మేడారం గద్దెలపై పాదుకలా?

ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరైన మేడారంలో కొంగొత్త ఆచారాలు కొలువు దీరుతున్నాయి. ఆదివాసీ సంస్కృతిని కాలరాసేలా దశల వారీగా మార్పులు వెలుగుచూస్తున్నాయి. రూపం లేని ప్రకృ తి దేవతలకు కొత్తగా పాదుకలు పుట్టుకొచ్చాయి. ఎన్నడూ లేనివిధంగా ఈ సారి జాతరకు ముందే సమ్మక్క, సారలమ్మ గద్దెలపై పాదుకలు వెలిశాయి.అవి రాముని పాదుకలని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రూపం లేని మా దేవతామూర్తులకు రూపాలు ఆపాదిస్తూ తమ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నాయి. జాతర నిర్వహణలోనూ దేవాదాయశాఖ పెత్తనం పెరిగిపోతోందని ఆదివాసీలు ధ్వజమెత్తుతున్నారు. medaram
సంప్రదాయ ఆచారాలకు విరుద్ధంగా చేస్తే ఒప్పుకోబోమని, తక్షణమే పాదుకలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భక్తుల సౌకర్యార్థం గద్దెల ప్రాంగణం చుట్టూ పై కప్పు వేయాలని జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఎన్‌ఐటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు క్షే త్రస్థాయిలో పర్యటించినట్టు విశ్వసనీయ సమాచారం. జాతర సమయంలో పగలు ఎండ ప్రభావంతో భక్తులకు ఇబ్బందుల్లేకుండా వచ్చే జాతర వరకైనా గద్దెల ప్రాంగణం అంతా పైకప్పు (సాలహారం) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పున్నమి వెన్నెల (మాఘశుద్ధపౌర్ణమి ) గద్దెలపై పడాలనేది గిరిజన ఆచార సంప్రదాయం. ఈ క్రమంలో పైకప్పు ప్రయత్నాలు చేస్తే గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశాలున్నాయని, ఏర్పాటు వద్దని కొంతమంది వారిస్తున్నట్టు తెలుస్తున్నది. జిల్లా యంగ్రాంగం అలాంటి చర్యలకు పూనుకుంటే చూస్తూ ఊరుకోబోమని ఆదివాసీ సం ఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఆదివాసీ సంస్కృతికి వ్యతిరేకంగా మార్పులు
గతంలో గద్దెల చుట్టూ ఇనుప గ్రిల్స్‌ను ఏర్పాటును కూడా గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే, భక్తుల రద్దీ ఇతరత్రా కారణాలు చూపి వడ్డెలను (పూజారులను) ఒప్పించారు. అప్పటి నుంచి క్రమంగా కొత్త ఆచారాలను మేడారంలో ప్రవేశపెడుతున్నారు. గతంలో గద్దెల ప్రాంగణాన్ని ఆనుకొని పులిమీద సమ్మక్క-జింక మీద సారలమ్మ కూర్చున్నట్టుగా భారీ చిత్రాలను వేయించారు. ఆదివాసీ సంఘాలు, పూజారుల సంఘం తీవ్ర అభ్యంతరం తెలిపి భారీ ఆందోళన చేపట్టింది. పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన దేవాదాయశాఖ ఆగమేఘాల మీద పెయింటింగ్స్‌ను తుడిచివేయించింది. మరోసారి గద్దెల చుట్టూ సుందరీకరణ పేరుతో 2008 జాతరలో భద్రాచలం నమూనాతో పోలిన సాలహారం నిర్మాణాన్ని చేపట్టారు. అప్పుడూ ఆందోళన చేసినా ఫలితం లేకుండాపోయింది. ఒకసారి అమ్మాభగవా న్ సంస్థ 32 అడుగుల సమ్మక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రయత్నాలు చేసినప్పుడూ ఆందోళన వ్యక్తమైంది. గద్దెల ప్రాంగణం ఎదుట ‘ఆలయంలోకి సెల్‌ఫోన్లు తీసుకుపోవద్దు’ అని సూచన బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.

గద్దెలకు బదులు ఆలయం అని సంబోధించడంపైనా కుట్ర దా గుందని గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గద్దెల పై పాదుకలు కొలువు తీరడం, వాటిని రామునివిగా అక్కడ ప్రచారం చేయడం లాంటి అం శాలు దుమారాన్ని రేపుతున్నాయి. ‘ఆదివాసీలు విగ్రహారాధకులు కాదు. అది గిరిజన సంప్రదాయానికి విరుద్ధమైన విధానం. అవి రాముని పాదుకలైనా, మరొకటైనా తీవ్రంగా వ్యతిరేకిస్తాం.గతంలో జంపన్నవాగు నిర్మాణం సందర్భంగా తవ్వకాలు జరుపుతున్నప్పుడు బయటపడ్డ విగ్రహాలను తెచ్చి గద్దెల దగ్గర పెడితే ఆందోళన చేశాం. ఇప్పుడు ఈ పాదుకల్ని ఎలా పెడతారు? సమ్మక్క-సారలమ్మ ప్రకృతి ప్రసాదితాలు. మేం ప్రకృతిని పూజిస్తాం. విగ్రహాలను కాదు. గద్దెల దగ్గర పాదుకల్ని పెట్టిన వాళ్లు తక్షణం తీసేయకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం’అని తుడుందెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బగట్ల నర్సింగరావు తేల్చిచెప్పారు.

లడ్డూలు విక్రయించేందుకు ప్రయత్నాలు
జాతర సమయంతోపాటు, రెండేళ్ల పొడవునా భక్తులు వచ్చిపోతున్నారు. దీంతో దేవాదాయశాఖ అక్కడో కౌంటర్ ఏర్పాటు చేసి లడ్డూలను విక్రయిస్తోంది. భక్తులు లడ్డూలను కొనుగోలు చేయడం లేదు. బంగారం (బెల్లం) నైవేద్యంగా కొలిచే భక్తులుంటారు కానీ లడ్డూవూపసాదాలను కొనుగోలు చేయరని గిరిజనులు చెబుతున్నారు. జాతర సమయాల్లో గతంలో ఇతర దేవస్థానాల నుంచి లడ్డూ ప్రసాదాలను విక్రయించేందుకు ప్రయత్నించినా అమ్ముడుపోలేదని, పాడైపోతే పారబోసిన దాఖలాలున్నాయని గుర్తుచేస్తున్నారు. ప్రసాదాల విధానం మార్చుకోవాలని హితవు పలికారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.