రజనీకాంత్‌తో మోడీ భేటీ

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రముఖ దక్షిణాది సినీ నటుడు రజనీకాంత్‌తో ఆదివారం భేటీ అయ్యారు. చెన్నైలో ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం సాయంత్రం విమానాశ్రయానికి చేరుకొన్న మోడీ అక్కడి నుంచి నేరుగా రజనీకాంత్ నివాసం పోయెస్ గార్డెన్‌కు వెళ్లారు. వారు దాదాపు 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు.  ఈ భేటీపై తమిళనాడులో విపరీతంగా ప్రచారం జరగటంతో వందల మంది రజనీ అభిమానులతోపాటు బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోయెస్ గార్డెన్ ముందు గుమికూడారు. ఈ నెల 24 రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. భేటీ అనంతరం రజనీ మాట్లాడుతూ తమ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు. తాను అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు మోడీ వచ్చి పరామర్శించారని, ఆ సమయంలో తాను మోడీని విందుకు ఆహ్వానించానని తెలిపారు.

modi-rajini12

నగరానికి వచ్చినప్పుడు విందుకు వస్తానని చెప్పిన మోడీ ఇప్పుడు వచ్చారని వివరించారు. మోడీ నా శ్రేయోభిలాషి, నేను మోడీ శ్రేయోభిలాషిని అని వ్యాఖ్యానించారు. ప్రధాని పదవికి పోటీ పడుతున్న మోడీకి రజనీ శుభాకాంక్షలు తెలిపారు. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా రజనీకి మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ తనకు మంచి మిత్రుడని అన్నారు. వీడ్కోలు సందర్భంగా ఇరువురు ఆత్మీయ ఆలింగనం చేసుకొన్నారు. అనంతరం మోడీ ఎన్నికల సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. సభలో మోడీ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌లోని సియాచిన్‌ను వదులుకొనేందుకు ప్రధాని సిద్ధమయ్యారని జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆయన ఒక్క మాట చెపితే.. పార్టీల జాతకం మారినట్టే
-ద్రవిడ రాజకీయాలపై రజనీకాంత్ మానియా
తమిళ సినీరంగంలో అట్టడుగు స్థానం నుంచి కష్టపడి అత్యున్నత స్థాయికి ఎదిగిన రజనీకాంత్‌కు తమిళనాడులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులున్నారు. సినిమాల్లో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజనీని రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఎప్పటి నుంచో అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఎప్పటికప్పుడు సున్నితంగా తిరస్కరిస్తూనే వస్తున్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీతో ఆయన భేటీ రాష్ట్రంలో రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

సినిమా- రాజకీయం విడదీయలేనంతగా కలిసిపోయిన తమిళనాడులో ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ రజనీకాంత్ మాటకోసం, మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలూ ఆశగా ఎదురుచూస్తుంటాయి. గతంలో ఆయన ఒక్క మాట చెబితే పార్టీల జాతకాలు మారిపోయిన సందర్భాలు అనేకం ఉండటంతో ఆదివారం నాటి మోడీ- రజనీ భేటీపై తమిళనాడులో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. 1996లో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వచ్చిన సమయంలో రజనీ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోయింది. జయలలితకు ఓటేస్తే రాష్ర్టాన్ని దేవుడు కూడా కాపాడలేడు అని ఆయన చేసిన ప్రకటనతో ఆమె జాతకం తారుమారైంది.

డీఎంకే- తమిళ మాణిల కాంగ్రెస్ కూటమికి తమిళ ఓటర్లు కుల, మతాలకు అతీతంగా దాదాపు ఏకగ్రీవంగా పట్టంగట్టారు. అయితే, ఆ తర్వాత రెండేళ్లకే జరిగిన ఎన్నికల్లో మాత్రం రజనీకి చుక్కెదురైంది. ఈ ఎన్నికల్లో రజనీ డీఎంకే-బీజేపీ కూటమికి మద్దతిచ్చినప్పటికీ అది ఓడిపోయింది. 2004 ఎన్నికల సమయంలో విడుదలైన రజనీ సినిమా బాబాకు పట్టాలి మక్కల్ కట్చి పార్టీ ఆటంకాలు కలిగించి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ అన్నాడీఎంకేకు ఓటు వేస్తున్న దష్యాలు టీవీలో ప్రసారం కావటంతో అది చూసిన ఓటర్లంతా జయలలిత పార్టీకి ఒక్కుమ్మడి ఓట్లేశారు. దాంతో డీఎంకే అధికారాన్ని కోల్పోవటమే కాకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయింది. అయితే అప్పటి నుంచీ రజనీకాంత్ ఏ పార్టీకీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు 10రోజుల ముందు మోడీని ఇంటికి ఆహ్వానించి రజనీ విందు ఇవ్వటంతో ఆయన పరోక్షంగా తమకు మద్దతిచ్చినట్లేనని, రజనీ అభిమానులంతా తమకే ఓట్లేస్తారని కమలనాథులు గంపెడాశలు పెట్టుకొన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.