రఘునందన్ సీమాంధ్ర ఏజెంట్ : హరీష్‌రావు

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ బహిష్కృత నేత రఘునందన్ చేసిన ఆరోపణలపై సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రఘునందన్ సీమాంధ్ర ఏజెంట్‌గా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రఘునందన్‌కు దమ్ముంటే సీడీలు సీబీఐకి ఇవ్వాలని సవాల్ చేశారు. సీమాంధ్ర పార్టీల గొంతుకను రఘునందన్ వినిపిస్తున్నారని పేర్కొన్నారు. రఘునందన్ తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు సుప్రీంకోర్టు జడ్జితోనైనా విచారణకు సిద్ధమని తేల్చిచెప్పారు. చట్ట పరంగా, న్యాయపరంగా ముందుకు పోతామని పేర్కొన్నారు.

రఘునందన్ లక్ష్యం ఉద్యమాన్ని బలోపేతం చేయడమా లేక బలహీనపరచడమా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజానీకం విశ్వసించదు అని చెప్పారు. ఎవరి క్యారెక్టర్ ఏమిటో మెదక్ ప్రజలకు తెలుసు అని హరీష్ తెలిపారు. పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది అయినప్పటికీ అన్ని చోట్ల ఓటమే అని గుర్తు చేశారు. టికెట్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే టీఆర్‌ఎస్ చెడ్డదా అని ప్రశ్నించారు. ఇతర పార్టీలతో చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలను రఘునందన్ ఎందుకు ఖండించడం లేదని హరీష్ అడిగారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణపై టీఆర్‌ఎస్, కేసీఆర్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.