మా భూమికి సెజ్‌ల తెర

పెద్ద ఎత్తున అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కలుగుతాయంటూ 2005లో రాష్ట్ర ప్రభుత్వం 53 సెజ్‌లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఒక చట్టం కూడా చేసింది. కానీ.. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో సెజ్‌లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిందో ఆ లక్ష్యం నెరవేరలేదు.
పైగా సెజ్‌లకు కేటాయించిన భూములు పక్కదారి పట్టాయి. అభివృద్ధి అనే ముసుగులో తెలంగాణపై సీమాంధ్ర బడాబాబులు, పెట్టుబడిదారీ రాజకీయ నాయకులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లని చెబుతూ అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా చూస్తే.. అవి ప్రత్యేక ఆర్థిక మండళ్లుకాదని.. సీమాంధ్ర నేతల నాయకత్వంలోని దోపిడీ మండళ్లని తేటతెల్లమైపోయింది! కానీ.. అప్పటికే వేల ఎకరాల భూమిని తెలంగాణ సెజ్‌ల పేరుతో కోల్పోయింది.

ఆర్థిక మండళ్ల పేరుతో తీసుకున్న భూములను కొందరు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేశారు. ఇంకొంత మంది ఘనాపాఠీలు అవే భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి.. వందల కోట్లు రుణాలు తీసుకున్నారు. సెజ్‌ల కోసం భూములు తీసుకున్నప్పుడు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికారు. కానీ.. క్షేత్ర స్థాయిలో అలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు. ఈ ఆర్థిక మండళ్ల బాగోతాన్ని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బయటపెట్టింది. 2006 – 2010 మధ్యకాలంలో 88, 492 ఎకరాల భూమిని 1027 మందికి కేటాయించగా 50,285.90 ఎకరాల భూమిని కేవలం 459 మంది బడా వ్యక్తులు, సంస్థలకు కేటాయించడం విశేషం. ఇందులో తెలంగాణ ప్రజలకు నిజాం ఇచ్చిన ఇనామ్ భూములు ఉన్నాయి. దళితులకు ఆత్మగౌరవం కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విలువైన వ్యవసాయ భూములు బలవంతంగా పేదల నుంచి లాక్కున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష కోట్ల విలువైన భూములు బడా బాబుల చేతుల్లోకి ఆయాచితంగా వెళ్లిపోయాయి. పీవీ నరసింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూసంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం భూస్వాముల నుంచి మిగులు భూములను స్వాధీనం చేసుకుంటే తిరిగి ఆ భూములను వ్యవసాయానికే వినియోగించాలి.

ఈ మేరకు పెద్ద ఎత్తున భూములను దళితులకు అసైన్ చేశారు. కానీ.. తదుపరికాలంలో భూ సంస్కరణల చట్టాన్ని అపహాస్యం చేసిన పాలకులు.. అసైన్డ్ భూములను సైతం లాక్కుని బడా సంస్థలకు కట్టబెట్టరు. తర్వాత ఈ విషయంలో చట్టం ఉందని తెలియడంతోనే రాజకీయ ఎత్తుగత వేసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ఏకంగా ఆ చట్టాన్నే మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చట్టం కూడా అడ్డులేకపోవడంతో.. అసైన్డ్ భూములు గుంజుకునే వ్యవహారం ఇష్టానుసారం సాగింది. ఫలితంగా నగర శివారు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో దళితులు తమ భూములు కోల్పోయారు. జీవితాలనో పోగొట్టుకున్నారు. ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థలో పాలేర్లుగా.. వెట్టి కూలీలుగా బతికిన దళితులకు అండగా భూ సంస్కరణల చట్టం నిలిచిందనుకునేలోపే.. ఆ సంతోషాన్ని పాలకులు నిలువునా కూల్చారు! తమ, తమ శ్రేయస్సు కోరినవారి ప్రయోజనాలే ప్రజా ప్రయోజనాలుగా ముద్రవేసి.. అందినకాడికి భూములను దోచుకున్నారు. ఇదే విషయాన్ని కాగ్ కూడా తూర్పారబట్టింది. సాధికార కమిటీ నిర్ణయించిన ధరను కాదని.. ప్రభుత్వం తన ఇష్టానుసారం నామమాత్రపు ధరలనే వసూలు చేయడంద్వారా ప్రభత్వ ఖజానాకు భారీ ఎత్తున నష్టం వాటిల్లడంతోపాటు ఆయా వ్యక్తలకు ఆయాచిత లబ్ది చేకూరింది. ప్రాంతేతరులు తెలంగాణ భూముల్లో పాగా వేశారు. అదే భూములు పెట్టుబడిగా.. కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు.

బ్యాంకులకు కుచ్చుటోపీ..
ఇందూ టెక్ సంస్థ మొదటిదశలో రూ.700 కోట్ల పెట్టబడులతో సెజ్‌ను నిర్మించి తొలి మూడేళ్లలో 20 వేల మందికి, తర్వాత రెండేళ్లలో 25 వేల మందికి ఉద్యోగం కల్పిస్తానని అగ్రిమెంట్ చేసుకుంది. ఈ భూమిని చదును చేయకుండానే యూకో బ్యాంకుకు కుదవబెట్టి రూ.120 కోట్ల రుణాన్ని తీసుకోవడం ఒక ఎత్తయితే.. రుణం తీసుకునేందుకు ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వడం మరో ఎత్తు! ఇదే తీరుగా స్టార్ గేజ్ సంస్థ కూడా ఐదేళ్లలో 45 వేల ఉద్యోగాల ఇస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి 2008లో ఏపీఐఐసీ ద్వారా ఎన్‌వోసీ తీసుకొని ఈ భూములన్నింటినీ గంపగుత్తగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో తాకట్టపెట్టి రూ.100 కోట్ల రుణం తీసుకున్నది.

రూపాయి పెట్టబడి లేకుండానే మైండ్ స్పేస్ పేరుతో రహేజా సంస్థ మైండ్ బ్లాక్ అయ్యే విధంగా వ్యాపారం చేస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉండగా రహేజా సంస్థకు హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే మాదాపూర్ రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ 64లో 110 ఎకరాల భూమిని అప్పనంగా కట్టబెట్టారు. కేవలం కేటాయించిన భూమిలో భవనాలు నిర్మించి ఐటీ కంపెనీలకు అద్దెకిస్తామంటే బాబు ఉదారంగా 110 ఎకరాల భూమిని ఇచ్చారు. వాస్తవంగా ఎవరైనా బిల్డరు ఒక భూమిలో అపార్ట్‌మెంట్ నిర్మిస్తానని ముందుకు వస్తే భవనం నిర్మించిన తర్వాత అందులో భూ యాజమానికి 40 నుంచి 50 శాతం వరకు వాటా ఇస్తారు. కానీ.. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీఐఐసీకి ఉన్న 11శాతం కనీసవాటాను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మైండ్‌స్పేస్ ప్రాజెక్టు మొత్తం రహేజాకు దఖలుపడింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా. కానీ.. రహేజా సంస్థ కడుపులో చల్ల కదలకుండా ఈ భవనాలను అద్దెకు ఇచ్చుకుంటూ నెలకు 30 కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నది.

జార్జియా.. జాదూ:
సాధికారిత కమిటీ కేవలం 50 ఎకరాలు ఇస్తే చాలని చెప్పినా పట్టించుకోకుండా జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ స్వీయ నిర్ణయంతో 250 ఎకరాల విలువైన తెలంగాణ భూమిని కేటాయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని ముచ్చెర్ల గ్రామం సర్వే నంబర్ 288లో 250 ఎకరాలను కేటాయించడంతో సొంత వారికి మేలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థకు ఉన్న పరిమితుల దృష్ట్యా 50 ఎకరాలను రూ.18లక్షలకు ఎకరా చొప్పున కేటాయించాలని సాధికారిత కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తే.. దానిని పెడచెవిన పెట్టిన వైఎస్.. స్వయంగా నిర్ణయం తీసుకొని దీనిని 250 ఎకరాలకు పెంచేశారు. పైగా ధరను కూడా 18 లక్షల నుంచి.. లక్షన్నరకు తగ్గించేశారు. దీంతో ఆ సంస్థకు రూ41.25 కోట్ల ప్రయోజనం కలిగింది. ఇంత జరిగాక తాను కూడా ఏదో ఒక గమ్మత్తు చేయకపోతే బాగోదనుకుందేమో.. సదరు జార్జియా ఇన్‌స్టిట్యూట్ తనకు కేటాయించిన భూములకు నిర్ణయించిన ధరను కూడా చెల్లించకుండా ప్రభుత్వానికి రూ.3.75కు టోపీ పెట్టింది.

ఎకరా 20 లక్షల భూమి.. వారికి లక్షన్నరకే
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని కట్లాపూర్ గ్రామం సర్వే నెంబర్ 294లో రాష్ట్ర ప్రభుత్వం సీమాంధ్రకు చెందిన ఒక మంత్రి కుమారుడికి చెందిన మద్యం తయారీ యూనిట్‌కు 85 ఎకరాల భూమి కేటాయించింది. పెర్ల్ బేవరేజెస్‌కు చెందిన బీర్ తయారీ యూనిట్‌కు కేటాయించిన ఈ స్థలం సదరు కంపెనీకి ముందస్తు పొజిషన్ కట్టబెట్టి సీమాంధ్ర సర్కార్ తన వైఖరిని చాటుకుంది. రంగారెడ్డి జిల్లా కలె క్టర్ ఈ భూమికి ఎకరాకు రూ.20లక్షలుగా నిర్ణయిస్తే ప్రభుత్వం మాత్రం ఎకరాకు లక్షన్నరే వసూలు చేయడం విశేషం. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు రూ.14.01 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.

ఐఎంజీ అక్రమాలు
గచ్చిబౌలిలోని 450 ఎకరాల విలువైన భూమిని 2003లో మెస్సర్స్ ఐఎంజీ భారత అకాడమీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. మార్కెట్ విలువ ఎకరం రెండు కోట్లు ఉంటే.. పాతిక వేల చొప్పున పందేరం చేశారు. దీని వెనక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నిర్ధారించింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. తర్వాతికాలంలో సదరు కంపెనీ దివాళా తీసింది.

తెలంగాణను ఏమార్చిన ఎమ్మార్
ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి వాటిని అమ్మడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చూపుతామన్న ఎమ్మార్ ప్రాపర్టీస్‌ది మరో ఘరానా మోసం. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ 2002లో ఏపీఐఐసీతో ఒప్పందం చేసుకొని 535 ఎకరాలను పొందింది. అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్, గోల్ఫ్ కోర్స్‌లతో టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇందుకు రంగాడ్డి జిల్లా రాజేంవూదనగర్ మండలంలోని మణికొండ గ్రామంలోని 535 ఎకరాలను ప్రభత్వం నుంచి పొందింది. కానీ.. ఆ తర్వాత తనకు వచ్చిన హక్కులను ఎంజీఎఫ్‌కు అమ్ముకుంది. తన వాటా భూములను యాక్సిస్ బ్యాంకులో తనఖాపెట్టి 2008 ఆగస్టులో రూ.150 కోట్ల రుణం పొందింది. ఇందులోని ఇంటిగ్రెటెడ్ టౌన్‌షిప్‌లో నిర్మాణాలను, విల్లాలను అమ్మే పెట్టే పేరుతో స్టయిలిష్ హోమ్స్ అనే సంస్థను నిబంధనలకు విరుద్ధంగా భాగస్వామిని చేసుకుంది. మణికొండలో భూములు కోల్పోయిన రైతులు.. నిలువ నీడ కోల్పోతే.. ఎమ్మార్ మాత్రం కోట్లు పోగేసుకుంది. ఈ వ్యవహారంలో పలువురు ప్రభుత్వ పెద్దలు భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో సీబీఐ విచారణ కూడా జరుగుతోంది.

కోటి రూపాయల ఎకరం భూమి.. లక్షకే ఇచ్చిన వైఎస్

ప్రభుత్వ భూములను ఎంతకారుచౌకగా అమ్మొచ్చో అప్పటి సీఎం వైఎస్ నిరూపించారని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకున్న వైఎస్.. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి, రావిర్యాల గ్రామాలకు చెందిన 881.31 ఎకరాల భూములను తన కుమారుడి బినామీ సంస్థలకు పందేరం చేశారన్న విమర్శలున్నాయి. ఆ భూమి అప్పటి మార్కెట్ ప్రకారం ఎకరం కోటిపైనే విలువ చేస్తుండగా.. దానిని కేవలం లక్ష రూపాయలకే ఇచ్చేయడంతో ప్రభుత్వానికి రూ.874.0 కోట్లు నష్టం వాటిల్లింది. ఒకే సంస్థకు ఇంత భూమి కేటాయిస్తే అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతో కాబోలు.. వివిధ సంస్థల పేర్లపై తలాకొంత అన్నట్లు కేటాయింపులు జరిపారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఇందూటెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 250 ఎకరాలు, బ్రాహ్మణి (స్టార్ గేజ్) ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్‌కు మరో 250 ఎకరాలను ఒక్క ఎకరాకు కేవలం రూ.20 లక్షల నామమాత్రపు ధరకు కట్టబెట్టారు. ఈ రెండు సంస్థల కంటే ముందగా 250 ఎకరాల భూమిని బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్ సంస్థకు కేటాయించింది. ఈ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం భారీగా నష్టోపోయిందని కాగ్ స్పష్టం చేసింది. బ్రహ్మణి ఇన్‌ఫ్రాటెక్ సంస్థ తనకు కేటాయించిన భూమిలో కనీసం చిన్న కార్యాలయం కూడా నిర్మించలేదు. ఐదేళ్లలో పూర్తి స్థాయిలో సెజ్ పూర్తి చేసి 45 వేల వందికి ఉద్యోగాలను కల్పిస్తామని ఈ సంస్థ చెప్పినా.. ఇప్పటికీ ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు.

సర్కారు భూములు సమర్పయామి

-నిధుల సమీకరణ పేరుతో ప్రభుత్వ భూములనే భారీ స్థాయిలో వేలం వేసిన ప్రభుత్వం.. అందులో పెద్ద మొత్తంలో తెలంగాణ భూములకే ఎసరు పెట్టింది. డిసెంబర్ 2008లో 105.13 ఎకరాల భూమి మొత్తాన్ని కేవలం రూ.12కోట్లకే హుడాకు కట్టబెట్టింది. ప్రస్తుతం అక్కడ భూమి విలువ ఎకరం 20 కోట్లపైనే ఉంది. ఇందులో నుంచి 4ఎకరాల స్థలాన్ని 33 ఏళ్ల లీజుకు హాస్పిటాలియా ఈస్టర్న్ ప్రై లిమిటెడ్‌కు ఇవ్వడం విశేషం. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఖజానాకు రూ.315.39 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే అంగీకరించింది.
-2006 మార్చిలో రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో సర్వే నంబర్ 1266/1లో బయోటెక్ పార్క్ విస్తరణకు కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్దంగా ఏపీఐఐసీ ఇందూ జీనోమ్ వ్యాలీ ప్రాజెక్టుకు కట్టబెట్టింది. 20 ఎకరాల ఈ విలువైన భూమిలో సదరు కంపెనీ టౌన్‌షిప్ ప్రాజెక్టు అభివృద్ధి, నివాస గృహాలని నిర్మించి భారీగా లబ్ధి పొందిందన్న ఆరోపణలు ఉన్నాయి. మరో ఉదంతంలో గచ్చిబౌలిలో క్రీడా గ్రామాన్ని నిర్మించేందుకు 108 ఎకరాలను ఒక సీమాంధ్ర నేతకు అతి తక్కవ ధరకు కట్టబెట్టారు. అందులో నిబంధనలకు వ్యతిరేకంగా 50 ఎకరాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు అంగీకరించడం విశేషం.
-ఆంధ్ర ప్రాంతంలోని బలమైన కమ్మ సామాజికి వర్గానికి చెందిన వ్యక్తికి హస్సేన్‌సాగర్ సమీపంలో 2.20 ఎకరాలను 33 ఏళ్లకు లీజుకివ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంట్లో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌ను నిర్మించడంద్వారా అన్ని నిబంధనలను తుంగలో తొక్కారని హౌజ్ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. అయినా నేటికీ చర్యలు లేకపోవడం విశేషం.
-హస్సేన్‌సాగర్‌కు తీవ్ర ముప్పుగా పరిణమించిందని సుప్రీంకోర్టు సాధికార కమిటీ వ్యతిరేకించిన వైస్రాయ్ హోటల్‌కు కేటాయించిన 2 ఎకరాలపై ప్రభుత్వం కళ్లూ, చెవులు మూసుకుంది. సీమాంధ్రకు చెందిన ఒక నేతకు చెందిన ఈ ఉదంతంపై విచారణ జరిపిన ప్రభుత్వ హౌజ్ కమిటీ.. ఈ కేటాయింపు రద్దు చేయాలని సిఫారసు చేసినా.. సర్కారు పట్టించుకోలేదు.
-హైదరాబాద్ నడిబొడ్డున సీమాంధ్రకు చెందిన బడా పారిశ్రామికవేత్తకు అమ్యూజ్‌మెంట్ పార్కు కోసం 10 ఎకరాలను కేటాయించడం కూడా వివాదాస్పదమయింది. జల విహార్‌కు కేటాయించిన ఈ భూమిలో సదరు నేత పక్కా నిర్మాణాలను చేపట్టడం విశేషం.
-మెదక్ జిల్లా పటాన్‌చెరువులో హైదరాబాద్ ఎకనామిక్ సిటీ పేరుతో నిర్మించాలని భావించిన ప్రాజెక్టకు 2వేల ఎకరాలను కేటాయించారు. ఈ ప్రాజెక్టును 24 గంటల్లో ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండానే సీమాంధ్రకు చెందిన వ్యక్తికి కట్టబెట్టడాన్ని హైకోర్టు తప్పుట్టింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.