యూపీఏ విందుల ఖర్చు కోటిన్నర

20 విందులు.. 3వేల మంది అతిథులు.. కోటిన్నర ఖర్చు! ఇదీ యూపీఏ భాగస్వాములతో విందు సమావేశాలకు ఇటీవలి సంవత్సరాల్లో ప్రధాని కార్యాలయం చేసిన ఖర్చు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌కు పీఎంవో కార్యాలయం ఇచ్చిన లెక్క ఇది. అయితే సదరు విందు సమావేశాల మినిట్స్, ఈ విందు ల్లో ప్రైవేటుగా ఇచ్చినవి ఎన్ని అన్న వివరాలు వెల్లడించేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు. ఇవే కాదు.. 2007 మధ్యకాలంలో వామపక్షాల సమన్వయ కమిటీ సమావేశాలకు సైతం యూపీఏ లక్షలకొద్దీ సొమ్ము వెచ్చించింది. అమెరికాతో పౌర అణు ఒప్పందంపై యూపీఏతో వామపక్షాలు విభేదించే వరకూ ఈ సమావేశాలు కొనసాగాయి. ఒకవైపు దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ప్రభుత్వాధినేతలు ఇలా కోట్ల కొద్దీ సొమ్మును విందు సమావేశాలకు వెచ్చించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విందు సమావేశాలు 2004 నుంచి 2013 మధ్యకాలంలో జరిగాయి. వీటికి 3,064 మంది అతిథులు హాజరయ్యారు.

ఈ విందులకు అయిన రూ. 1.4 కోట్ల ఖర్చులో కేటరింగ్ చార్జిలు రూ.60లక్షల వరకూ ఉన్నాయి. విందుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు వంటి వాటికి మరో 57లక్షలు ఖర్చు చేశారు. విందు జరిగిన ప్రాంగణానికి విద్యుత్ కోసం మరో 15లక్షలు వెచ్చించారు. పూలతో అలంకరణకు 7 లక్షలు ఖర్చు చేశారు. మొత్తంగా ఒక్కో అతిథికి ప్రధాని కార్యాలయం చేసిన ఖర్చు రూ.4,478. సమావేశాల ఖర్చును చెప్పేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. వచ్చిన అతిథుల వివరాలు, సమావేశం దేనికి జరిగిందన్న సంగతిని వెల్లడించేందుకు నిరాకరించడాన్ని ఈ పిటిషన్ దాఖలు చేసిన హైదరాబాద్ నగర ఆర్టీఐ కార్యకర్త సయ్యద్ షా అలీ హుస్సేనీ తప్పుబట్టారు. ఒక్కోఅతిథి కోసం ప్రభుత్వంచేసిన ఖర్చు రూ. 4,478తో సగటు పేద కుటుంబం నెల ఖర్చు గడిచిపోతుందని ఆయన చెప్పారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.