మేడారంలో తొలిఘట్టం ప్రారంభం

కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే మాఘశుద్ద పౌర్ణమి గడియలు సమీపించాయి. జాతరలో అమ్మవార్లకు సంబంధించిన తొలిఘట్టం బుధవారంప్రారంభమైంది. గిరిజన సంస్కతి, సంప్రదాయాల ప్రకారం బుధవారం మేడారంలో జాతరలో తొలిఘట్టమైన గుడిని శుద్ధిచేసే పండుగను గిరిజన పూజారులు లాంఛనంగా ప్రారంభించారు. నెలరోజుల పాటు తల్లుల సేవలో పూజారుల కుటుంబాలు తరించిపోతాయి. మేడారం గ్రామ సమీపంలోని సమ్మక్క నిలయంలో కొక్కెర, సిద్దబోయిన వంశస్తులు, కన్నెపల్లిలోని సారలమ్మ నిలయంలో కాక వంశస్తులు, కొండాయిలో గోవిందరాజుల నిలయంలో దబ్బకట్ల వంశస్తులు, కొత్తగూడెం మండలం పూనుగుండ్లలో పగిడిద్దరాజు నిలయంలో పెరుక వంశస్తులు భక్తి, శ్రద్ధలతో గుడిని శుద్ధి చేసే పండుగను నిర్వహించారు.

medaramశుద్ధి చేసే పండుగ అంటే..
సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ మొత్తం ఆదివాసీ సంస్కతి, సంప్రదాయాల్లో నిర్వహిస్తారు. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతరకు సరిగ్గా రెండు బుధవారాల ముందు శుద్ధి చేసే పండుగను నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల్లోని మహిళలు(ముత్తైదువులు)శుద్ధి పండుగలో కీలకభూమిక పోషిస్తారు. ఉదయమే ఇళ్ల ముందు అలుకుపూతలుపూర్తిచేసి,తలస్నానం చేసి తల్లుల నిలయం వద్దకు చేరుకుంటారు.చెట్ల పొదలను, పిచ్చిమొక్కలను తొలగిస్తారు. తర్వాత అడవికి వెళ్లి నెత్తిమోతతో ఆకులు,పొరక, బడితెలు తెచ్చి శుద్ధిచేసి కొత్త నిలయాన్ని నిర్మిస్తారు. ప్రస్తుతం గుడి స్వరూపంతో కూడిన ఆలయాలుండటం వల్ల ఈ సారి సమ్మక్క కొలువైన ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేశారు.ఆలయం లోపల కుంకుమభరిణె, ఇతర ప్రతిమలను నిండు కుండ నీళ్లతో శుభ్రపరిచారు. తిరిగి ఎర్రటి వస్ర్తాల్లో చుట్టి భద్రపర్చారు. తర్వాత పసు పు, కుంకుమ, కొబ్బరి, బెల్లం, పాలు, పం డ్లు, అగర్‌బత్తులతో పూజచేశారు. నైవేద్యంగా మేకలు, కోళ్లను హారంగా ఇచ్చారు. దీంతో జాతరలో మొదటిఘట్టం ప్రారంభమైనట్లు ఆదివాసీలు భావిస్తారు.

వచ్చే బుధవారం మండమెలుగుడు
వచ్చే బుధవారం రోజున రెండో ఘట్టమైన మండె మెలుగుడు మొదలవుతుంది. నూతనంగా నిర్మించిన తల్లుల నిలయాల్లో పూజలు నిర్వహించి కొత్త మండలు తెచ్చి కప్పులువేస్తారు. గుట్ట గడ్డితో కప్పాలి. ఊరు చివర దోర స్తంభాన్ని పాతుతారు. దోర స్తంభం కోసం అడవికి వెళ్లి కోపిరి అనే గడ్డిని తెచ్చి ఎంట్లు(తాడు)గా పేని తోరణాలు కడుతారు. ప్రతి పూజారి కుటుంబం నుంచి పూర్వంలోనైతే అంబలి(సారసాక, బెల్లంసాక) ఆరగింపు చేసి పండుగ చేస్తారు. రెండో ఘట్టం పూర్తయిన మరో బుధవారం అమ్మవార్ల ఆగమన ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. ప్రధాన ఘట్టం నాలుగు రోజుల పాటు సాగుతుంది. బుధవారం(ఫిబ్రవరి 12న) సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెకు చేరుతారు. గురువారం(13న) సమ్మక్క తల్లి గద్దెకు చేరుతుంది. శుక్రవారం(14న) మొక్కులు చెల్లింపులు, శనివా రం(15) తల్లులు వనప్రవేశం ఉంటుంది. జాతర తర్వాత బుధవారం తిరుగువారంతో నెలరోజుల తల్లుల పండుగ ముగుస్తుంది.

ఈసారి పూజార్లు వీరే
ప్రధానఘట్టంలో ముఖ్యభూమిక పోషించే పూజారులకు ప్రాధాన్యత ఉంటుంది. దేవుళ్లను కొలుచుకునే వంశస్తుల నుంచి నిష్ఠను పాటించే యువకుడిని ప్రధాన ఘట్టానికి ప్రాతినిధ్యంవహించే పూజారిగా నిర్ణయిస్తారు. పూజారులంతా ఒక్కరినే ఎన్నుకుంటారు. వీరికి సహాయకులుగా నలుగురుంటారు. జలకం వడ్డె, దూపం వడ్డె, కొమ్ము వడ్డెలు ప్రధాన భూమికను పోషిస్తారు. ఈ సారి సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చే ఘట్టానికి సంబంధించిన బాధ్యతలు కొక్కెర కష్ణయ్య నిర్వహిస్తారు. సారలమ్మ పూజారిగా కాక సారయ్య, పగిడిద్దరాజు పూజారిగా పెనుక బుచ్చిరాములు, గోవిందరాజుల పూజారిగా దబ్బకట్ల గోవర్ధన్ వ్యవహరిస్తారని పూజారుల(వడ్డెల) సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అలెం రామ్మూర్తి తెలిపారు.

9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు:ఆర్టీసీ ఈడీ పురుషోత్తం
సుబేదారి: మేడారం జాతర కోసం ఫిబ్రవరి 9 నుంచి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ తదితర 47 పాయిం ట్ల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పురుషోత్తం తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతర ఆర్టీసీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ఈసారి జాతరకు 3525 బస్సులను 47 పాయింట్ల నుంచి నడుపుతున్నామని తెలిపారు. 20 లక్షల మంది ఆర్టీసీ బస్సు ల్లో జాతరకు వస్తారని అంచనా వేస్తున్నామ న్నారు. జాతరలో తొలిసారిగా టిమ్స్ మిషన్స్‌తో టికెట్లు ఇస్తామని చెప్పారు. దీంతో సమ యం ఆదాతో పాటు బస్సులు వెనువెంటనే బయలుదేరుతాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి 50 సూపర్ లగ్జరీ బస్సులు, 4 ఏసీ బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.