రణ్‌వీర్ నిషాన్

సందర్భం : 1969 ఉద్యమంలో హింసకు నేటికి నలభైమూడేళ్లు! ఆ నెత్తుటి మరకకు చిహ్నంగా క్లాక్ టవర్ దగ్గరున్న అమరవీరుల స్థూపం నిలబడి నేటికి నిండా ముప్పై అయిదేళ్లు!

పరిచయం : ఆ చారివూతక సందర్భాన్ని తరతరాలకు గుర్తుచేసేలా, తెలంగాణ ఆర్తి సాధించే స్ఫూర్తిగా మారాలని ఆ స్థూపానికి రూపమిచ్చిన ఓ సృజనశీలి! పేరు… దివాన్ రణ్‌వీర్ సిన్హా, వయసు…అరవై పైనే! నివాసం… నారాయణగూడ, హైదరాబాద్. వృత్తి…ఆర్కిటెక్ట్. ఉత్తర భారతీయులే అయినా వాళ్ల తాతల కాలంలోనే హైదరాబాదులో స్థిరపడ్డారు. రణ్‌వీర్ సిన్హా తండ్రి ఏజీ ఆఫీస్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేశాడు.

ఈ ములాఖాత్ ఎందుకు?: స్థూపాన్నే కాదు, దాని సృష్టికర్తనూ మరిచినందుకు!

సికింవూదాబాద్ క్లాక్ టవర్ దగ్గర పోరాటానికి ప్రేరణనిస్తున్నట్టున్న ఈ స్థూపాన్ని నిశితంగా పరిశీలిస్తే …. ఎమ్ ఆకారంలో నిలు మూడు మెట్లు ‘మెమొరీ’ అంటే ఆ నాటి పోరును, అందులో అసువులు బాసిన యోధులను గుర్తుకు తెస్తుంది.ఓ వీరుడు నిలబడి ఉన్న స్థానం తెలంగాణ సాధించే దిశలో ఇంకా రెండో దశలోనే ఉన్నామని తెలుపుతుంది. అతను పట్టుకున్న ఇంగ్లీష్ టీ ఆకారంలో ఉన్న పతాకం మన తెలంగాణ! దీన్ని రణ్‌వీర్ ఆషామాషీగా నిర్మించలేదు. ఆ స్మారకాన్ని నిలబెట్టడానికి చేసిన ఫలకం మీద పరిచిన ప్రతి మార్బుల్ ఆయన స్వచ్ఛతను చూపిస్తోంది. ఆ స్టాచ్యూ తాను పుట్టిపెరిగిన గడ్డ మీది మమకారాన్ని చెప్తున్నది. అందుకే ఆ మనసుతో ఈ ప్రతిమ ప్రాణం పోసుకుందేమో అనిపిస్తుంది ఆ పరిసరాల్లోకెళ్లి నిలబడి గమనించిన వాళ్లకు!

బ్లాక్ డేస్…
1969..ఉద్యమ రోజులు…అప్పటికీ రణ్‌వీర్ సిన్హా మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌టీయూ కాలేజ్‌లో ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. రణ్‌వీర్ కూడా స్టూడెంట్ మూవ్‌మెంట్‌లో చురుకుగా పాల్గొంటున్నాడు. జైలుకు వెళ్లాడు. దెబ్బలు తిన్నాడు. చివరకు క్లాక్ టవర్ దగ్గర పోలీసులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ గాయాన్ని కూడా రుచి చూశాడు. మానిన ఆ మచ్చ తడి ఆరని తెలంగాణ తపనను ఇప్పటికీ తట్టి లేపుతుందట ఆయనను. 1969 వెళ్లి పోయింది. అధికారిక లెక్కల ప్రకారం మూడువందల ప్రాణాలూ పోయాయి. ఓ రెండేళ్లు గడిచాక 1972లో ప్రభుత్వానికి ఓ ఆలోచన వచ్చింది. తెలంగాణకు కంటితుడుపుగా పోరుబిడ్డల గుర్తుగా ఓ స్థూపాన్ని పెట్టిస్తే పోలా? అని. అనుకున్నదే తడవుగా దాని నిర్మాణానికి ఓపెన్ టెండర్లను పిలిచింది. అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ప్రైవేట్ ప్రాజెక్టులు చేస్తున్నాడు రణ్‌వీర్. ఈ టెండర్ నోటీసు ఆయన మనసులోని విషాద జ్ఞాపకాలను నోటీసుకి తెచ్చింది. తెలంగాణ కోసం తన తోటివారు పడిన ఆరాటం జ్ఞప్తికి వచ్చింది. చనిపోయిన సన్నిహితులు కళ్లముందు మెదిలారు. ఆ నల్లటి రోజులకు సాక్షిగా ప్రతిమను రూపొందించాలనుకున్నాడు. టెండర్ వేశాడు. తన ప్లాన్‌నూ గీసి డ్రాఫ్ట్‌ను పంపాడు. పోటీలో కాలేజిలో తనకు పాఠాలు చెప్పిన గురువులు కూడా ఉన్నారు. ఆ అదృష్టం ఈయననే వరించింది. పనులు మొదలుపెట్టాడు. మార్బుల్స్‌ని రాజస్థాన్‌లోని మక్‌రానా నుంచి తనే లోడ్ తీసుకుని వచ్చేవాడు. కాంస్య స్థూపం ముద్రను తయారుచేసే పనిని జేఎన్‌టీయూలోని తన గురువుకే అప్పగించాడు. అట్లా మూడు నెలల్లో స్థూపాన్నయితే తయారు చేశాడు కానీ అది అమర్చడానికి నాలుగేళ్లు పట్టింది. కారణాలు చాలా! సికింవూదాబాద్ స్థానికులు అడుగడుగునా ఈయనను ఇబ్బందులు పెట్టారు. నిర్మాణ ప్రదేశం నుంచి రోజో వస్తువును ఎత్తుకెళ్లే వాళ్లు. పోయిన వాటిని సమకూర్చుకునేసరికి కొత్తవి పోయేవి. నానా తంటాలు పడి అద్భుతమైన స్మారకాన్ని నిలిపాడు 1977, ఏప్రిల్ 4న!

చెదిరిపోని జ్ఞాపకం
సికింవూదాబాద్ నడి బొడ్డున క్లాక్ టవర్ ఒళ్లో చుట్టూ సువిశాలమైన పరిధిలో పచ్చని పచ్చిక బయలు మీద తెలంగాణ పౌరుషం నిలబడింది. తన ప్రత్యేక రాష్ట్ర ఆంకాక్షను ఆకాశానికెత్తి చూపుతూ! అటుగా వచ్చిన ఈ గడ్డ ప్రతి బిడ్డకు తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నట్టు. కాలం మారినట్టే ప్రభుత్వాలూ మారాయి. విశాలమైన పరిధి రానూరానూ కుచించుకుపోతున్నది. అమర వీరుల స్థూపానికి ఆలనాపాలనా కరువైంది. దానికి జన్మనిచ్చిన తండ్రినీ పట్టించుకున్న నాథుడు లేడు. చివరకు అది ఓ ఇరుకు సర్కిల్‌గా మారింది. ఫలకంలోని తెల్లని రాళ్లు ఒక్కొక్కటే మాయమవుతున్నాయి. మెలమెల్లగా శిథిలావస్థకు చేరుకుంటున్నది మన ఆశలాగే. ప్రతి యేడు ఏప్రిల్ నాలుగున తప్ప ఏరోజు దాని గురించి కానీ, దానికి ఊపిరి పోసిన రణ్‌వీర్ సిన్హా గురించి కానీ ఎవరూ పట్టించుకోరు.‘డబ్బుల కోసం నేను ఆ స్మారక చిహ్నాన్ని చేయలేదు. అందుకే గుర్తింపు కోసం తహతహలాడ ఈ భూమి మీద పుట్టినవాడిని, ఈ గాలి పీల్చుకుని బతుకుతున్న వాడిని ఈ నేలంటే నాకు ప్రాణం. దాన్ని ప్రత్యేకరాష్ట్రంగా చూడాలన్న కొట్లాటలో బుల్లెట్ దెబ్బనూ సహించాను. ఆ జ్ఞాపకాలను సజీవంగా ఉంచే అవకాశం నాకు రావడం, దాని కోసం కష్టపడ్డం తెలంగాణ అంటే నాకున్న ప్రేమకు గుర్తు. అందుకే ఆ మమకారాన్ని నేను వ్యాపారం చేయలేదు. ఆర్కిటెక్ట్‌గా నాకు గుర్తింపు రావాలన్న దురాశా నాకు లేకుండే. లేదు. నా బాధంతా…దాని నిర్వహణ గురించే. పాలకుల నిర్లక్ష్యం గురించే. ఇప్పటికైనా ఆ స్థూపం మీద శ్రద్ధ పెడితే బాగుంటుందేమో’ అంటాడు రణ్‌వీర్ సిన్హా తన బ్రెయిన్ చైల్డ్ అవస్థ చూసి బాధతో.

వైట్
రణ్‌వీర్ సిన్హా పెద్ద కొడుకూ ఆర్కిటెక్టే. తెలంగాణ ఆత్మగౌరవం శిథిలమవుతుంటే తల్లడిల్లుతున్న కొడుకు ‘నాన్నా…నేను దాన్ని పునరుద్ధరిస్తాను’ అంటాడట. పాత అనుభవాలు ఇంకా చెదరలేదు కాబట్టి మౌనమే ఆ తండ్రి సమాధానమట. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మొక్కుబడి వ్యవహారానికి స్వస్తి చెప్పి చిత్తశుద్ధితో కర్తవ్యం చేపడితే బాగుండు అని ఆ స్థూపం దుస్థితి చూసిన ఎవరైనా ఆశిస్తారు. నల్లరోజుల స్మారకానికి తెల్లటి వెలుగు వస్తే….ఇప్పటి ఉద్యమానికి ప్రేరణనైనా కనపడుతుంది.

ముగింపు:దివాన్ రణ్‌వీర్ సిన్హా ఆర్కిటెక్ట్‌గా కొన్నాళ్లు అమెరికాలో ట్రైనింగ్ తీసుకున్నాడు. భారతదేశంలోని నగరాల్లో అనేక కట్టడాలకు ప్లానింగ్ ఇచ్చాడు. ఇండస్ట్రీలు, కమర్షియల్ కాంప్లెక్సులు, రెసిడెన్షియల్ కాంప్లెక్సుపూన్నిటికో ఆకృతినిచ్చిన రణ్‌వీర్‌కు చిన్నప్పటి నుంచీ చిత్రలేఖనం మీద ఆసక్తి. అది గమనించి ప్రోత్సహించాడు ఆయన చిన్నప్పటి మ్యాథ్స్ టీచర్ మషాల్కర్. ఇందిరా గాంధీ పోట్రెయిట్‌ను గీసి ఆమెకు కానుకగా ఇచ్చాడు. గొప్ప కళాకారుడు, అద్భుతమైన ఈ ఆర్కిటెక్ట్‌ను ఇంకా గుర్తించకపోవడం నిజంగా దౌర్భాగ్యమే.

This entry was posted in TELANGANA MONAGALLU.

Comments are closed.