రాష్ట్రంలో నక్సలిజాన్ని అణచివేశాం: డీజీపీ దినేశ్‌డ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే నక్సలిజం పెరుగుతుందనే అభివూపాయాలు ఊహాగానాలేనని డీజీపీ దినేశ్ రెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్రంలో నక్సలైట్లను లేకుండా అణచివేశామని ప్రకటించారు. గురువారం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నక్సలైట్ల అణచివేతలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం నక్సలిజం అదుపులోనే ఉందని చెప్పారు. హైదరాబాద్ లో శాంతిభవూదతలకు ముప్పులేదని తెలిపారు. ఏదో జరుగుతుందని ఊహించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైతే నక్సలైట్ల సమస్య ఉండదంటారా?.. అని విలేకరులు ప్రశ్నించగా- ‘సమస్య ఎదురైనపుడు అధిగమిస్తాం’ (వియ్ క్రాస్ ది బ్రిడ్జ్ వెన్ వుయ్ రీచ్ ఇట్) అని బదులిచ్చారు. రాష్ట్ర విభజనపై ప్రశ్నించగా- ‘తప్పుడు ప్రశ్నను తప్పుడు వ్యక్తిని అడుగుతున్నారు’ అంటూ మీడియాను తప్పించుకుని వెళ్లిపోయారు.

ఆధునీకరణకు రూ.200కోట్లు
రాష్ట్ర పోలీసు వ్యవస్థను ఆధునీకరించేందుకు రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని హోం మంత్రిత్వశాఖను కోరడానికే ఢిల్లీ వచ్చినట్లు డీజీపీ దినేశ్‌డ్డి తెలిపారు. గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ కార్యాలయంలో చర్చల అనంతరం ఆయన నార్త్‌బ్లాక్ వద్ద విలేకరులతో మాట్లాడారు. పోలీసుస్టేషన్ల ఆధునీకరణ, బ్రాండెడ్ వాహనాలను సమకూర్చుకోవడానికి అవసరమైన నిధుల విడుదల కోసం చర్చించేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు. హోంశాఖ కార్యదర్శి దాస్‌తోపాటు అడిషనల్ డీజీ గోపాల్‌డ్డిలతో కలిసి కేంద్ర హోంశాఖ అధికారులతో చర్చలు జరిపామన్నారు. తమ ప్రతిపాదనలకు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

మీడియాపై అసహనం
డీజీపీ దినేశ్ రెడ్డి గురువారం ఉదయం, సాయంత్రం రెండుసార్లు మీడియాతో విడివిడిగా మాట్లాడారు. సాయంత్రం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందనే అంశంపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో నక్సలిజాన్ని అదుపులో ఉంచాం అని విశ్వాసంతో మీడియాతో మాట్లాడిన ఆయన మరో దఫా మాటను వెనక్కుతీసుకునే ప్రయత్నం చేశారు. సాయంత్రం పొద్దుపోయిన తరువాత బయటకు వెళుతున్న డీజీపీ విజువల్స్ కోసం వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై ఆయన ఫైర్ అయ్యారు.

‘నేను మాట్లాడిందేమిటి.. మీరు స్క్రోలింగులో ఇచ్చిందేమిటి? మీ వార్తల వలన శాంతి భద్రతల సమస్య తలెత్తితే మిమ్మల్నే బాధ్యులను చేస్తా’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు ఇలాగే వ్యవహరిస్తే ఏపీ భవన్ గేట్ అవతలకు పంపిస్తా’ అంటూ బెదిరించారు. దీంతో కెమెరామెన్లు, విలేకరులు బిత్తరపోయారు. అంతకుముందు స్పష్టంగానే మాట్లాడి తరువాత ఎందుకు అలా వ్యవహరించారో విలేకరులకు అంతుబట్టలేదు. మొదట ‘నక్సలైట్ల సమస్యను సమర్థంగా రూపుమాపాం’, ‘ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి ఏపీ పోలీసులు సమర్థులు’ అని స్పష్టంగా చెప్పిన ఆయన ఆ తరువాత ‘తెలంగాణ వస్తే నక్సలిజం ప్రబలుతుందని’ సీఎం ఇచ్చిన రోడ్డు మ్యాపు గుర్తుకు వచ్చి ఇబ్బంది పడ్డారని సమాచారం.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.