రాజ్యాంగ ఔన్నత్యానికే బిల్లులో సవరణలు-ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు

తెలంగాణ ముసాయిదా బిల్లులో టీ జేఏసీ సూచించిన సవరణలు ఆషామాషీవి కావని, 29 వ రాష్ట్రంగా ప్రాణం పోసుకుంటున్న తెలంగాణను పరిపుష్టం చేసేందుకు, ఫెడరల్ పునాదుల మీద నిర్మాణమైన భారత రాజ్యాంగ గౌరవ ఔన్నత్యాన్ని పెంచేందుకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటిచెప్పేందుకు ఈ సవరణలు ప్రతిపాదించామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఈ విషయమై తెలంగాణ ప్రజాప్రతినిధులందరికీ ఐదు పేజీల నోట్‌ను అందచేశామని, బిల్లులోని సెక్షన్లకు, క్లాజులకు చేయాల్సిన సవరణలపైన వ్యాఖ్యానాలను, వివరణలను ఇచ్చామని, చర్చ సందర్బంలో ప్రజాప్రతినిధులకు ఈ నోట్ కరదీపిక అవుతుందని భావిస్తున్నామని చెప్పారు. బిల్లులోని 13 అంశాలకు చేసిన సూచనలను, సవరణలను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకవచ్చామని ఆయన వివరించారు.

ప్రజలు ఆశిస్తున్న సంపూర్ణ తెలంగాణ సాధనలో భాగమే ఈ సూచనలు, సవరణలు అని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ ఉద్యోగ సంఘాల సారథ్యంలో టీజీవో కార్యాలయంలో టీ ప్రజాప్రతినిధులతో రౌండ్ సమావేశం జరిగింది. టీ జేఏసీ చైర్మన్‌తోపాటు ఉద్యోగ సంఘాల నాయకులు, 67 సంఘాల ప్రతినిధులు, మంత్రి బసవరాజు సారయ్య, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐల ప్రజాప్రతినిధులు, తెలంగాణ ప్రజాఫ్రంట్ బాధ్యులు, వివిధ సంఘాల బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ నినాదాలతో రౌండ్ సమావేశం మార్మోగింది. టీ జేఏసీ కో చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్, టీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీప్రసాద్, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, కో చైర్మన్ సీ విఠల్, కో చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి ఈ సమావేశానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ శాసనసభా నాయకుడు ఈటెల రాజేందర్, టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ, సీపీఐ నేత గుండామల్లేశం, ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీలు కే స్వామిగౌడ్, పాటూరి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీజేఎఫ్ ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం ప్రసంగిస్తూ బిల్లులో ఉద్యోగుల విభజనకు స్థానికతను ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలనే అంశాన్ని సునిశితంగా చర్చించామని, ప్రజాప్రతినిధులంతా ఉద్యోగుల విభజన విషయంలో జాగరూకతను పాటించాలని విజ్ఞప్తిచేశారు.

శాసనసభలో బిల్లులో సవరణలు చేస్తామని, క్లాజుల వారీగా ఓటింగ్ పెడతామని చెప్పే మాటలన్నీ రాజ్యాంగ విరుద్ధమైనవేనని స్పష్టంచేశారు. రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లునకు చేయాల్సిన సూచనలన్నింటినీ తమకు ఇవ్వాలని కోరారు. టీ జేఏసీ ఇచ్చే నోట్ ప్రకారం సవరణలను అడుగుతామని, టీ ప్రజాప్రతినిధులంతా సభలో ఐక్యంగా ప్రజల ఆకాంక్షలను వినిపిస్తున్నారని, టీ మంత్రులు సంఘటితంగానే ఉన్నారన్నారు. పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగాది పండుగనాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని, ఈ విషయంలో ఎవ్వరికీ సందేహాలు అవసరం లేదన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌డ్డిరెతో అనేక దఫాలుగా అధిష్ఠానం చర్చించిందని, ఈ విషయాలన్నీ తెలిసి కూడా కుట్రలతో తెలంగాణ అడ్డుకోవాలని, గందరగోళం సృష్టించాలని ఆయన విఫలయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయని ఈ సమావేశాలలో కూడా తెలంగాణ బిల్లును చర్చించేందుకు రాజ్యాంగ నిబంధనలను అడ్డుపడవని చెప్పారు.

అంతిమ అధికారం పార్లమెంటుదే: ఈటెల
టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ ప్రసంగిస్తూ శాసనసభలో జరిగే చర్చలు మన సంతృప్తి కోసం చేసుకునే చర్చలేనని అంతిమ నిర్ణయాధికారం పార్లమెంటుకే ఉంటుందని చెప్పారు. ఇక నుండి మనందరి అడ్డా ఢిల్లీ కావాలని, అహంకారంతో తెలంగాణను అడ్డుకునే వారందరి సంగతి ఢిల్లీలో తేల్చుకుందామని ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న 119 మంది శాసనసభ్యులు ఒకే గొంతును వినిపిస్తున్నారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు కే స్వామిగౌడ్, పీ సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రతినిధులంతా తెలంగాణ కోసం నిలిచి ఉన్నామని ప్రజలకు హామీ ఇవ్వాలన్నారు.

టీడీపీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలన్నింటినీ చర్చించామని, అందుకని రేపటి తెలంగాణలో ఉద్యోగులు కోరుకుంటున్న పద్ధతిలోనే ఉద్యోగుల విభజన జరుగుతుందని, తాము ఉద్యోగులతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నరసింహులు ప్రసంగిస్తూ ముసాయిదా బిల్లునకు కావాల్సిన సవరణలను అధ్యయనం చేసేందుకు కమిటీని వేసుకున్నామని, గురువారం నుంచి శాసనసభలో చర్చలు మొదలవుతాయని, చర్చలు ప్రారంభమయ్యాక కుట్రలు పెరుగుతాయని అన్నారు. సీపీఐ పక్ష నాయకులు గుండా మల్లేశం మాట్లాడుతూ తెలంగాణలో దోచుకున్నంత తిన్నది చాలక మళ్లీ దోపిడీ చేసేందుకు సీమాంధ్ర పెత్తందార్లు అడ్డుపడుతున్నారని విమర్శించారు.

బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎదుర్కొన్నట్లుగానే ముసాయిదా బిల్లునకు సవరణలను సాధించుకొని సంపూర్ణ తెలంగాణను తెచ్చుకుందామని చెప్పారు. టీ. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ.దేవీప్రసాద్ ముందుగా చర్చను ప్రారంభిస్తూ ఆరుదశాబ్దాలుగా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయని, అన్యాయాలతో పోరాడుతూనే తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తున్నామని చెప్పారు. బిల్లునకు 13 సవరణలను టీ జేఏసీ ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనలన్నింటిపై చర్చ జరుగాలని, శాసనసభలో ఆరోగ్యకరమైన చర్చ జరుగాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల ప్రజాస్వామిక ఆకాంక్షను చట్ట సభలలో వినిపించాలని శ్రీనివాస్‌గౌడ్, విఠల్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో జేఏసీ నేతలు అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, విద్యుత్తు జేఏసీ చైర్మన్ రఘు, కన్వీనర్ శివాజీ, గ్రేటర్ జేఏసీ కన్వీనర్ ఎంబీ కృష్ణయాదవ్, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, గ్రూప్- 1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్, నేతలు మమత, బండారు రేచల్, గడ్డం జ్ఞానేశ్వర్, వెంకటరెడ్డి, సెటిలర్స్ ఫోరం నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన, టీ. పబ్లిక్‌సెక్టార్ జేఏసీ చైర్మన్ ఎల్లన్న, కన్వీనర్ దానకర్ణాచారి పాల్గొన్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.