బిల్లు, ప్రత్యక్ష పన్నుల కోడ్ బిల్లుల విషయమై ఉభయ సభల ప్రతిపక్ష నేతలతో కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం భేటీ అయి.. మద్దతుకోరే అవకాశముంది. బీమా రంగంలో ఎఫ్‌డీఐలపై పరిమితిని 26శాతం నుంచి 49శాతానికి పెంచడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. మతహింస బిల్లును ఈ సమావేశాల్లో చేపట్టే అవకాశంలేదని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. ఆర్టికల్ 370పై ఇటీవల బీజేపీనేత నరేంద్రమోడీ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశాన్ని లేవనెత్తనున్నట్టు నేషనల్ కాన్ఫన్స్ స్పష్టం చేసింది. 2జీ కుంభకోణంలో ప్రధాని క్లీన్‌చిట్ ఇస్తూ.. జేపీసీ రూపొందించిన వివాదాస్పద నివేదికను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

మతహింస బిల్లుపై పలు రాష్ట్రాల అభ్యంతరం
వివాదాస్పద మతహింస బిల్లుపై కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలు, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సమాజంలోని మైనారిటీ వర్గాలపై లక్షిత దాడులకు జరుగకుండా నిరోధిస్తూ తీసుకువచ్చిన ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఆదేశం మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి మంగళవారం అన్ని రాష్ట్రాల హోం కార్యదర్శులతో ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. మతహింస బిల్లును తమిళనాడు, బెంగాల్, ఒడిశా, గుజరాత్, మధ్యవూపదేశ్ తదితర ఈ రాష్ట్రాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చను అడ్డుకొంటామని బీజేపీ స్పష్టం చేసింది.

సమావేశాల పొడిగింపు..అఖిలపక్ష భేటీలో ఏకాభిప్రాయం
శీతకాల సమావేశాలను పొడిగించాలన్న ప్రతిపాదనపై అఖిలపక్షం భేటీలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం ఈ సమావేశం నిర్వహించారు. 12 రోజులు జరుగనున్న సమావేశాలు ఈ నెల 20 తర్వాత వారం రోజుల విరామం తీసుకొని మళ్లీ సమావేశం అయ్యేందుకు నేతలు ఇందులో సమ్మతించారు. ఈ సమావేశాలలో దాదాపు 38 బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం, కీలక బిల్లులపై చర్చ జరుగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు నేతల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ తెలిపారు. రాజ్యసభ సభ్యులు, ఈశాన్య, దక్షిణ రాష్ట్రాల ఎంపీలను సంప్రదించిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ తెలిపారు.
ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులివి:
భారత-బంగ్లాదేశ్ భూ సరిహద్దు ఒప్పందం, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నిరోధం.. నియంత్రణ బిల్లు, ఎలక్ట్రానిక్ డెలివరీ సర్విసెస్ బిల్లు, బొగ్గు గనుల నియంత్రణ సంస్థ బిల్లు, భారత ప్రజారుణ నిర్వహణ ఏజెన్సీ బిల్లు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.