మోడీ సభపై ఉగ్రపంజా

బీహార్ రాజధాని పాట్నా వరుస బాంబు పేలుళ్లతో నెత్తురోడింది. ఆదివారం బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హాజరైన సభాప్రాంగణం సహా ఐదు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, 83మందికి తీవ్ర గాయాలయ్యాయి. Bombక్షతగాత్రుల్ని పాట్నా వైద్య కళాశాలకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న హుంకార్ సభకు నరేంద్రమోడీ రానుండటంతో సంఘ విద్రోహులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నారు. హూంకార్ సభను సక్సెస్ చేసేందుకు బీహార్ రాష్ట్ర శాఖ ఎంతో ఆర్భాటంగా నిర్వహించేందుకు కొద్దిరోజులుగా ఏర్పాట్లు చేస్తున్నది. భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న సంఘ విద్రోహులు భారీ జననష్టం కలిగించేందుకు పాట్నాలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఆదివారం ఉదయం 10.30 గంటలకు పాట్నా రైల్వేస్టేషన్‌లో 10వ నెంబర్ ప్లాట్‌ఫాంపై తొలుత ఒక బాంబు పేలింది. ఈ ఘటనలో ప్రయాణికుడొకరు మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఆ తర్వాత హూంకార్ సభ నిర్వహించే గాంధీ మైదాన్ సమీపంలోని సినిమా థియేటర్ వద్ద ఒక బాంబు పేలింది.
అప్పటికే గాంధీ మైదాన్‌కు భారీగా చేరుకుంటున్న ప్రజలకు ఏం జరిగిందో తెలిసేలోగా పది నిమిషాల్లోనే మైదానంలో రెండు చోట్ల, వెలుపల మూడు చోట్ల బాంబులు పేలాయి. మైదానంలో జరిగిన బాంబు పేలుళ్లకు సమీపంలోని కొందరు విసిరేసినట్లు దూరంగా పడటం, భారీగా పొగ కమ్ముకోవడంతో ప్రజలు హాహాకారాలు చేస్తూ.. పరుగులు తీశారు. ఒకరినొకరు తోసుకుంటూ మైదానంలో అటు ఇటు పరుగెత్తారు. దీంతో ప్రజలను అదుపుచేయడంతో మైదానాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం మోడీ సభకు అడుగడునా భారీ భద్రత ఏర్పాటు చేశారు. గాంధీ మైదాన్ వెలుపల జరిగిన ఐదు పేలుళ్లు తక్కువ తీవ్రత గలవని అందువల్లనే జననష్టం భారీగా జరగలేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అవి నాటు బాంబులని, టైమర్ ఉపయోగించి పేల్చినట్లు సమాచారం. గాంధీ మైదానంలో పేలని నాలుగు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు అనంతరం భయానక వాతావరణం నెలకొంది. నెత్తురోడుతున్న క్షతగాత్రులను పోలీసులు తరలిస్తున్న దృశ్యాలను చూసి ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

బాంబు పేలిందని తెలుసుకుని కొందరు ప్రయాణాలను మానుకుని అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు 10 వ ప్లాట్‌ఫాం సమీపంలోని టాయిలెట్‌లో పేలని రెండు బాంబులను స్వాధీ నం చేసుకున్నారు. బాంబులను తొలగిస్తున్న క్రమంలో ఓ పోలీసు గాయపడ్డారని రైల్వే ఎస్పీ ఉపేంద్రకుమార్ సిన్హా తెలిపారు. మోడీ సభ కోసం ప్రయాణికుల్ని తరలిస్తున్న ప్రత్యేక రైళ్లు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం వచ్చాయని, ఆ ప్లాట్‌ఫాంపై బాంబులు పేలి ఉంటే ప్రమాద తీవ్రత అధికంగా ఉండేదని పోలీసువర్గాలు పేర్కొన్నాయి. నిర్దేశిత సమయంలో బాంబులు పేలేలా ఉగ్రవాదులు టైమర్లను ఉపయోగించారని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు బాధ్యుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని, మరో నలుగరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పట్టుబడిన వ్యక్తి ఏ సంస్థకు చెందిన వ్యక్తి, దీని వెనక ఎవరున్నారనే విషయాలు తెలియవని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపాయి.

ఘటనాస్థలికి ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ: హోంమంత్రి షిండే
పాట్నాలో బాంబు పేలుళ్ల అనంతరం సత్వరమే సంఘటన స్థలానికి ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలను పంపినట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఐదు బాంబు పేలుళ్లు జరిగాయని, ఐదుగురు చనిపోయినట్లు చెప్పారు. బీహార్ ప్రభుత్వంతో మాట్లాడామని, పరిస్థితి సమీక్షిస్తున్నట్లు ముంబైలో ఆయన మీడియాకు చెప్పారు. బోధగయ పేలుళ్ల ఘటనను దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ బృందాన్ని, పాట్నాకు పంపి కేసు పరిశీలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పేలుళ్ల వెనుక ఉగ్ర కుట్ర ఉందా..? అని ప్రశ్నించగా ఆయన నర్మగర్భంగా సమాధానమిచ్చారు.

ఇప్పటివరకు ఉన్న తన వద్ద సమాచారం చెప్పాలని పేర్కొన్నారు. కాగా, పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాలు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సంఘటన స్థలంనుంచి ఆధారాలు సేకరించడంతోపాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న నాటు బాంబులను పరిశీలించారు. సంఘటన తీరును అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బీహార్ ప్రభుత్వంతో పరిస్థితిని సమీక్షించింది. ఎన్‌ఐఏ పేలుడు పదార్థాల నిపుణులను బీహార్‌కు పంపాలని నిర్ణయించింది. ఈ విషయమై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేబినెట్ సెక్రటరీ అనిల్ గోస్వామి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ ప్రభుత్వంతో పేలుళ్ల విషయమై చర్చించామని చెప్పారు. దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించేందుకు నిర్ణయించామని తెలిపారు.

ఘటనలో ఇండియన్ ముజాహిదీన్ హస్తం..!
పేలుళ్ల ఘటనలో ఇండియన్ ముజాహిదీన్ హస్తం వున్నట్లు పక్కా ఆధారాలు లభించాయి. బాంబు పేలుళ్ల అనంతరం పోలీసులకు చిక్కిన నిందితుడు ఐఎం చీఫ్ యాసిన్ భక్తల్ అనుచరుడు మహ్మద్ తహసీన్ అక్తర్ అని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇతడు జార్ఖండ్‌కు చెందినవాడని సమాచారం. పాట్నా పోలీసులు ఆదివారం రాత్రి అందించిన సమాచారంతో రాంచీలోని ధుర్వాలో జరిపిన తనిఖీల్లో భారీగా గన్‌పౌడర్ లభించినట్లు ఆ రాష్ట్ర పోలీసు అదనపు డీజీ ఎస్‌ఎన్ ప్రధాన్ మీడియాకు తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.