యూటీ గీటీ జాన్తా నై

రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ పై సర్వాధికారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని అఖిలభారత మజ్లిజ్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) స్పష్టం చేసింది. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని, అలాంటి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా(యూటీ), సీమాంధ్రకు శాశ్వత రాజధానిగా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేదిలేదని తేల్చిచెప్పింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలంటూ సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, కొందరు నేతలు చేస్తున్న డిమాండ్‌పై మజ్లిస్ మండిపడింది. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రుల భద్రత, రక్షణను సాకుగా చూపించి యూటీ చేయాలనే డిమాండ్‌ను ప్రతిపాదిస్తే, తిరుపతి, వైజాగ్, కాకినాడలను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఎంఐఎం డిమాండ్ చేసింది.
mahmad

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల తీరుపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ముఖ్యమంత్రి పదవి కోసం టీ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారే తప్ప, తమ ప్రాంతం, హైదరాబాద్ విషయంలో ఎంత మాత్రం ఆలోచించడం లేదని పేర్కొంది. హైదరాబాద్ అధికారాలపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, హైదరాబాద్‌నుకేంద్రం పరిధిలోకి తీసుకుంటే అభ్యంతరం లేదంటున్న కొందరు టీ కాంగ్రెస్ నేతలకు హైదరాబాద్ అధికారాలపై మాట్లాడే హక్కు లేదని, వారు జోకర్లుగా వ్యవహరిస్తున్నారంటూ మజ్లిస్ పార్టీ నిప్పులు చెరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాషతో పాటు ఉర్దూను మొదటి భాషగా కేంద్రం ప్రకటించాలని, మైనారిటీల రక్షణ, సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, కృష్ణా మూడవ దశను వెంటనే పూర్తి చేయాలని మజ్లిస్ డిమాండ్ చేసింది. ఆర్టికల్ 371(డి)కి సవరణ అవసరం లేదని మజ్లిస్ అభిప్రాయపడింది. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, పార్టీకి ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ జాఫ్రీతో కలిసి బుధవారం పార్టీ కార్యాలయం దారుస్సలాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రుల ఉపసంఘం(జీవోఎం) బృందానికి మజ్లిస్ పార్టీ పంపించిన 46 పేజీల నివేదికతో పాటు ఆర్టికల్ 371(డి)పై న్యాయనిపుణుల నుంచి సేకరించిన అభిప్రాయాలు, గతంలో హైదరాబాద్ స్టేట్‌లోని పలు ప్రాంతాలను మహరాష్ట్రలో విలీనం చేసినప్పుడు పండిట్ సుందర్‌లాల్ కమిటీ సమర్పించిన నివేదికలను అసదుద్దీన్ ఒవైసీ మీడియాకు విడుదల చేశారు.

ఈ నివేదికలను జీవోఎం సభ్యులతో పాటు కేంద్ర హోంశాఖలో సెంటర్ స్టేట్ డివిజన్ సంయుక్య కార్యదర్శికి కూడా పంపించినట్లు ఒవైసీ తెలిపారు. జాతీయ స్థాయిలో మూడవ ఫ్రంట్ ఏర్పాటుపై ఒవైసీ స్పందిస్తూ ఫలితాలు ఎలా వస్తాయో చూడాల్సివుందని, అయితే దేశ ప్రజలు సెక్యులరిజం కోరుకునే పార్టీలనే ఆదరిస్తాయన్న నమ్మకం తనకుందన్నారు. కిరణ్, జగన్‌లతో స్నేహం కొనసాగుతుందా? అన్న ప్రశ్నకు స్నేహం అనేది యధావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. జీవోఎంకు పంపించిన నివేదికలో పేర్కొన్న అంశాలను మీడియా సమావేశంలో ఒవైసీ వివరించారు. అవి ఈ కింది విధంగా వున్నాయి..

-కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) జూలై 30న చేసిన ప్రకటనకు లోబడే, ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా రాష్ట్ర విభజన జరగాలి.
-ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలి.
-హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. కనుక యూటీగా, సీమాంవూధకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా అంగీకరించే ప్రసక్తే లేదు.
-విభజనకు సంబంధించి కేంద్ర కేబినెట్ నోట్‌లో హైదరాబాద్ అధికారాలపై స్పష్టత లేదు. విద్యా, ఉపాధి అవకాశాలపై స్పష్టత ఇవ్వలేదు.
-విభజన అనంతరం సీమాంధ్రకు రాజధాని, హైకోర్టులను వెంటనే ఏర్పాటు చేయాలి.
-హైదరాబాద్‌లోని శాంతిభద్రతలు, రెవిన్యూ, మున్సిపల్ వ్యవహారాలు, విద్యా..వంటి వాటిపై పర్యవేక్షణ, అధికారాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటానికి తాము అంగీకరించబోం. సీమాంధ్రుల రక్షణ, భద్రతను దృష్ట్యా కీలకమైన శాంతిభద్రతల అధికారాలను కేంద్రం పరిధిలో కొన్నాళ్ళ పాటు ఉంచినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు. సీమాంధ్రులు రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఉన్నారు. మరి అక్కడి శాంతిభద్రతల అధికారాలను కూడా కేంద్రం పరిధిలో ఉంచాలి.
-కొందరు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన సీమాంధ్ర నేతలు.. హైదరాబాద్‌లో సీమాంధ్రలు ఉంటున్నందున హైదరాబాద్‌ను యూటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్రకు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయాలంటున్నారు. అలా అయితే తిరుపతికి తెలంగాణ వాళ్ళు కూడా వెళుతారు, తెలంగాణకు ఓడరేవు సౌకర్యం లేదు కనుక రేపు వైజాగ్, కాకినాడ పోర్టుల నుంచి కార్యకలాపాలు సాగించాల్సి వస్తుంది. అప్పుడు ఆ నగరాలను కూడా యూటీ చేయాలి.
-టీ కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ అధికారాలపై మాట్లాడే హక్కు వారికి లేదు. వారికేం తెలుసు. వారు జోకర్లుగా వ్యవహరిస్తున్నారు. సీఎం పదవి కోసం ఆరాటమే తప్ప విభజన అనంతరం తెలంగాణ, హైదరాబాద్ గురించి వారికి పట్టింపు లేదు.
-హైదరాబాద్ సిటీ పోలీసు పరిధిలో నాలుగు వేలు, సైబరాబాద్ పరిధిలో మూడు వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. విభజన అనంతరం హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల సీఎంలు ఉంటారు. బందోబస్తు మరింత పెరుగుతుంది. కనుక పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచాలి.

-హైదరాబాద్ శాంతి భద్రతల ఆంశం, అధికారాలు తెలంగాణ ప్రభుత్వం పరిధిలోనే ఉండాలి. సీమాంవూధులకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించలేని పరిస్థితి వస్తే రాజ్యాంగంలోని 356వ అధికరణ ద్వారా ప్రభుత్వాన్ని కేంద్రం తప్పించాలి.
-విభజన వల్ల హైదరాబాద్‌కు ఆర్ధిక నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంది. పెట్టుబడులు పడిపోతాయి. పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి. ఈ విషయం వైపు ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. సింగరేణి కాలరీస్ ద్వారా వచ్చే రాయల్టీపైనే తెలంగాణ రాష్ట్రం నడువదు. రేపు తెలంగాణ సీఎం వాహనానికి కూడా పెట్రోల్ కొనేందుకు డబ్బులు ఉండని పరిస్థితి వస్తుంది. కాలినడకన వెళ్ళాల్సిందే.
-తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఉన్నది ఏకైక ఇంజన్ హైదరాబాదే.
-విభజన అనంతరం సీమాంధ్రకు కొత్త రాజధానిని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలి.
-సీమాఁధ్ర ప్రజల డిమాండ్ మేరకు హైకోర్టును కూడా వెంటనే విభజించాలి.
-తెలంగాణ రాష్ట్రంలో ఉండే సీమాంధ్ర ప్రజలకు భవిష్యత్తులో రక్షణ కల్పించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 ప్రకారం వారిని లింగ్విస్టిక్ మైనారిటీలుగా తెలంగాణ ప్రభుత్వం పరిగణించాలి.
-శాశ్వత ఉమ్మడి రాజధాని అని కొందరంటున్నారు. విభజనకు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఖైర్‌తాబాద్ మండలాన్ని, లేదా ఖైర్‌తాబాద్ నియోజకవర్గాన్ని ఇంట్రీమ్ క్యాపిటల్‌గా చేసి చూడాలి.
-విభజన సందర్భంగా తెలంగాణలో రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. భౌగోళిక పరిస్థితులు, ఆ రెండు జిల్లాల నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని వారికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతోనే తాము ఇందుకు అంగీకరిస్తున్నాం. గతంలో కూడా తాము ఇదే విషయాన్ని కృష్ణ కమిటీకి నివేదించాం.
-పోలవరంకు జాతీయ హోదా ప్రకటించినట్లే, తెలంగాణలోని ప్రాణహిత-చే ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలి. రాబోయే 15 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు కృష్ణా మూడవ దశ పథకాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలి.
-సింగరేణి కాలనీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆజామాయిషీలో ఉంచాలి. తెలంగాణ విద్యుత్ సమస్యలు తొలగించాలి.
-ఆస్తుల పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్‌ను గతంలో నిజాం నిర్మించాడు. దాన్ని అమ్మి కొన్న భూములపై ఏపీభవన్‌ను నిర్మించారు. కనుక ఏపీభవన్ తెలంగాణ ప్రభుత్వానికే చెందాలి.
-విభజనకు ముందే కొత్త రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి.
-రాష్ట్ర విభజన నేపధ్యంలో… ఆర్టికల్ 371(డి)ని సవరించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో తాము ప్రముఖ న్యాయవాది నిరంజన్‌డ్డితో పాటు మరికొందరి సలహాలు, సూచనలు తీసుకున్నాం.
-రెండు రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి. వారి అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
-మతఘర్షణల నిరోధక బిల్లును రెండు రాష్ట్రాల్లో అమలు చేయాలి.
-యూనివర్సిటీలు లేని జిల్లాల్లో వెంటనే వాటిని ఏర్పాటు చేయాలి.
-గతంలో రాష్ట్రాల విభజనలు జరిగినప్పుడు ముంబైని, మేఘాలయను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఒప్పుకోలేదు. ఇప్పుడు యూటీ డిమాండ్ ఎందుకు వస్తున్నది?

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.