మీరేం చేస్తే మేమదే చేస్తాం! – దౌత్యవేత్త అరెస్టుపై భారత్ తీవ్ర ప్రతిస్పందన

న్యూయార్క్ నడివీధిలో భారత దౌత్యవేత్తను అరెస్టు చేయడంపట్ల అమెరికాపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. దేశంలోని అమెరికా రాయబార కార్యాలయంపై పలు ఆంక్షలు విధించింది. ఇందులో పనిచేస్తున్న దౌత్యాధికారులు, వారి కుటుంబసభ్యులు తమ గుర్తింపు కార్డులన్నీ భారతవిదేశాంగశాఖకు అప్పగించాలని ఆదేశించింది. అరెస్టు ఘటనపై భారత్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన అమెరికా ప్రతినిధులను కలిసేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బుధవారం అలహాబాద్‌లో వీరితో భేటీ కావాల్సిన నరేంవూదమోడీనిరాకరించారు.

భారత మహిళా దౌత్యాధికారిపట్ల అమెరికా అనుసరించిన తీరును నిరసిస్తూ.. దేశం మొత్తం ఆమెపట్ల సానుభూతితో ఉందనే విషయాన్ని తెలియజేసేందుకే భేటీ కాకూడదని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఓ పనిమనిషి వీసాకు సంబంధించిన దరఖాస్తులో తప్పుడు వివరాలను పొందుపరిచి భారత డిప్యూటీ కౌన్సెల్ జనరల్ దేవయాని ఖోబ్రగాదే (39) (1999 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారిణి) మోసానికి పాల్పడ్డారని పేర్కొంటూ అమెరికా పోలీసులు నడి వీధిలో ఆమెకు సంకెళ్లు వేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులకు ఇస్తున్న జీతభత్యాల వివరాలు, వారి ఇండ్లలో పనిచేస్తున్న పనిమనుషులకు చెల్లిస్తున్న వివరాలను సమర్పించాలని భారత ప్రభుత్వం కోరింది.

అమెరికా పాఠశాలల్లో పనిచేస్తున్న భారతీయ ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న వేతనాలు, వారి బ్యాంకు ఖాతాల వివరాలు, వీసాల సమచారం అందించాలని పేర్కొంది. ఢిల్లీలోని న్యాయమార్గ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయానికి ముందున్న బారికేడ్లను తొలగించాలని పోలీసులకు ఆదేశించి వాళ్లు ఎలా వ్యవహరిస్తే తాము అలాగే స్పందిస్తామనే స్థాయిలో భారత దౌత్యాధికార వర్గాలు స్పందించాయి. మద్యంతోసహా అమెరికా దౌత్యకార్యాలయం కోసం దిగుమతి చేసుకుంటున్న అన్ని రకాల దిగుమతులను రద్దు చేసింది. ఎంబసీలు, కాన్సులేట్‌లకు జారీచేసిన అన్ని రకాల ఎయిర్‌పోర్టు పాసులను రద్దు చేసింది.

దేవయానికి పూర్తి సహకారం ఉంటుంది: షిండే
ఎలాంటి నేరానికి పాల్పడకుండానే తన కూతురును అమెరికా పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంటూ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ దేవయాని ఖోబ్రగాదే తండ్రి ఉత్తమ్ ఖోబ్రగాదే మంగళవారం కేంద్ర హోంమంత్రి షిండే, విదేశాంగ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌ను కలిశారు. ప్రభుత్వం తరఫున దేవయానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చాను అని షిండే మీడియాకు చెప్పారు.

అమెరికా ఎంబసీలోని హోమోలను అరెస్టు చేయాలి: యశ్వంత్‌సిన్హా
ఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారులతో సహజీవనం చేస్తున్నవారిని (కంపెనీయన్స్‌ను) అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్‌సిన్హా డిమాండ్ చేశారు. భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగాదెను అమెరికా పోలీసులు అకారణంగా అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కం నేరమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపయోగించుకుని భారత్ ఈ చర్యలు తీసుకుని అమెరికాకు తగిన బదులు ఇవ్వాలని సూచించారు. ‘భారత్‌లోని దౌత్యాధికారుల వెంట వచ్చిన కంపెనీయన్స్‌కు మనం వీసాలు ఇచ్చినట్లు మీడియా ద్వారా తెలిసింది. కంపెనీయన్స్ అంటే స్వలింగ సంపర్కులే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భారత్‌లో ఇది చట్ట విరుద్ధం. తక్కువ వేతనాలు ఇవ్వడమే అమెరికాలో చట్ట విరుద్ధమైనప్పుడు భారత్‌లోని వారి దౌత్యాధికారుల కంపెనీయన్స్‌ను ఎందుకు అరెస్టు చేయకూడదు? వారిని వెంటనే అరెస్టు చేసి జైలులో వేయాలి’ అని సిన్హా మీడియాతో అన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.