రాహుల్ ఆర్డినెన్స్‌లపై దాదా అభ్యంతరం!

ఢిల్లీ, మార్చి 1: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుకుతెచ్చిన అవినీతి నిరోధక బిల్లులను ఆర్డినెన్స్ మార్గం ద్వారా అమలుచేయాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభ్యం తరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ఆర్డినెన్స్‌ల విషయమై కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబల్ శనివారం రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ ప్రతిపాదనపై ప్రణబ్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలిసింది. రానున్న ఎన్నికల్లో రాహుల్‌గాంధీని అవినీతి వ్యతిరేక పోరాటయోధుడిగా చూపేందుకు ఈ బిల్లులు అమల్లోకి తేవడం కాంగ్రెస్ కీలకంగా భావిస్తోంది. అవినీతి నిరోధం, ప్రజా హక్కులకు సంబంధించిన ఈ ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర కేబినెట్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్‌ల ఆమోదం అంశాన్ని కేంద్రం వాయిదా వేసింది. సీనియర్ కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఆర్డినెన్స్‌ల అంశంపై కేబినెట్ భేటీలో అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వం కాలపరిమితి ముగిసిపోతున్న తరుణంలో ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. దీంతోపాటు రాష్ట్రపతి కూడా ఆర్డినెన్స్‌లను ఆమోదిస్తారా? అన్నది సందేహాస్పదంగా మారడంతో గత కేబినెట్ భేటీలో నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే, రాహుల్‌గాంధీ తన బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకురావాలని గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో ఆదివారంనాటి కేబినెట్ సమావేశంలో కేంద్రం పలు ఆర్డినెన్స్‌లకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వవచ్చునని తెలుస్తోంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.