మూడు నెలల్లో తెలంగాణ అవతరణ

ఫిబ్రవరి 21 :తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అంతిమ ఘట్టానికి చేరుకుంది. పార్లమెంటు ఉభయసభల ఆమోదంతో మరుసటి రోజు శుక్రవారం నుంచి రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దశాబ్దాల పోరాటం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ తేదీ.. నాలుగైదు రోజుల్లో ఖరారు కానుంది. టీ బిల్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు ఈ నెల 24న వెళ్లనుంది. ఆయన సంతకంతో గెజిట్ విడుదల కానుంది. అందులోనే 29వ రాష్ట్ర అప్పాయింటెడ్ డేట్ (ఆవిర్భావ తేదీ) ఉంటుంది. అంటే.. ఆ రోజు నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విడిగా తమ పరిపాలనను మొదలుపెడతాయన్నమాట. రాష్ట్రపతి సంతకంతో గెజిట్ ప్రక్రియ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వెల్లడించారు.
ministerగతంలో మూడు రాష్ర్టాలు ఏర్పాటు చేసినప్పుడు అవి ఉనికిలోకి రావడానికి మూడు నెలలు పట్టిందని, తెలంగాణ ఏర్పాటుకు కూడా అంతే సమయం పడుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రపతి సంతకం లాంఛనమే కావడంతో దానికి ముందే వివిధ అంశాలపై ఇతరత్రా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత ఉద్యోగుల పంపిణీ అంశాన్ని కేంద్రం చేపట్టింది. ఈ విషయంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ రెండు కమిటీలను నియమించింది. ఈ కమిటీలు సివిల్ సర్వీసెస్, ప్రభుత్వ ఉద్యోగులను రెండు తెలుగు రాష్ర్టాల మధ్య పంపకం చేసే ప్రక్రియను నిర్వహించనున్నాయి. సిబ్బంది, శిక్షణ శాఖలో రెండు కమిటీలను ఏర్పాటు చేశాం. ఒక కమిటీ ఆలిండియా సర్వీసెస్ అధికారుల పంపిణీ వ్యవహారాన్ని చూస్తుంది. మరొకటి రాష్ట్ర స్థాయి ఉద్యోగులను పంపకం చేస్తుంది అని జైరాం రమేశ్ చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు.. ఆస్తులు, అప్పుల పంపకాలు, ఇతర ఏర్పాట్లు పూర్తి చేసే విధంగా ఆవిర్భావ తేదీ ఖరారు చేస్తామని జైరాం చెప్పారు. ఈ పని ఇప్పటికే మొదలైందని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్,ఉత్తరాఖండ్‌ల ఏర్పాటు లాంఛనంగా అమల్లోకి రావటానికి నోటిఫికేషన్ తేదీ నుంచి అప్పాయింటెడ్ తేదీకి మూడు నెలలు పట్టిందని ఆయన గుర్తు చేశారు. అప్పాయింటెడ్ తేదీ నాటికి ఉభయ రాష్ర్టాలు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు డీజీపీలు సహా ఇతరులను ఇద్దరేసి చొప్పున కలిగి ఉంటాయని చెప్పారు. ఆవిర్భావ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సీమాంధ్రకు రాజధానిని ఆరు నెలల్లో నిర్ణయిస్తామని తెలిపారు. ముందుగా 45 రోజుల్లో కొత్త రాజధాని ఎక్కడో చెబుతామన్నా.. దానిని సవరించి.. ఆరు నెలలుగా మార్చినట్లు చెప్పారు. ఇందుకోసం త్వరలో ఒక నిపుణుల కమిటీని నియమిస్తామని చెప్పారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చుతూ త్వరలోనే ఆర్డినెన్స్ విడుదలవుతుందని తెలిపారు. అయితే బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయని చెప్పారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీపై ప్రణాళికా సంఘం త్వరలోనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తుందని, ఈ మేరకు త్వరలోనే ఆర్డినెన్స్ విడుదలవుతుందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014 రాజ్యాంగబద్ధమైనది కాదన్న వాదనను జైరాం కొట్టిపారేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనది. రాజ్యాంగంలోని 3, 4 అధికరణలు ప్రత్యేకించి గవర్నర్‌కు శాంతి భద్రతలు అప్పగించడం, ఉమ్మడి రాజధాని వంటి అంశాల్లో నిర్ణయానికి పార్లమెంటుకు, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇస్తున్నాయి అని గుర్తు చేశారు. మేం ఆర్టికల్ 3, 4ను అనుసరించాం. అంతేకాకుండా.. 1959, 1979, 2002, 2006లో నాలుగు సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. రాష్ర్టాల పునర్వవస్థీకరణలో ఈ నాలుగు తీర్పులూ 3, 4 అధికరణలను పూర్తిగా సమర్థించాయి అని ఆయన చెప్పారు. గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగయుతంగా నడుచుకున్నదని జైరాం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం సలహా మేరకు గవర్నర్ నడుచుకుంటారు. ఆయనకు అంతర్గత భద్రత, శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక అధికారాలు ఇవ్వటం జరిగింది అని తెలిపారు.

ఈ బిల్లు కేవలం తెలంగాణనే పట్టించకున్నదని, సీమాంధ్రను విస్మరించిందని కొందరు చేస్తున్న ఆరోపణలను జైరాం కొట్టిపారేశారు. మేం మధ్యేమార్గం అనుసరించాం. సీమాంధ్ర ప్రయోజనాలను పూర్తిగా కాపాడుతూనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. తెలంగాణవారు కూడా దీనిపై పూర్తి సంతృప్తితో లేరన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నిర్ణయం మేం ఆదరాబాదరాగా తీసుకున్నది కాదు. ఏకపక్షంగా లేదా ఒకరిద్దరు వ్యక్తులు తీసుకున్నది కూడా కాదు. 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా మేం ఈ నిర్ణయానికి రాలేదు. దీనికి సుదీర్ఘ ప్రక్రియ పట్టింది. చాలా సమయం తీసుకుంది. అన్ని సెక్షన్ల ప్రజలతో తగినంత సంప్రదింపులు జరిపాం అని జైరాంరమేశ్ స్పష్టం చేశారు.రెండు ప్రాంతాల నేతలు కలహాలు మాని.. పరస్పరం సహకరించుకోవాలని ఆయన కోరారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ వర్తిస్తుందని చెప్పారు. ఈమేరకు ప్రధాని ఆరు సూత్రాల ప్యాకేజీతోపాటు.. షిండే ప్రకటించిన మూడు సూత్రాల ప్యాకేజీలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోనూ విభజన హడావుడి
కేంద్రస్థాయిలో విభజన ప్రక్రియతోపాటే రాష్ట్రంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు మొదలయ్యాయి. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుత సచివాలయం కొంత భాగం కేటాయించాలని నిర్ణయించిన అధికారులు.. ప్రస్తుతం ఉన్న 8 బ్లాకులను చెరిసగం పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు నగరంలో ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు అనువైన భవనాల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కసరత్తు సాగుతున్నది. జీఏడీ అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అవిభాజ్య రాష్ట్రంలో కొనసాగిన సచివాలయాన్ని బ్లాకుల వారీగా విభజించి రెండు రాష్ర్టాలకు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన వ్యవహారాన్ని అధికారులు సీరియస్‌గా పరిశీలన చేస్తున్నారని తెలిసింది. కాగా జాతీయ సర్వీసులు, గ్రూప్-1, స్టేట్ క్యాడర్ ఉద్యోగుల పంపిణీపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న సమాచారానికి తోడు మరింత సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.