రాజీనామా చేస్తానన్న సబిత

సబిత..భవిత? sabitha-reddy కేబినెట్‌లో కొనసాగడం

– న్యాయం తనవైపే ఉందని వ్యాఖ్య
జగన్ అక్రమాస్తుల కేసులో తనను నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో తాను ఇంకా మంత్రిపదవిలో కొనసాగడం అనైతికమని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రాడ్డి చెప్పారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను తన పదవికి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించారు. తాను కేబినెట్‌లో కొనసాగలేనన్నారు. అయితే, సీఎం, పలువురు మంత్రులు రాజీనామా వద్దని చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. చార్జిషీటును పరిశీలించిన తర్వాత తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. న్యాయం తనవైపే ఉందని అన్నారు. నిర్దోషిగా బయటికి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. సచివాలయ బిజినెస్ రూల్స్‌కు అనుగుణంగానే జీవోలు జారీ చేశామని ఆమె స్పష్టం చేశారు. అయితే, వాటి వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తనకు తెలియదని సబిత చెప్పారు. త్వరలో, వీలైతే బుధవారమే విలేకరులతో మాట్లాడి, అన్ని విషయాలపైనా వివరణ ఇస్తానని సబిత తెలిపారు.

రాజీనామా ఆమోదిస్తారా?.. ధర్మానలా పెండింగ్‌లో పెడ్తారా?
వచ్చేవారం ఢిల్లీకి సీఎం కిరణ్.. తిరిగి వచ్చాకే సబితపై నిర్ణయం!
హోం శాఖ నుంచి మార్చే అవకాశం
నేడు హస్తినకు పీసీసీ చీఫ్ బొత్స
ఆందోళనలో గీత, పొన్నాల, కన్నా.. ఇక మిగిలింది ఈ ముగ్గురే!
ఎన్నికల వేళ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి
సబిత భవితేంటి? సబిత భవితపై తీసుకునే నిర్ణయంతో మిగిలిన ముగ్గురు మంత్రుల భవిష్యత్తేంటి? తద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్లేంటి? మొత్తంగా కాంగ్రెస్ పరిస్థితేంటి? జగన్ అక్రమాస్తుల కేసులో నాలుగో నిందితురాలిగా సీబీఐ చార్జిషీటులో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రాడ్డి పేరు రావడంతో కాంగ్రెస్‌లో తలెత్తిన కల్లోలమిది! అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత కేబినెట్‌లో కొనసాగడం అనైతికమంటున్న సబిత.. రాజీనామాకే మొగ్గుచూపుతున్న నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఏం నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. రాజీనామాను ఆమోదిస్తే మిగిలిన ముగ్గురు మంత్రులు జే గీతాడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య వంతు వచ్చినప్పుడు ఇదే పద్ధతిని పాటించాల్సి ఉంటుందని, అదే సమయంలో ధర్మాన విషయంలోనూ దారి అదేనని అభివూపాయాలు వెలువడుతున్నాయి.

రాజీనామా చేస్తే ఇతర మంత్రులపైనా ఆ ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సహచర మంత్రులు.. రాజీనామా చేయొద్దని సబితకు నచ్చజెబుతున్నారు. సబిత మాత్రం రాజీనామా చేస్తానని పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సబిత రాజీనామాపై సీఎం తీసుకోబోయే నిర్ణయంపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అవినీతి కేసులో హోం మంత్రి కోర్టుకు హాజరు కావడం సబబుగా ఉండదని భావిస్తున్న సీఎం ఆమె శాఖను మార్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం మాత్రం బాగా జరుగుతోంది. ఈ నెల 15న సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ అధిష్ఠానంతో చర్చించిన తర్వాతే సబిత విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.