మెరుపు సమ్మెకు ఉద్యోగులు సిద్ధం

goudsss
– ఢిల్లీ దీక్షకు భారీగా తరలిరావాలి
– వేధిస్తున్న ఆంధ్రా అధికారుల జాబితాలు సిద్ధం
– టీ కాంగ్రెస్ నేతలు సడక్‌బంద్‌లో పాల్గొనాలి
– టీజీవో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ సాధన కోసం మరోసారి మెరుపు సమ్మెకు దిగేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని టీజీవో సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. అక్రమ అరెస్టులు, కేసులు, జైళ్లకు భయపడేదిలేదని ఆయన అన్నారు. ఉద్యోగులను తెలంగాణ ఉద్యమానికి దూరం చేసేందుకు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ‘18 రోజులు సహాయ నిరాకరణ చేశాం. 42 రోజులు సకల జనుల సమ్మె చేశాం. మరోసారి తెలంగాణ కోసం మెరుపు సమ్మె చేస్తాం’ అని ప్రకటించారు. కేంద్రం మోసం వల్ల వెయ్యిమంది ఆత్మబలిదానం చేశారని పేర్కొన్నారు. శనివారం వరంగల్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘం సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజావూపతినిధులు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో కలిసివస్తే పువ్వుల్లోపెట్టి గెలిపిస్తామని టీజేఏసీ పిలుపునిచ్చినా ముందుకురావడం లేదన్నారు. వీరికి 2014 ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే ఉద్యోగుల గొంతు నొక్కుతూ అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. 610 జీవో వచ్చి 25 ఏళ్లు దాటినా నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ఇదో గిన్నిస్ బుక్ రికార్డు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే దీక్షకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్‌లో భారీ బహిరంగసభను, అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలన్నారు. విజయవాడ సడక్ బంద్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసిరాకుంటే వచ్చే ఎన్నికల్లో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఆంధ్రా అధికారుల జాబితా సిద్ధం: ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులను ఆంధ్రా అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని, వారి జాబితాను సిద్ధం చేశామని, 2014 నాటికి తెలంగాణ రాష్ట్రం రావడం ఖాయమని, ఆ తర్వాత వారి భరతం పడుతామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. తె పదో పీఆర్‌సీని 2013 జూలై1కల్లా అమలు చేయాలని, కేంద్రం తరహాలోనే ఐదు రోజుల పనివారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్‌లీవ్‌గా పరిగణించాలన్నారు. నాలుగేళ్లుగా ఊరిస్తున్న ఉద్యోగుల హెల్త్‌కార్డుల స్కీంను ఉగాది నుంచి అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి మాటను నిలబెట్టుకోవాలని కోరారు. తెలంగాణ అధికారులపై పెట్టిన కేసులను, ఇటీవల సడక్ బంద్ సందర్భంగా పెట్టిన కేసులను ఉద్యోగ జేఏసీతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగంగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీజీవో కేంద్ర సంఘం కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌రావు, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పరిటాల సుబ్బారావు, ఏ జగన్మోహన్‌రావు, కేంద్ర సంఘం నాయకులు వీ మమత, బీ అరుణ, టీ రవీంవూదరావు, సత్యనారాయణ, పురుషోత్తండ్డి, రామేశ్వర్‌రావు, మధుసూదన్‌గౌడ్, విష్ణువర్థన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులతోనే ఉద్యమానికి ఊపు :
భువనగిరి: ఉద్యోగులతోనే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతోందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం నల్లగొండ జిల్లా భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని పార్టీల నేతలతీరుతోనే ప్రత్యేక రాష్ట్రానికి ఆటంకం కలుగుతోందన్నారు. ఈ నెల 14లోపు తెలంగాణపై నిర్ణయం ప్రకటించకుంటే ఉద్యమాన్ని తీవ్రంగా ముందుకు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.