రిజర్వేషన్ కోటాలో మెరిట్ అభ్యర్థుల భర్తీనా ?

– విద్యాశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించిన అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ
– డీఎస్సీ-12 అభ్యర్థులను ఆదుకుంటాం
– రిజర్వేషన్లలో అవకతవకలు నిజమే: కమిటీ చైర్మన్ తిప్పేస్వామి

డీఎస్సీ-2012లో మెరిట్ సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరిలో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా.. వారిని రిజర్వేషన్ కోటా కింద భర్తీ చేయడాన్ని శాసనసభా బీసీ వెల్ఫేర్ కమిటీ తప్పుబట్టింది. ఈ విషయంపై సంబంధిత అధికారులను కమిటీ సభ్యులు నిలదీశారు. కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు.. సంబంధిత ప్రభుత్వ శాఖల సీనియర్ ఐఏఎస్ అధికారులు సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. శుక్రవారం అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తిప్పేస్వామి అధ్యక్షతన కమిటీ హాల్లో సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాసు, బొత్స అప్పల నర్సయ్య, ముత్యాల పాప, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్యతోపాటు విద్యాశాఖ, సాధారణ పరిపాలన (జీఏడీ) శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డీఎస్సీ-2012లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై కమిటీలో చర్చించారు. మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కోటాలో ఉద్యోగాల భర్తీ చేయకుండా.. రిజర్వేషన్‌లో కోటాలో భర్తీ చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని కమిటీ సభ్యులు అభివూపాయడ్డారు.

డీఎస్సీ సెలక్షన్‌లోనే అవకతవకలు వాస్తవమా? కాదా? అని అధికారులను నిలదీయడంతో సమాధానం చెప్పలేక నీళ్లు మింగినట్లు తెలిసింది. విద్యాశాఖ అవలంభించిన విధానాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన దాదాపు 2 వేల మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో శ్రీకాంత్ అనే అభ్యర్థికి టాప్ ర్యాంక్ వచ్చినా.. రిజర్వేషన్ కోటాలోకి ఎందుకు తీసుకున్నారని అధికారులను నిలదీశారు. అధికారులు మాత్రం ఆ జిల్లా కలెక్టర్ సూచనల మేరకే మార్చినట్లు సమాధానమచ్చినట్లు తెలిసింది.

ఓపెన్ కేటగిరిలో నియమించిన జనరల్ అభ్యర్థులను తప్పించి.. రిజర్వేషన్ కేటగిరిలో ఉద్యోగాలు పొందిన మెరిట్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమాధానమివ్వడంపై కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు పొందిన జనరల్ అభ్యర్థులను తప్పిస్తే, రెండోసారి తప్పుచేసినట్లు అవుతుందని.. సూపర్‌న్యూమరీ పోస్టులతో నష్టపోయిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని సూచించారు. డీఎస్సీలో ఎంత మందికి అన్యాయం జరిగిందో.. జిల్లాల వారిగా సమాచారం సేకరించి.. వారం రోజుల్లో జరిగే కమిటీకి అందజేయాలని అదేశించారు. సమావేశం అనంతరం సభాకమిటీ చైర్మన్ తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ-12లో అవకతవకలు జరిగింది వాస్తవమేనని తెలిపారు. నష్టపోయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. డీఎస్సీ రిజర్వేషన్ల కోటాలో జరిగిన అవకతవకలపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా కమిటీ సభ్యులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.