మూర్ఖపు కాంగ్రెస్-అఖిలపక్షం పేరుతో టూ మచ్

shinde1– ఇద్దరు ప్రతినిధులు వస్తే ఏం తేలుతుంది?
– చర్చల ప్రక్రియ మళ్లీ ప్రారంభమేమిటి?
– ఇది తెలంగాణను సాగదీసే యత్నమే
– కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు
– సమస్యకు పరిష్కారం వారికి ఇష్టం లేదు
– ప్రకటన తీరుపై తెలంగాణవాదుల ఆగ్రహం
దోషి ఎవరో తేలిపోయింది! తెలంగాణకు అసలు అడ్డు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వమేనని మరోసారి అర్థమైపోయింది! తెలంగాణ సమస్యను సాగదీసేందుకు కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ అధినాయకత్వమేనని స్పష్టమైంది. అఖిలపక్షంపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చపై అధికారిక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. జరుగబోయేది అఖిలపక్షం కాదని తేల్చింది. ఏళ్ల తరబడి సాగుతున్న చర్చలకు కొనసాగింపుగా అని కాకుండా.. ‘తిరిగి చర్చల ప్రక్రియ చేపట్టడం’ అని పేర్కొనడం ద్వారా కేంద్రం బుద్ధి బయటపడిందని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రకటనతో అఖిలపక్ష సమావేశం విఫలానికి ఆదిలోనే కుట్ర జరిగిందన్న అభివూపాయాలు వెలువడుతున్నాయి. నిజానికి అఖిలపక్ష సమావేశానికి ఒక పార్టీ నుంచి ఒక ప్రతినిధినే ఆహ్వానించాలని తెలంగాణ అనుకూల పార్టీలతో పాటు.. తెలంగాణ వ్యతిరేక పార్టీల నేతల నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. గతంలో రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలు విఫలం కావడానికి రెండు ప్రాంతాల నుంచి ఇద్దరేసి ప్రతినిధులు వెళ్లి.. ఎవరి అభివూపాయం వారు చెప్పడమే ప్రధాన కారణం. ఈసారైనా ఆ పొరపాటును సరిదిద్ది.. ఒక పార్టీ నుంచి ఒకే అభివూపాయం సేకరిస్తే తెలంగాణ సమస్య తేలిపోయి ఉండేది.

కానీ.. ఈ అంశాన్ని నాన్చడానికే సిద్ధపడిన కాంగ్రెస్.. దానికి అనుగుణంగానే పావులు కదుపుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే సులభమైన మార్గాన్ని వదిలేసి.. మళ్లీ తెలంగాణ అంశాన్ని సంక్లిష్టం చేసేలా లేఖ తీరుతెన్నులు ఉన్నాయని ఉద్యమకారులు అంటున్నారు. మళ్లీ పార్టీల నుంచి రెండేసి అభివూపాయాలు సేకరించి.. కేంద్రం ఏం సాధించాలని అనుకుంటున్నదని వారు నిలదీస్తున్నారు. ఒకరిని పంపుతారా? ఇద్దరిని పంపుతారా? అన్నది ఆయా పార్టీల ఇష్టమని ప్రకటించి 48 గంటలు కూడా గడవక ముందే.. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే మాట మారిపోయింది. చెప్పిన దానికి విరుద్ధంగా లేఖ రాయడం వెనుక యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ హస్తం ఉందని విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. చర్చల విధివిధానాలను నామమావూతంగానైనా ప్రస్తావించకపోవడంతో ఇది ఉత్తుత్తి సమావేశమేనని తేలిపోతున్నదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు.

చర్చల ప్రక్రియ మళ్లీ ప్రారంభమా?
ఎంపీల విజ్ఞప్తి మేరకు చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామని లేఖలో పేర్కొడం కూడా వివాదాస్పదమవుతున్నది. ఎవరో కోరితే సమావేశం (అఖిలపక్షం అన్నమాట ప్రకటనలో ఏ కోశానా లేదు) ఏర్పాటు చేశామన్నట్లు తప్పించి.. తమకేమీ ఆసక్తి లేదన్నవిధంగా లేఖ ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ఇటువంటి సర్క్యులర్లు పంపినప్పుడు వాటి కాపీలను ఎవవరికి అందజేశారన్న సమాచారం ఉంటుంది.

ఈ లేఖలో కనీసం ఆ చిన్న విషయాన్ని కూడా విస్మరించడం చూస్తే ఈ సమావేశాన్ని కేంద్రం ఎంత ఆషామాషీగా తీసుకుంటున్నదో అర్థమవుతున్నదన్న వాదన వినిపిస్తున్నది. కేవలం ఇటీవల ఎఫ్‌డీఐల విషయంలో టీకాంక్షిగెస్ ఎంపీల ఓట్లు వేయించుకునేందుకు ఆడిన డ్రామాను… కొనసాగించడమే కాకుండా.. తిరిగి తెలంగాణ అంశాన్ని మళ్లీ మొదటికి తీసుకువచ్చిందని తెలంగాణవాదులు కన్నెర్ర చేస్తున్నారు. నిజానికి షిండే రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనతో తెలంగాణపై దోబూచులాడుతున్న పార్టీలు సంకటంలో పడ్డాయి.

ఒక ప్రతినిధిని పంపిస్తే ఒక తంటా.. ఇద్దరు ప్రతినిధులను పంపిస్తే మరో తంటా అన్నట్లు పరిస్థితి తయారైంది. ఒకవైపు తెలంగాణపై మోసపూరిత వైఖరిని అనుసరిస్తూ రెండు ప్రాంతాల్లో రెండు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు అఖిలపక్షంలో ఒకే ప్రతినిధిని పంపించి.. ఒకే అభివూపాయం చెప్పాలని డిమాండ్ చేసిన టీజేఏసీ.. ఇతర తెలంగాణ ఉద్యమకారులు.. ఆ మూడు పార్టీలు ఈ నెల 26 నాటికే తమ అభివూపాయం ప్రకటించాలని తాజా డెడ్‌లైన్ విధించాయి.

ఈ నేపథ్యంలో నాన్చుడు ధోరణికి అలవాటు పడిన కేంద్ర ప్రభుత్వం ఈ మూడు పార్టీల నెత్తిన పాలు పోసిందన్న అభివూపాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర హోం శాఖ సూచన మేరకే తాము ఇద్దరు ప్రతినిధులను (తెలంగాణ ప్రాంతం నుంచి ఒకరిని.. సీమాంధ్ర ప్రాంతం నుంచి మరొకరని) పంపామని నెపం నెట్టేసే అవకాశాలు ఆ పార్టీలకు కలిగాయని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై తెలంగాణ ఉద్యమక్షిశేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. తెలంగాణ అంశాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని స్పష్టం చేస్తున్నారు.

గత తప్పిదమే మళ్లీ మళ్లీ
గతంలో జరిగిన రెండు అఖిలపక్ష సమావేశాలకు ఒకే పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున పిలవడంతో తెలంగాణ ప్రతినిధులు అనుకూలంగా.. సీమాంధ్ర ప్రతినిధులు వ్యతిరేకంగా అభివూపాయం చెప్పారు. దీంతో రెండు అఖిలపక్షాలు ఒక నిర్ణయానికి రావడంలో విఫలమయ్యాయి. దీని నుంచి గుణపాఠం తీసుకోవడానికి కూడా కేంద్రం సిద్ధంగా లేదని తేలిపోయిందని విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. కేంద్రానికే ఈ సమస్యను పరిష్కరించాలని ఉంటే మరోసారి అదే పొరపాటు జరిగి ఉండేది కాదని వారు అంటున్నారు.

ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నదన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ తెలంగాణ ఏర్పాటు చేయాలని స్పష్టంగా డిమాండ్ చేస్తుండగా.. సీపీఎం, ఎంఐఎం రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయి. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌తో కూడిన రాయల్‌తెలంగాణ ఏర్పాటు చేయాలని ఎంఐఎం డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ మాత్రం ఇంత వరకూ తమ అభివూపాయం చెప్పనేలేదు. దీంతో తొలుత ఈ మూడు పార్టీలు తెలంగాణపై తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉధృత స్థాయిలో ఉంది. అయితే.. దీన్ని పట్టించుకోని ఆ మూడు పార్టీల నేతలు తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ఒకరు.. ఇస్తే కాదనేది లేదని మరొకరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు తప్పించి.. తెలంగాణ ఇవ్వాల్సిందేనన్న స్పష్టమైన వైఖరిని ప్రకటించడకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని ఉద్యమకారులు విమర్శిస్తున్నారు.

అస్తిత్వ సమస్య
అఖిలపక్షంలోనైనా ఒకే అభివూపాయం చెప్పాలని డిమాండ్ చేస్తున్న టీజేఏసీ తాను విధించిన డిసెంబర్ 26 గడువు నాటికి పార్టీలు వైఖరి చెప్పకపోతే మరుసటి రోజు నుంచి ఉధృత కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈ ఆందోళనలు సమ్మె రూపాలో కూడా ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఈ మూడు పార్టీలు వైఖరి చెప్పని పక్షంలో ప్రజల నుంచి నేరుగా తిరుగుబాటును ఎదుర్కొనక తప్పదని కోదండరాం ఇప్పటికే స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అఖిలపక్షం జరిగే ముందు రోజున బంద్‌కు పిలుపునిస్తామని చెబుతున్నారు. ఇదేతీరుగా మాట్లాడిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు.. అఖిలపక్ష సమావేశం ఆ మూడు పార్టీలకు అగ్నిపరీక్షగా ఉంటుందని అన్నారు.

అఖిలపక్షంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించని పక్షంలో ఆ మూడు పార్టీలకు తెలంగాణలో సమాధి కడుతామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలకు ఇది అస్తిత్వ సమస్యగా పరిణమిస్తున్నది. ఇప్పటికే ఈ మూడు పార్టీలు తెలంగాణ ప్రాంతంలో తమ ఉనికి కాపాడుకోవడానికి, ఉనికి చాటుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇస్తే వ్యతిరేకం కాదన్న వాదన అఖిలపక్షంలో చెల్లదని, ఏదో ఒకటి తేల్చి చెప్పాల్సి వస్తుందనే భావన ఉంది. అలాగైతేనే ఈ మూడు పార్టీలు తెలంగాణలో బతికి బట్టకడతాయని గత అనుభవాలు తేల్చి చెబుతున్నాయి.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఈ మేరకు రెండోసారి ఇచ్చిన లేఖలోనే స్పష్టం చేశామని చెబుతున్నా ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇవ్వాల్సిందేనన్న స్పష్టమైన వైఖరిని మాత్రం వెల్లడించకపోవటంపై తెలంగాణవాదులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అఖిలపక్షంలో వైఖరి చెబుతామన్న టీడీపీకి సందర్భం కూడా వచ్చింది కనుక ఇక దోబూచులాటకు తెరదించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు. వైఎస్సార్సీపీ సైతం తనఅస్పష్టతను వదిలిపెట్టి.. సూటిగా తెలంగాణ కోసం నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో ఇక ఆ పార్టీ నేతలు తెలంగాణలో జరిపే పాదయావూతలకు భరతవాక్యం పలుకుతామని హెచ్చరిస్తున్నారు. ఇది శాంతి భద్రతల సమస్యగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు.

అందరి దృష్టీ ఆ మూడు పార్టీలపైనే
మొత్తంగా అఖిలపక్షానికి పంపే ప్రతినిధుల విషయంలో తెలంగాణ వ్యతిరేక పార్టీలు తర్జనభర్జనలు పడుతున్నాయి. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని టీడీపీ, లోక్‌సత్తా, వైఎస్సార్సీపీ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలు ఏం వైఖరి చెబుతాయన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వాటి నిర్ణయంపైనే ఆ రాజకీయ పార్టీల భవితవ్యం తెలంగాణలో ఎలా ఉంటుదన్నది తేలిపోనుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఈ మూడు పార్టీలకు డిసెంబర్ 26, 28 తేదీల్లో రెండు అగ్నిపరీక్షలు ఎదురుకానున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.

రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో ఏదో ఒక అభివూపాయాన్ని డిసెంబర్ 26లోపు చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణపై 28న నిర్వహిస్తున్న సమావేశానికి హాజరయ్యే పార్టీలన్నీ ఒకే అభివూపాయం చెప్పకుండా దాటవేసే ధోరణి అవలంభించినా, ఏదీ చెప్పకుండా నాన్చినా తాము తీవ్రంగా పరిగణిస్తామని ఇప్పటికే టీజేఏసీ స్పష్టమైన హెచ్చరికలు చేసింది. ‘తెలంగాణకు వ్యతిరేకం కాదు’.. ‘తెలంగాణ ఇస్తే అడ్డు చెప్పబోము’ అంటూ అస్పష్ట వైఖరిని అవలంబించే పార్టీలకు ఈనెల 28వ తేదీ తరువాత ఇక్కడ చోటు ఉండదన్న అభివూపాయం వ్యక్తమవుతోంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.