మిస్టర్ కిరణ్.. తక్షణమే రాజీనామా చెయ్

‘ముఖ్యమంత్రీ నీ అంతట నీవే, నేను సమైక్యాంవూధవాదినని చెప్పినవ్. ఇక నీకు ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కులేదు. రాజీనామా చేసి, 24 గంటల్లో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీచెయ్. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ధిక్కరించి మాట్లాడుతుంటే, ఆ నిర్ణయం శిలాశాసనం కాదని పేర్కొంటుంటే కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు ఆయన్ని కొనసాగిస్తున్నది. వెంటనే బర్తరఫ్ చేయాలి. తెలంగాణ మంత్రుల్లారా ఇప్పటికైనా తేల్చుకోండి. మీరు ఇంకా ఈ 13 జిల్లాల సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తారో..? లేదా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో..? తేల్చుకోండి’ అంటూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.

రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన ఆయనకు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కులేదని స్పష్టం చేశారు. సీఎం పిచ్చోడిలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. శుక్రవారం ఇక్కడ రాత్రి విలేకరులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, మొలుగూరి భిక్షపతి, డాక్టర్ టీ రాజయ్యతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అవగాహనరాహిత్యంతో, తెలివితక్కువతనంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ నోటికాడి బుక్కను ఎత్తగొ విషం కక్కుతుంటే మీరు ఆయనతో ఎట్లా పనిచేస్తున్నారని ఆయన తెలంగాణ మంత్రుల్ని నిలదీశారు.

ఆంధ్రా కిరణం అని నిరూపించుకున్నాడు: శ్రావణ్
ముఖ్యమంత్రి మరోసారి తాను సీమాంధ్ర కిరణాన్నే అని నిరూపించుకున్నాడని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రావణ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై పూ ర్తిగా విషంకక్కేలా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడాడని, ఆయన్ను గౌరవించిన పార్టీని తూలనాడారని మండిపడ్డారు. తె లంగాణపై ఉన్న కసితో ఆయన్ను సీఎం కుర్చీ లో కూర్చోబెట్టిన వారిని కూడా దుర్భాషలాడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వ్యక్తిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, లేకుంటే ఇరు ప్రాంతాల ప్రజలు తన్నుకునేలా చేస్తాడని అన్నారు. రెండు ప్రాంతాలు విడిపోయిన తరువాత కూడా కలిసుండాలని, అయితే ఆయన తీరు వల్ల పరిస్థితులు విషమించే ప్రమాదం ఉందని అన్నారు.

అన్ని సమాధానాలు ఉన్నాయి: వినోద్
రాష్ట్ర విభజన చేస్తే అనేక సమస్యలు వస్తాయని.. ముఖ్యమంత్రి ప్రస్తావించిన అన్ని అంశాలకు సమాధానాలున్నాయని టీఆర్‌ఎస్ నేత సభ్యుడు అన్నారు. ఊహాజనిత ప్రశ్నలు సృష్టిస్తూ ప్రజల్లో అయోమయం చేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. పార్టీ హైకమాండ్ కిరణ్‌పై వెంటనే చర్య తీసుకోవాలని, లేకుంటే ప్రజల్లో విద్వేషాలు పెచ్చరిల్లే అవకాశం ఉందన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.