యూనివర్సిటీల పాలకమండళ్లలో స్థానికేతరులను గుర్తిం చండి- సీఎస్‌కు గవర్నర్ ఆదేశం

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పాలకమండళ్ళలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నియమించిన సభ్యుల్లోని స్థానికేతరులను గుర్తించాలని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మహంతిని ఆదేశించారు. సీఎం పదవికి రాజీనామా చేయటానికి కొద్దిరోజుల కిరణ్‌కుమార్‌రెడ్డి 18 పాలకమండళ్ల ఫైళ్లపై సంతకాలు చేశారు. వీటిలో అవకతవకలు జరిగాయని, ఈ నియామకాలను ఆపాలని డిఫ్యూటీ సీఎం రాజనర్సింహ అప్పట్లోనే డిమాండ్ చేశారు. తాజాగా ఈ విషయం గవర్నర్ దష్టికి రావటంతో స్థానికేతరులను గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

govnarsmhnదీంతో సీఎస్ ఇటీవలి నియామక ఫైళ్లలో స్థానికేతరులను గుర్తిస్తూ జాబితా తయారు చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సీఎస్ ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ అధికారులు మూడు రకాల అంశాలపై నివేదిక రూపొందించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 18 వర్సిటీల పాలకమండళ్ల నియామకం కోసం కొలీజియం (ఉన్నతస్థాయి కమిటీ) సూచించిన పేర్ల జాబితా, అందులోని పేర్లను మారుస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత మనుషుల పేర్లను చేరుస్తూ ఆమోదం తెలిపిన జాబితాను సిద్ధం చేస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపిన వాటిలో స్థానికేతరులు ఎంతమంది ఉన్నారన్న అంశంపై మరో జాబితా రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా పాలకమండళ్ల ఏర్పాటు ఫైళ్లపై కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలపలేదు. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విబేధాలే ఇందుకు కారణం.

కొలీజియం సూచించిన సభ్యులను కాదని సీఎం తన వర్గానికి చెందిన వారిని సభ్యులుగా నియమిస్తూ ఆమోదం తెలిపారని డిఫ్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు ఆరోపించాయి. తన శాఖకు సంబంధించిన అంశాలపై, తన సమ్మతి లేకుండా సీఎం నిర్ణయం తీసుకోవటంపై రాజనర్సింహ అప్పట్లో అభ్యంతరం తెలిపారు. ఒక్కో యూనివర్సిటీ పాలక మండలిలో 9మంది సభ్యులుంటారు. ఇందులో కొలీజియం సూచించిన పేర్లు కాకుండా ఒక్కో మండలిలో 2 నుంచి 4 పేర్లను మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డి తనవారికి స్థానం కల్పించారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఎంతోకాలంగా నిర్లక్ష్యం వహించి తీరా రాష్ట్ర విభజన సమయంలో పాలకమండళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటనే అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ వీటిపై సమీక్షకు సిద్ధమయ్యారు. తెలంగాణలోని యూనివర్సిటీల పాలకమండళ్లలో స్థానికేతరులు ఎంతమంది? ఆంధ్రా వర్సిటీ ల్లో తెలంగాణ వారు ఎంతమంది ఉన్నారు? అనే విషయాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని గవర్నర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఉన్నత విద్యాశాఖ అధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.