‘మా లక్ష్యం, మా గమ్యం తెలంగాణ రాష్ట్ర సాధనే’ -హరీష్‌రావు

harishraovscmకాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి విషయంలోనూ పూర్తిగా విఫలమైందని, ప్రజల విశ్వాసం కోల్పోయిందని, అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతున్నామని టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మల్యే హరీష్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనతర్వాత చర్చ మొదలైంది.  ప్రభుత్వ అసమర్థతను, మోసకారి తనాన్ని బయట పెడుతూ హరీష్ రావు కడిగి పారేశారు.  ‘మా లక్ష్యం, మా గమ్యం తెలంగాణ రాష్ట్ర సాధనే’ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన శాసనసభలో ఆపార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా సభలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా తమ ఆస్తిత్వ పోరాటం కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో వివక్ష కొనసాగుతూనే ఉందని తెలిపారు. ‘తుపానుకు పక్షి భయపడదు.. తన రెక్కలను తాను నమ్ముకుంటుందిగాని చెట్టు కొమ్మలను కాదు’ అని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఉసురు పోసుకుందని, వెయ్యి మంది యువకు ప్రాణాలు బలిగందని దుయ్యబట్టారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఏ ఒక్క హామీని కూడా ఈ కాంగ్రెస్ సర్కారు నెరవేర్చలేదని వివరించారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు 24 గంటల కరెంటు ఇస్తామని 10 గంటలు కూడా ఇవ్వలేదని, రైతులకు 7 గంటల కరెంటు ఇస్తామని 4 గంటలు కూడా ఇవ్వలేదని ప్రభుత్వపై ధ్వజమెత్తారు. పేద ప్రజలకు 6 కిలోల బియ్యం ఇస్తామని 4 కిలోలే ఇస్తోందని, పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి ఈ రాష్ట్రలంలో పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, అందుకే ఈ ప్రభుత్వానికి ఇక ఒక్క రోజుకూడా కొనసాగే అర్హత లేదని హరీష్ అన్నారు. అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని దించివేయాలని ఆయన కోరారు.

ఈ రాష్ట్ర సర్కారును ఎందుకు దించివేయాలో వివరిస్తూ అసెంబ్లీలో హరీష్ మాట్లాడారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఎంత చరిత్ర ఉందో కాంగ్రెస్ మోసానికి అంతే చరిత్ర ఉందని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ దగా, మోసం ఒక ఎత్తైతే… హామీలు, ఉల్లంఘలనలు మరో ఎత్తన్నారు. దాదాపు రెండు గంటలకు పైగా సభలో హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ నేతలపై విరుచుకు పడ్డారు. తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు.

ద్రోహంకన్నా ముందే కాంగ్రెస్ పుట్టింది: హరీష్‌రావు
కాంగ్రెస్ పార్టీది ద్రోహాల చరిత్ర అని హరీష్‌రావు విమర్శించారు. ద్రోహంకన్నా ముందే కాంగ్రెస్ పుట్టిందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఎంత చరిత్ర ఉందో కాంగ్రెస్ పార్టీకి అంత మోసాల చరిత్ర ఉందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తోన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. తరతరాలుగా కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరుగదు:
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదని హరీష్‌రావు అన్నారు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందికాబట్టే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తున్నారని ఆయన వివరించారు. 1956లో ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణ విలీనాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి, తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్ కోసం తాము పోరాడుతున్నామని వివరించారు. ఆంధ్రా వలసవాద దోపిడికి వ్యతిరేకంగా ఇప్పటికీ పోరాటం కొనసాగుతుందని ధ్వజమెత్తారు.

జీవోలను తుంగలో తొక్కారు: ఆంధ్రా ప్రాంతంలో తెలంగాణ విలీనమైన నాటి నుంచే ఆంధ్రా ఆధిపత్యం కొనసాగుతూనే ఉందని హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ ప్రజల జీవితాలతో సీమాంధ్ర సర్కార్ చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు. జీవో 36, జీవో 610 జీవోలను సీమాంధ్రులు తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రుల ఆధిపత్యంతో తెలంగాణ ప్రజల దుర్బరమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌పార్టీ తెలంగాణకు ఢోకా చేస్తూనే ఉంది: ఆది నుంచి తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌పార్టీ మోసాలకు పాల్పడుతూనే ఉందని హరీష్‌రావు అన్నారు. 1969లో కూడా మోసం చేసిందన్నారు. డిసెంబర్ 9న పార్లమెంట్‌లో తెలంగాణ ఇస్తామని కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనను డిసెంబర్ 23న యూటర్న్ తీసుకుని మరోసారి తెలంగాణ ప్రజలను వంఛించిందని ఆవేదనతో అన్నారు. శ్రీకృష్ణ కమిటీ పేరుతో అధ్యయనం చేయించిందని, అయితే ఆకమిటీ ఎంత బోగసో దాని రీతేంటో, నీతేంటో సుప్రీంకోర్టు తేల్చిందని గుర్తు చేశారు.

స్వాతంత్ర ఉద్యమంలా ‘సకల జనుల సమ్మె’
తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యోగులు ఎంత పోరాటం చేశారో హరీష్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం స్వాతంత్ర సమరాన్ని తలపించేలా ‘సకల జనుల సమ్మె’ చేశారని అన్నారు. సమ్మె కాలంలో సీఎంకు కూడా జీతం రాని పరిస్థితి ఏర్పడిందంటే ఉద్యమం ఎంత తీవ్రంగా జరిగిందో తెలుసుకోవాలన్నారు.

‘తెలంగాణ దయాదాక్షిణ్యాలతోనే కాంగ్రెస్‌కు జీవం’
హరీష్‌రావుకు మంత్రి పదవి కాంగ్రెస్‌పార్టీ పెట్టిన భిక్ష అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజల దయాదాక్షిణ్యాలతోనే కాంగ్రెస్ పునరుజ్జీవనం పోసుకుందని అన్నారు. తనకు భిక్షపెట్టిందనడం సబబుకాదని హితవుపలికారు. తెలంగాణ ఉద్యమం వల్లే తెలంగాణలోని కొందరి నేతలకైనా పదవులు దక్కాయని, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డికి కూడా ఆ పదవి దక్కడం అందులో భాగమేనని తెలిపారు.

తెలంగాణ అమరవీరులకు అవమానం : సీమాంధ్ర సర్కారు పాలనలో తెలంగాణ ప్రాంతానికి, పౌరులకు అన్యాయం జరుగుతోందని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. వెయ్యిమంది తెలంగాణ యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడితే ప్రభుత్వం కనీసం సంతాపం తెలిపిన పాపానపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర పౌరులు కాదా అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రశ్నించేందుకే డిప్యూటీ సీఎం పదవి తెలంగాణకు ఇచ్చారని అన్నారు. తెలంగాణ వాళ్లవి డిప్యూటీ బతుకులే అని ఆగ్రహంతో అన్నారు. ఢిల్లీలో కూడా తెలంగాణ ప్రాంత వ్యక్తి, దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి పీవీ నరసింహరావుకు కూడా అవమానమే జరిగిందన్నారు. ఢిల్లీలో ప్రతీ మాజీ ప్రధాని పేరుతో ఘాటులున్నాయని, పీవీ ఘాటు ఉందా అని ప్రశ్నించారు. కనీసం ఆయనకు గుంట జాగలో ఏదైనా స్మారకం ఏర్పాటు చేశారా అని నిలదీశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.