రాజ్యాంగ స్ఫూర్తితోనే టి బిల్లు

– సందేహాలు.. అనుమానాలకు తావులేదు
– ఆర్టికల్ 3 మేరకే రూపొందింది
– స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూచనలు
– జానారెడ్డి రూలింగ్ కోరడంపై స్పందన
హైదరాబాద్, జనవరి 25:ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013 రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే సభకు వచ్చింది. పవిత్రమైన, అత్యంత విలువైన శాసనసభకు ఇండిపెండెంట్ హక్కు ఉంది. అయితే బిల్లుపై ఆర్టికల్ 3 మేరకే మనం నడుచుకోవాల్సి ఉంది. అంతకుమించిన హక్కులేదు. మీరు స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు. దయచేసి అత్యున్నత రాజ్యాంగ పరిధిలోని చట్టాలను, పార్లమెంటు, రాష్ట్రపతి వంటి వ్యక్తుల పేర్లు సభలో ఉచ్ఛరించవద్దు అంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం శాసనసభలో పేర్కొన్నారు.

speakmanohar సభలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు పదేపదే రాజ్యాంగాన్ని ఉటంకించడం, అందులోని చట్టాలను సభకు చదివి వినిపించడం, మరికొందరు తీర్మానం కావాలని, ఇంకొందరు ఓటింగ్ కావాలని కోరుతున్న నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలో పాల్గొన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. శాసనసభకు పంపించింది తుది బిల్లా, ముసాయిదా బిల్లా? అనే అంశంలో కేంద్రం, హోంశాఖ భిన్నమైన వివరణలు గందరగోళంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపాలని కోరుతూ స్పీకర్‌కు నోటీస్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ బిల్లుపై చర్చించేందుకు సభ సిద్ధంగా లేదు. దీన్ని తిప్పి పంపాలి అంటూ సీఎంకు మద్దతు పలికారు. ఇంతలో సీనియర్ మంత్రి జానారెడ్డి కల్పించుకుని బిల్లు లోపభూయిష్టంగా ఉందని సీఎం చెప్పడం సబబు కాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

బిల్లుపై అభిప్రాయాలు చెప్పకుండా తిప్పి పంపే అధికారం ముఖ్యమంత్రికి ఉందా? అదేవిధంగా ప్రతిపక్ష నేతకు హక్కుందా చెప్పేందుకు స్పీకర్ రూలింగ్ ఇవ్వాలి అని కోరారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుని పైవిధంగా వ్యాఖ్యానించారు. ఏ నిర్ణయమైనా అందరం కలిసి తీసుకుని, అత్యున్నత సభా గౌరవాలను కాపాడుకుందామని సభ్యులకు హితబోధ చేశారు.బిల్లుపై అనుమానాలు, సందేహాలు ఉన్నాయని నేను భావించడంలేదు. వాటికి తావులేదు. ఇప్పటికే ఈ అంశంపై అనేకసార్లు నిర్వహించిన బీఏసీలో చర్చించి అనుసరించాల్సిన విషయాన్ని నిర్ణయించాం అన్నారు. రాజ్యాంగ పదవుల్లోని అత్యున్నత వ్యక్తుల పేర్లను ప్రస్తావించి సభా మర్యాదకు భంగం కలిగించొద్దని సూచించారు. సభకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ప్రతిసభ్యుడు అవకాశం వినియోగించుకుని తమ అభిప్రాయాలు చెప్పాలి అని సూచించారు.

ప్రతి సభ్యుడు శాసనసభ చట్టాలను, విధులను తెలుసుకుని మాట్లాడాలి. అనవసరంగా గౌరవ అత్యున్నత వ్యవస్థను పదేపదే ప్రస్తావించొద్దు అన్నారు. దేశం యావత్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభవైపు చూస్తోంది. ప్రజలకు మేలు చేకూర్చే విషయాలను చర్చిద్దాం అంటూ సభా నిర్వహణకు ఆటంకాలు సృష్టిస్తున్న వారిని ఉద్దేశించి ఇది సభా మర్యాద కాదన్నారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.