మెదక్ నుంచి కేసీఆర్!

 

kcr – సొంత జిల్లా నుంచి పోటీకి సమాయత్తం

– టీఆర్‌ఎస్ బలోపేతానికి వ్యూహం
– అన్ని సీట్లు గెలువాలని లక్ష్యం
– ఆచితూచి అభ్యర్థుల ఎంపిక
– అన్ని పార్టీల నాయకులపై ఆరా
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లా రాజకీయాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌ను బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తరచూ జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జిల్లా రాజకీయాలపై పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నారు. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి.

గత కొద్ది రోజులుగా కేసీఆర్ జిల్లా రాజకీయాలపై వివిధ వర్గాల నుంచి అభివూపాయాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీల నాయకుల బలాలు, బలహీనతల వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. తాను సొంత జిల్లా నుంచే పోటీ చేయాలని, ఆ క్రమంలో జిల్లాలో అన్ని సీట్లు కైవసం చేసుకోవాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. ప్రజల్లో గుర్తింపు లేని, చెడ్డపేరున్న నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందుకు వచ్చినా దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తనను కలవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కేసీఆర్ స్పందించడంలేదని తెలిసింది. తన సర్వేలో సదరు ఎమ్మెల్యేకు ప్రజల్లో మంచిపేరు లేదని తేలిపోవడంతోనే పక్కకు పెట్టినట్టు సమాచారం. ఇదే క్రమంలో తన సర్వేలో మంచి మార్కులొచ్చిన ఓ టీడీపీ నాయకుడిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలని భావిస్తున్నారు. కేసీఆర్‌తోపాటు జిల్లాకు చెందిన హరీశ్‌రావు సూచనల మేరకు సదరు నాయకుడు త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు సమాచారం.

టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం మినహా మిగతా 9 నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల పనితీరును తెలుసుకుంటున్నారు. పురిటిగడ్డలో 10 స్థానాలకుగాను గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. తానే ఇక్కడి నుంచి పోటీచేసి అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు తెలిసింది.

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోమవారం వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. కమలాకర్ రాకముందు చాలాసేపు కేసీఆర్ మీడియాతో రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన మెదక్ ఎంపీగా పోటీ చేయనున్నట్టు సంకేతాలిచ్చారు. ప్రస్తుతం విజయశాంతి మెదక్ ఎంపీగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దిగితే విజయశాంతి సంగతి ఏమిటనేది ఇప్పుడు చర్చనీయమవుతోది. అయితే అది పెద్ద సమస్య కాదని, కేసీఆర్ ప్రణాళికలు పకడ్బందీగా ఉంటాయని, ఎవరికీ ఇబ్బందులు లేకుండానే చూసుకుంటారని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మెదక్ ఎంపీగా కేసీఆర్ పోటీచేయనున్న క్రమంలో జిల్లా రాజకీయ సమీకరణల్లో పలు మార్పులు చోటుచేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.