ముందురోజే సభలోకి 15 క్యాన్‌లు? పెప్పర్ ఎంపీలు ఎంతమంది?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 : ఆత్మరక్షణ కోసం ఉపయోగించానని ఎంపీ లగడపాటి చెబుతున్న పెప్పర్ స్ప్రే విశాలమైన లోక్‌సభ హాలు మొత్తాన్నీ ఎలా ఉక్కిరిబిక్కిరి చేయగలిగింది? విలేకరుల గ్యాలరీకి సైతం ఆ ఘాటు ఎలా తగిలింది? చివరి బెంచీల్లో కూర్చున్న ఎంపీలు కూడా ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకుని బయటకు పరుగులు తీయాల్సినంత ప్రమాదకర స్థాయిలో పెప్పర్ స్ప్రే గాఢత ఎందుకు వ్యాపించగలిగింది? అసలు ఆ రోజు సభలో ఒక్క పెప్పర్ స్ప్రే క్యాన్‌నే వాడారా? లేక కనీసం 8 క్యాన్‌ల నుంచి రహస్యంగా వెదజల్లారా? దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే తలవంపు లు తెచ్చిన ఈ దుశ్చర్య వెనుక ఉన్నది ఒక్క లగడపాటి రాజగోపాలేనా? ఇంకా నలుగురైదుగురు ఎంపీలు కూడా ఉన్నారా? వీరు తమ వెంట పెప్పర్ స్ప్రే క్యాన్‌లను అదేరోజు తీసుకెళ్లారా? లేక ముందురోజే వాటిని సభ లోకి స్మగుల్ చేసి తెప్పించి, సిద్ధంగా పెట్టుకున్నారా? సభలో అల్లకల్లోలం చెలరేగిన వెంటనే.. లోక్‌సభలో వెదజల్లింది విషవాయువన్న ఎస్‌ఎంఎస్‌లు రావడం వెనుక నిర్దిష్ట ఉద్దేశాలేమైనా ఉన్నాయా? ఇవీ ప్రస్తుతం తెలంగాణ ఎంపీలు తమ అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్న అనుమానాలు! తెలంగాణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునే ఉద్దేశంతో ఉన్న లగడపాటి, మరికొందరు సీమాంధ్ర ఎంపీలు.. లోక్‌సభలో చేసిన గొడవ తెలిసిందే.

pepperspraలగడపాటి వాడిన పెప్పర్ స్ప్రే ఒక్కటే మొత్తం లోక్‌సభ హాలును ప్రభావితం చేసే అవకాశం లేదని కొందరు టీ ఎంపీలు విస్పష్టంగా తేల్చి చెబుతున్నారు. లోక్‌సభ హాలు చాలా విశాలమైనది. పైన సీలింగ్ కూడా చాలా ఎత్తులో ఉంటుంది. ఇటువంటి హాలులో ఒక చిన్నపాటి పెప్పర్‌స్ప్రే డబ్బాతో ఇంత కల్లోలం సృష్టించడం అసాధ్యమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లగడపాటి చేసింది ఆత్మరక్షణ కోసం కాదని, పెప్పర్ స్ప్రే వెదజల్లి సభలో భీతావహ పరిస్థితులు నెలకొల్పితే బిల్లు ప్రవేశం ఆగిపోతుందనే ఉద్దేశంతోనే ఆయన ఈ దుస్సాహసానికి పూనుకుని ఉంటారని టీ ఎంపీ ఒకరు అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు సైనెడ్ మింగుతామని, సభలోనే ఆత్మాహుతి చేసుకుంటామని, సభలో చిత్రవిచిత్ర పరిస్థితులు ఏర్పడతాయని ముందుగానే హెచ్చరికాపూర్వక బెదిరింపులకు దిగడాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ కుట్రను వారు దిగ్విజయంగా అమలు చేశారని టీ ఎంపీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సభ వాయిదాపడిన తర్వాత మళ్లీ సమావేశమయ్యే సమయంలో సభ్యులు చాయ్ తాగడానికో లేక, తోటి సభ్యులతో పిచ్చాపాటి మాట్లాడుకునేందుకో బయటకు వస్తారు.

తిరిగి సమావేశమైన తర్వాత స్పీకర్ వచ్చి కూర్చున్నాక కూడా వారు లోనికి వస్తూనే ఉంటారు. ఘటన జరిగిన రోజు టీ బిల్లు ప్రవేశపెట్టే సమయానికి కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ బిల్లుకు పూర్తి రక్షణగా నిలవాలని నిర్ణయించుకుని, హోం మంత్రి షిండే స్థానం వద్ద, స్పీకర్ పోడియం వద్ద కవచంలా ఏర్పడ్డారు. స్పీకర్ సభా కార్యక్రమాలు ప్రారంభించగానే.. ఇతర పార్టీల వారు తమ తమ డిమాండ్లతో అక్కడికి చేరుకోవడంతో వీరితోపాటు దాదాపు 50 మంది వరకూ వెల్‌లో ఉన్నారు. షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంపీలందరినీ పక్కకు నెట్టేస్తూ స్పీకర్ పోడియం వరకూ దూసుకెళ్లి.. నానా బీభత్సం సృష్టించారు. అద్దం పగలగొట్టి.. స్పీకర్ వేదికపై ఉన్న మైకును ఊడబీకారు. ఆయనను అడ్డుకునే క్రమంలో ఘర్షణ తలెత్తింది.

ఇదే సమయంలో అటు దూసుకువచ్చిన లగడపాటి.. తన చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రేను ఎంపీల ముఖాలపై నేరుగా వెదజల్లడమే కాకుండా.. అటు నుంచి ఇటు స్ప్రే చేస్తూ కలియదిరిగారు. అయితే.. ఈ ఒక్క క్యాన్ ద్వారా వెదజల్లిన మిరియాలపొడికే సభయావత్తూ ఘాటెక్కిపోవడంపై ఇప్పుడు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెల్ వద్ద జరుగుతున్న ఘాతుకాన్ని ఇతర ఎంపీలంతా నివ్వెరపోయి చూస్తుండగా, ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకొని నలుగురు ఎంపీలు అప్పటికే తమ వద్ద దాచిపెట్టుకున్న పెప్పర్ స్ప్రే క్యాన్‌లను బయటకు తీసి.. రెండు చేతుల్లో రెండేసి క్యాన్‌ల ద్వారా బయటికి కన్పించకుండా కుడి ఎడమలు స్ప్రే చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సభలోకి ప్రవేశించే పార్లమెంటు సభ్యులను సోదాలు చేసే సంప్రదాయం లేదు.

దీనిని సావకాశంగా చేసుకుని వారు ఈ క్యాన్‌లను సభలోకి తెచ్చి ఉంటారని భావిస్తున్నారు. అయితే.. నాలుగైదు డబ్బాలనే ఉపయోగించినా.. 15 వరకూ పెప్పర్ స్ప్రే క్యాన్‌లు సభలోకి ప్రవేశించి ఉండొచ్చన్న అనుమానాలను టీ ఎంపీలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసం కాకుండా.. సభను భయాందోళనకు గురిచేసి.. తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకునే వ్యూహాలతోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై లోతుగా విచారణ జరిపితే వాస్తవాలేంటో బయటపడతాయని టీ ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. లోక్‌సభలో ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు స్పీకర్ మీరాకుమార్ సోమవారం పార్లమెంటు భద్రతా కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. డిప్యూటీ స్పీకర్ కరియా ముండా నేతృత్వంలోని ఈ కమిటీ గురువారంనాటి ఘాతుక ఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సూచించనుంది

This entry was posted in ARTICLES.

Comments are closed.