రాష్ట్రపతి పాలన మొదలు

హైదరాబాద్, మార్చి 1 :మరికొద్ది రోజుల్లో రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన మొదలైంది. ఈ విషయంలో కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలియజేయడం, గెజిట్ నోటిఫికేషన్ శనివారం మధ్యాహ్నానికే రాష్ట్ర గవర్నర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరుకోవడంతో ఇక రాష్ట్ర పరిపాలనకు రాజ్‌భవన్ కేంద్ర బిందువుగా మారనుంది. గవర్నర్ పాలన మొదలైందనటానికి సూచికగా అన్నట్లు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల అంశాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ సంతకం చేశారు. ఆయన ఆమోదంతో జీవో విడుదలైంది. రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితోపాటు ప్రత్యేక కార్యదర్శి రమేశ్‌కుమార్ తదితరులు కలిసి తాజా పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర పాలన అమలులోకి వచ్చిన నేపథ్యంలో పాలనా వ్యవహారాల్లో మార్పులు, చేర్పులపై గవర్నర్ నరసింహన్ ఆదివారం సాయంత్రం 4గంటలకు దర్బార్ హాల్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు.

govrnerఈ సమావేశంలో అనేక విషయాలను ఆయన వెల్లడించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో గవర్నర్ పాలన నేపథ్యంలో అధికారికంగా రాజ్‌భవన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు రాష్ట్రపతిపాలన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభధ్రతల పరిస్థితికి ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటికే కేంద్ర పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపినట్టు డీజీపీ బీ ప్రసాదరావు శనివారం మీడియాకు చెప్పారు. అవసరమైతే మరిన్ని బలగాలను రప్పిస్తామన్నారు. సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించినట్టు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న దాదాపు 70 కంపెనీల పారా మిలిటరీ బలగాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. గవర్నర్ పాలన మొదలుకావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలను తొలగించి.. గవర్నర్ ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు.

మారిపోనున్న పాలనా వ్యవహారం
గవర్నర్ పాలనతో రాష్ట్ర పరిపాలనలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటి వరకూ ప్రజా ప్రభుత్వం నిర్వహించిన బాధ్యతలను గవర్నర్, ఆయనకు సలహాదారులుగా కేంద్రం నియమించే అధికారులు నిర్వస్తారు. రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు ఈ పదవుల్లో ఉండే అవకాశాలున్నాయి. రాష్ట్ర విభజన జరిగే కీలక సమయం కావడంతో ఇతర రాష్ట్రాల కేడర్‌నే ఈ బాధ్యతల్లో నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదే సూత్రంపై సీఎస్‌గా మహంతినే కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పరిపాలన మొత్తం గవర్నర్ సలహాదారుల ఆధ్వర్యంలోనే సాగుతుంది. ఇదివరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌లు సీఎంకు చేదోడువాదోడుగా వాళ్లకు కేటాయించిన శాఖలవారీ పాలనలో సహకరించేవారు. అయితే ఇక మీదట సీఎం పాత్ర అంతా గవర్నర్ చేతిలోకి వెళ్లనుంది. సచివాలయంలో ప్రజాపాలన లేని ప్రస్తుత పరిస్థితుల్లో మహంతి పాత్ర కూడా కీలకంగా మారనుంది. సాధారణ పరిపాలనతో పాటు శాంతి భద్రతలు తదితర ఫైళ్లను సీఎస్ పరిశీలిస్తారు. అన్ని ప్రభుత్వ శాఖల ఫైళ్లను ఆయన పరిశీలించిన తర్వాత గవర్నర్ సలహాదారులకు పంపుతారు. వారి నిర్ణయం మేరకు అవి గవర్నర్ ఆమోదానికి వెళ్లి.. జీవోలుగా మారుతాయి.

-గతంలో మంత్రుల డిమాండ్లమీద సెక్రటరీలకు చేరాల్సిన ఫైళ్ల వివరాలు ఐదంచెల్లో క్లియర్ అయ్యేవి. ఇకపై రాజ్‌భవన్ కేంద్రంగా జీవోలు జారీ కానున్నాయి. సెక్ర బిజినెస్ రూల్స్ ప్రకారమే జీవోల రూపకల్పన జరిగినా.. వీటి తయారీలో సలహాదారులదే కీలక పాత్ర. వీరే సాధారణ సమీక్షలతోపాటు ఇతరత్రా కార్యకలాపాలపైన, ఉద్యోగుల బదిలీలపైన నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు. విధానపరమైన నిర్ణయానికి, ఆమోదానికి మాత్రమే గవర్నర్‌కు పంపిస్తారు. గవర్నర్ సంతకంతో అవి ప్రభుత్వ ఉత్తర్వులుగా మారుతాయి. శాంతి భద్రతలపై పోలీస్ ఉన్నతాధికారులతో నిత్యం సమీక్షలు జరిపి ఇచ్చే కీలక సూచనలు రాజ్‌భవన్ కేంద్రంగా కొనసాగుతాయి.

-ఎమ్మెల్యేల అధికారాలు ఇకపై కొనసాగవు. వారు కేవలం జీతాలకే పరిమితం కానున్నారు. రాష్ట్రపతి పాలన గడువు పూర్తయ్యేంత వరకూ వారి ఎమ్మెల్యే హోదా కేవలం నామమాత్రమే.
-ప్రజా ప్రభుత్వాలు ఉన్నప్పుడు తమ సమస్యలను వివిధ ప్రాంతాల ప్రజలు నేరుగా చెప్పుకొనే అవకాశం ఉంటుంది. కానీ.. గవర్నర్ పాలనలో ఈ విషయంలో నియంత్రణలకు అవకాశాలున్నాయి. ప్రతి విషయానికీ రాజ్‌భవన్‌కు వెళ్లాల్సి రావడం, ఆయన అప్పాయింట్‌మెంట్ దొరకడం ప్రజలకు కష్టతరమేనని సీనియర్ అధికారులు చెబుతున్నారు. సాధారణ ప్రజలకు సహాయకారిగా ఉన్న ముఖ్యమంత్రి సహాయనిధి, ఇతరత్రా సాయంతోపాటు, నియోజకవర్గాల అభివృద్ధి నిధులవంటివి నిలిచిపోవడంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వీటి నివారణకు గవర్నర్ నేతృత్వంలో ప్రత్యామ్నాయాలు అమలుచేయాల్సిన అవసరం నెలకొంటుంది.

-రాష్ట్రపతి పాలన సమయంలో ఇప్పటి వరకు మనుగడలో ఉన్న పథకాలను కొనసాగించాలి తప్ప కొత్త వాటిని ప్రవేశపెట్టడానికి వీలు లేదు. ప్రకృతి వైపరీత్యాలు లేదా శాంతి భద్రతలు అదుపు తప్పడం వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
-కొత్త ఉద్యోగాల భర్తీలు, నామినేట్ పోస్టుల నియమకాలు ఉండవు. జీతభత్యాల పెంపు ప్రసక్తి రాదు. రాష్టపతి పాలన కొనసాగినంత కాలం కొత్త పీఆర్సీకి అవకాశం ఉండదు.

-కేబినెట్ రద్దయిన నేపథ్యంలో సీఎం, మంత్రులకు ప్రొటోకాల్ రద్దవుతుంది. ప్రొటోకాల్ విభాగం వారు అప్పుడే వారి వాహనాలను వెనక్కి తీసుకునే పని మొదలుపెట్టారు. మఖ్యమంత్రికి చెందిన కొన్ని వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
-ఎన్నికల నోటిఫికేషన్ వస్తే గవర్నర్‌తో పాటు మొత్తం అధికారులంతా ఎన్నికల కమిషన్ పరిధిలో, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది.
-ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాలలో ఎక్కువసార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ గడువు జూన్ రెండవ తేదీ వరకు ఉంది. ఈలోపు రాష్ట్రపతిపాలన ఎత్తివేస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కూడా ఉంటుంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.