మీరు బంతులు విసిరితే మేం బాంబులు విసురుతాం: కవిత

హైదరాబాద్: తెలంగాణ విషయాన్ని పదేపదే క్రికెట్‌తో పోల్చుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సీఎం కిరణ్ ఈసారి గనుక బ్యాట్ పడితే తెలంగాణ మహిళలు బంతులకు బదులు బాంబులు విసురుతారని ఆమె హెచ్చరించారు. ఇవాళ ఆమె ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరుగుతోన్న ‘సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష’ సభలో మాట్లాడారు. సీఎం తానా అంటే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తందానా అంటున్నాడని విమర్శించారు. సంపూర్ణ తెలంగాణ సాధన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అయ్యేదిలేదని కవిత తేల్చి చెప్పారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకోవడానికి మరోసారి కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణకు జైకొట్టిన విషయాన్ని వైసీపీ నేతలు మరిచిపోయినట్టున్నారని అన్నారు. తెలంగాణపై అసలు ముందుగా మాట్లాడిందే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని గుర్తు చేశారు.

జానారెడ్డికి రాజీనామా ఇవ్వడంలో అంతర్యమేంటీ: కవిత
తెలంగాణ కోసమే తాను రాజీనామా చేశానంటున్న మంత్రి శ్రీధర్‌బాబుపై కవిత మండిపడ్డారు. ‘వెయ్యి ఎలుకులు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిన చందంలా శ్రీధర్‌బాబు రాజీనామా వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. శవాలపై రాజీనామా చేసిననాడు శ్రీధర్‌బాబు ఎందుకు రాజీనామా చేయలేదని ఆమె ప్రశ్నించారు. అసలు ఆయన రాజీనామాను గవర్నర్‌కు పంపకుండా జానారెడ్డికి ఇవ్వడంలో అంతర్యమేంటో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. నక్క వాతలు పెట్టుకుంటే పులికాదని, శ్రీధర్‌బాబు పదవికి రాజీనామా చేసినంత మాత్రాన ఉద్యమకారుడు కాలేడని వివరించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ కూడా జరిపించలేనపుడు తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు ఇప్పటికైనా పౌరుషాన్ని చూపాలని డిమాండ్ చేశారు.

సీమాంధ్ర మీడియా వైఖరి మార్చుకోవాలి: కవిత
సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమంపై ఒకలా, సీమాంధ్ర ఉద్యమంపై మరోలా వ్యవహరిస్తుందని కవిత ఆరోపించారు. ఇప్పటికైనా సీమాంధ్ర మీడియా తన వైఖరిని మార్చుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అశోక్‌బాబు విషయంలో సీమాంధ్ర మీడియా ఎక్కడాలేని అత్యుత్సాహం ప్రదర్శించిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రతినిధులు గెలిస్తే భావోద్వేగం, అదే ఆంధ్రోళ్లు గెలిస్తే ఉద్యమమా? అని నిలదీశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.