రఘునందన్.. క్షమాపణ చెప్పాలి

KADIAM-SRIHARI-లేదంటే ఆరోపణల సాక్ష్యాలు బయటపెట్టాలి..
– కడియం 48గంటల డెడ్‌లైన్
-26ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరూ నీలా ఆరోపణలు చేయలేదు
-పరశురాంను హత్య చేసింది సీపీఎం నేతలు
-నాకు గానీ, టీడీపీకి గానీ ప్రమేయం లేదు
-ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు
-రఘునందన్‌కు టీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి హెచ్చరిక
-నా భర్తను చంపింది సీపీఎం నాయకులే: పరశురాం భార్య

టీఆర్‌ఎస్ బహిష్కృత నేత రఘునందన్‌రావు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, వీటిపై ఆయన 48గంటల్లోగా సాక్ష్యాలు బయటపెట్టాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీహరి డిమాండ్ చేశారు. రఘునందన్ ఆరోపణలను మొదటిరోజే తిప్పికొడుదామనుకున్నానని, రెండోరోజూ అవే ఆరోపణలు చేయడంతో స్పందిస్తున్నానని ఆయన తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన బొట్ల పరశురాం అనే టీఆర్‌ఎస్ కార్యకర్తను తాను మంత్రిగా ఉన్న సమయంలో హత్యచేయించినట్లుగా రఘునందన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

పరశురాం హత్య నేపథ్యంలో నాడు టీఆర్‌ఎస్ బంద్‌కు కూడా పిలుపునిచ్చిందని, అలాంటప్పుడు కడియంను టీఆర్‌ఎస్‌లోకి ఎలా ఆహ్వానిస్తారంటూ రఘునందన్ చేసిన వ్యాఖ్యలను కడియం తీవ్రంగా ఖండించారు. బొట్ల పరశురాం హత్యలో తనకుగానీ, టీడీపీకిగానీ ఎలాంటి సంబంధం లేదని, 26ఏళ్ల తన రాజకీయ జీవితంలో రాజకీయ ప్రత్యర్థులు కూడా ఏనాడూ తనపై ఇలాంటి ఆరోపణలు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం టీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘నా రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి ఆరోపణలుగానీ, హత్యారోపణలుగానీ, గుండాయిజంగానీ రాలేదు. మూడు రోజులుగా రఘునందన్ ఆరోపణలపై సమాచారం సేకరిస్తున్నా. ఎమ్మెల్యే పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గం జనగాం పరిధిలో బొట్ల పరశురాం గ్రామం ఇప్పగూడెం ఉంది. నా నియోజకవర్గంలో అది లేదు.

8-10-2003న హత్య జరిగింది. పరశురాం ఇప్పగూడెం సీపీఎం కమిటీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి గ్రామ కమిటీ అధ్యక్షుడు అయ్యాడు. ఆ గ్రామంలో ఇప్పటికీ సీపీఎం బలంగా ఉంది. బొట్ల పరశురాంను హత్య చేసింది సీపీఎం. ఏ1గా సీపీఎం నేత కత్తుల కాంతయ్యతో పాటు 16మంది సీపీఎం కార్యకర్తల పేర్లు పోలీస్ రికార్డుల్లో ఉన్నాయి. వీరంతా నేటికీ సీపీఎంలోనే ఉన్నారు. నాడు పార్టీ మారాడన్న ద్వేషం, కోపంతో ఈ హత్య చేసి ఉండొచ్చు. ఆనాడు టీఆర్‌ఎస్ జిల్లా బంద్‌కు పిలిపునిచ్చి ఇప్పగూడెంలో సంతాపసభ పెడితే కేసీఆర్ హాజరయ్యారు. నాడు టీడీపీనిగానీ, నా ప్రస్తావనగానీ తేలేదు. నిందితులకు ఆశ్రయం కల్పించానన్న ఆరోపణ అవాస్తవం. రఘునందన్ మాటలు చూస్తుంటే ఆయన మానసికస్థితి సరిగ్గా ఉన్నట్లు లేదు. ఘటన తర్వాత మూడుసార్లు ఎన్నికలు వచ్చినా.. టీఆర్‌ఎస్ నాపై ఆ ఆరోపణ చేయలేదు’ అని వెల్లడించారు.

పరశురాం హత్య విషయంలో తానుచెప్పేది అక్షరం తప్పైనా ఉరికి సిద్ధమని ఈ నెల 17న ప్రెస్‌మీట్‌లో రఘునందన్ ప్రకటించారని, ఆయనది మాటమీద ఉండే తత్వం అయితే 48గంటల సమయం ఇస్తున్నానని, సాక్ష్యాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.లేకుంటే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఇవేవీ చేయకుంటే రఘునందన్‌పై చట్టవూపకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ‘రఘునందన్‌ది మానసిక దౌర్భాగ్యమా..? నిజమైన తెలంగాణవాది అయితే, తెలంగాణపై ప్రేమ ఉంటే లక్ష్యసాధనలోకి వచ్చే వారిని స్వాగతించాలి’ అని అన్నారు. ఉద్యమాన్ని బలపరుద్దామని వచ్చేవారిపై చౌకబారు ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. తానేమీ ఉరికి సిద్ధం కావాలనడం లేదని, బహిరంగ క్షమాపణ చెబితే సరిపోతుందని రఘునందన్‌కు హితవుపలికారు.

చంపింది సీపీఎం నాయకులే: బొట్ల లచ్చమ్మ
తన భర్తను సీపీఎం నాయకులే చంపారని, నాడు టీఆర్‌ఎస్‌లో చేరడం వల్లే ఇలా చేశారని టీఆర్‌ఎస్ ఇప్పగూడెం అధ్యక్షుడు బొట్ల పరశురాం భార్య బొట్ల లచ్చమ్మ ఆదివారం మీడియాకు కడియం సమక్షంలో వెల్లడించారు. తన భర్త హత్య కేసులో టీడీపీకి గానీ, కడియం శ్రీహరికి గాని ఎలాంటి సంబంధం లేదని, కడియంపై ఎలాంటి అనుమానం లేదన్నారు. టీఆర్‌ఎస్ నేతలు రూ. 50వేల సాయం చేశారని, కడియం కూడా సాయం అందించారని చెప్పారు.

పద్మాలయ విషయంలో ప్రభుత్వానిదే నేరం: వినోద్
పద్మాలయ స్టూడియో విషయంలో మొదటినుంచి కొట్లాడుతోంది టీఆర్‌ఎస్సేనని, అక్కడ కట్టడాలు జరపకుండా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చింది టీఆర్‌ఎస్సేనని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్‌కుమార్ అన్నారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి పద్మాలయ స్టూడియోలో నిర్మాణాలు, అమ్మకాలు చేస్తున్నా… ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసలు నేరం చేసింది ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ముందు మీడియా.. రఘునందన్, హరీష్‌రావు విషయాన్ని పక్కన పెట్టి అక్రమ కట్టడాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. తన సస్పెన్షన్ ఎందుకని పార్టీని రఘునందన్ అడిగితే సమాధానం చెప్పేవారమని, అలా చేయకుండా ఆరోపణలు చేయడం సరైంది కాదని హితవుపలికారు. సమావేశంలో కట్టెల శ్రీనివాస్ యాదవ్, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి శ్రీనివాస్‌డ్డి, గోషామహల్ ఇన్‌చార్జి మహేందర్ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.