యూపీఏ-2పై బీజేపీ ధ్వజం

యూపీఏ-2 ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని బీజేపీ ధ్వజమెత్తింది. ప్రభుత్వంలో రెండు అధికార కేంద్రాలు ఉండడం, ప్రధాని మౌనం, చేతగానితనం, నిర్ణయాధికారాలు లేని కారణంగా దేశంలో నిరాశాపూరిత వాతావరణం నెలకొందని వ్యాఖ్యానించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ అటు దేశానికి నాయకుడు కాదని, ఇటు పార్టీకి నాయకుడు కాదని విమర్శించింది. బుధవారమిక్కడ లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నాలుగో వార్షికోత్సవం పేరుతో యూపీఏ సంబరాలు చేసుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు దేశంలో ఒక నిస్తేజం, నిరాశాపూరిత వాతావరణం మధ్య యూపీఏ సంబరాలు చేసుకుంటోంది.

ఈ సర్కారు అన్నింటా విఫలమైంది. దేశానికి నాయకత్వాన్ని అందించడంలో, దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంలో, అవినీతిని అరికట్టడంలో, దేశానికి, మహిళలకు భద్రత కల్పించడంలో అన్నింటా వైఫల్యమే. చివరికి కూటమి భాగస్వాములను కూడా ఒక్కతాటిపై నిలపలేకపోయింది..’’ అని వారు మండిపడ్డారు. ప్రధాని చేతిలో అధికారం లేదని, దీన్నిబట్టి యూపీఏ నిర్మాణంలో లోపం ఉన్నట్టు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ‘‘కేబినెట్‌లో సహచరులు ప్రధానితో కూర్చుకుంటారు. కానీ మార్గదర్శకాల కోసం సోనియా వైపు చూస్తారు. ఈ నాయకత్వ చీలిక యూపీఏ అతిపెద్ద వైఫల్యం..’’ అని సుష్మ అన్నారు. యూపీఏ-1 కన్నా యూపీఏ-2 మరింత అవినీతిమయమని, గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల వద్దకు వెళ్తామని చెప్పారు. సీబీఐ, సీవీసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, కాగ్, ఎన్నికల సంఘంలాంటి ప్రజాస్వామ్య సంస్థలను ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు. కేంద్రం సీబీఐని దుర్వినియోగం చేయకపోయినట్లయితే ఎస్పీ, బీఎస్పీలు మద్దతు ఇవ్వవని స్పష్టంచేశారు.

అద్వానీ పేరును పక్కనపెట్టలేదు..: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరుంటారని కొందరు విలేకరులు ప్రశ్నించగా.. దీనిపై రెండు దశల్లో నిర్ణయం తీసుకుంటామని సుష్మ చెప్పారు. తొలుత పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తామని, తర్వాత ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను సంప్రదిస్తామని పేర్కొన్నారు. ప్రధాని రేసులో పార్టీ అగ్రనేత అద్వానీ పేరును పక్కనపెట్టలేదన్నారు.

కుంభకోణాలను దాచిపెట్టిన యూపీఏ నివేదిక: బీజేపీ
యూపీఏ ప్రగతిపత్రం అసలు ప్రగతిపత్రమే కాదని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ నివేదికలో కుంభకోణాలను దాచిపెట్టి, తనకు అనుకూలమైన అంశాలను మాత్రమే ప్రస్తావించిందని, పైగా, తన వైఫల్యాలకు బీజేపీని తప్పుపడుతోందని విమర్శిం చింది. అన్ని కుంభకోణాలను దాచిపెట్టి, తనకు అనుకూలమైన వాటినే యూపీఏ ఈ నివేదికలో వెల్లడించిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు.

ఇది మైనారిటీ ప్రభుత్వం..: లెఫ్ట్
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. ఇది మైనారిటీ ప్రభుత్వమని, సీబీఐ బూచీ చూపి పార్టీల మద్దతును పొందుతోందని దుయ్యబట్టాయి. ‘‘ఇది నాలుగేళ్ల కిందటి యూపీఏ కాదు. పార్లమెంటులో ఈ ప్రభుత్వానికి మెజారిటీ లేదు. ఇప్పుడున్న మెజారిటీ సీబీఐ సాయంతో తెచ్చిపెట్టుకున్నది..’’ అని సీపీఎం నేత ఏచూరి మండిపడ్డారు. ప్రజల ఆక్షాంక్షలను నెరవేర్చడంలో యూపీఏ విఫలమైందని సీపీఐ కార్యదర్శి డి.రాజా విమర్శించారు. – See more at: http://www.sakshi.com/

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.