మూడు నెలల్లో ఐటీఐఆర్ డీపీఆర్-కేటీఆర్‌

 ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టుపై మూడు నెల్లలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (డీపీఆర్)ను రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన కసరత్తులు చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నంలోనూ ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో విశాఖ కంటే ముందే వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అందుకోసం హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పటికే ఉన్న అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడం ద్వారా త్వరగా పూర్తి చేయాలనుకుంటోంది. బాధ్యతలు స్వీకరించిన రెండు వారాల్లోనే సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌లు మూడు పర్యాయాలు ఐటీఐఆర్‌పై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 

tarak

ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై నెలరోజుల్లో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందని ఐటీ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ టీ మీడియాకు మంగళవారం చెప్పారు. ఐటీఐఆర్‌పై యుద్ధప్రాతిపదికన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక(డీపీఆర్)ను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గరిష్ఠంగా మూడు నెలల్లోనే డీపీఆర్‌ను తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భూ సేకరణ ప్రక్రియకు ఇంకా సమయం రాలేదని, ఏ ప్రాంతాలను ప్రాజెక్టు కేంద్రాలుగా చేయాలన్న అంశంపై చర్చలు సాగుతున్నాయని చెప్పారు. మరోవైపు ఐటీఐఆర్ ప్రాంతంలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయానికొచ్చారు. రీజియన్‌లోనే స్కూళ్లు, కళాశాలలు, ఆసుపత్రుల వంటి సదుపాయాలను కూడా కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు ఐటీ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. మంచినీరు, విద్యుత్తు, మురుగునీటి పారుదల, రహదారుల వ్యవస్థలను ఆధునాతనంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు చెప్పారు.

త్వరలోనే అందుబాటులోకి 4 జీ సేవలు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేబుల్స్ వేయడం, టవర్ల నిర్మాణం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. పురపాలక, మున్సిపాలిటీల్లో ఇప్పటికే 70 శాతానికి పైగా పనులు పూర్తయినట్లు ఐటీ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం 50 శాతం పూర్తయినట్లు చెప్పారు. ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన రహదారుల కారణంగా హైదరాబాద్‌లో కేబుళ్లు వేయడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.