మా జాగీర్‌లో మీ గేమింగా?

అదో విలువైన భూమి. హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమ విరాజిల్లుతున్న ప్రదేశం! అక్కడ 424 ఎకరాల్లో నాలెడ్జ్ సిటీ ప్రాజెక్టు పేరిట భూములను సర్కారీ సంస్థ ఏపీఐఐసీ విక్రయించింది! ఎకరాకు 20 కోట్ల వరకూ వెచ్చించి అనేకమంది రియల్టర్లు భూములు కొన్నారు. ఈ వ్యవహారంలో సర్కారీ ఖజానాకు వేలకోట్లు జమయ్యాయి! కట్‌చేస్తే సీన్ రివర్సయింది! భూములను అమ్మిన ప్రభుత్వమే.. ఆ భూముల్లో వారసత్వశిలలు ఉన్నాయంటూ అభ్యంతరాలు లేవదీసింది! ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేమని కిరికిరి పెట్టింది! అక్కడ భూములు కొన్నవారికి ప్రత్యామ్నాయాలు చూపిస్తామని ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చింది! తీరాచూస్తే అదే భూములను విదేశీ కంపెనీలకు కట్టబెట్టి గేమింగ్ పార్క్‌కు శంకుస్థాపన చేసింది! అటు ఉన్న భూమి స్వాధీనం కాక..

parkatacప్రత్యామ్నాయ భూముల ఊసే లేక బిల్డర్లు, కొనుగోలుదారులు కంగుతిన్నారు! విదేశీ కంపెనీలకు లేని అభ్యంతరాలు.. రాష్ట్ర బిల్డర్లకెందుకుని నిలదీస్తున్నారు! గేమింగ్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తహతహలాడుతున్న రాష్ట్ర మంత్రులు, నేతల పాత్ర దీని వెనుక ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానున్న తరుణంలో హైదరాబాద్‌లో భూములను వీలైనంత మేరకు స్వాహా చేసే ప్రయత్నంలో భాగమే ఈ తంతని తెలంగాణవాదులు మండిపడుతున్నారు! తమ జాగీరులో సీమాంధ్ర ఆటలు సాగబోవని హెచ్చరిస్తున్నారు! వివరాల్లోకి వెళితే..రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం.83/1లో 424.13 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(ఏపీఐఐసీ) నాలెడ్జ్ సిటీ పేరుతో భూములు విక్రయించింది. ఎకరం 20 కోట్ల రూపాయల చొప్పున పలు కంపెనీలు భూములు కొన్నాయి. 2007లో అమల్లోకి వచ్చి ఈ ప్రాజెక్టు వల్ల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి.

parkatac1 తీరా ఈ ప్రాజెక్టులో నిర్మాణాలు మొదలు పెట్టే సమయానికి ప్రభుత్వమే మళ్లీ అడ్డుపుల్ల వేసింది. రాయదుర్గంలోని సదరు స్థలాల్లో సహజసిద్ధ శిలలు ఉన్నాయని, అవి వారసత్వ సంపద కిందకు వస్తాయని కిరికిరి పెట్టింది. అక్కడ ఎలాంటి కట్టడాలకు అనుమతి ఇవ్వబోమని జీహెచ్‌ఎంసీ తెగేసి చెబుతున్నది. తాము ఈ భూములను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనలేదని, చట్టబద్ధంగా ప్రభుత్వ సంస్థ అయిన ఏపీఐఐసీ నుంచే కొనుగోలు చేశామని సదరు కొనుగోలుదారులు పత్రాలు చూపిస్తే.. లేదు.. లేదు..అవి వారసత్వ సంపదకిందకు వచ్చే భూములేనంటూ ఏపీఐఐసీ అమ్మకాలకు ముందే ఉన్న ధ్రువీకరణ పత్రాలను చూపిస్తున్నది. దీంతో షేర్లు, బ్యాంకు రుణాల ద్వారా వందల కోట్లు వెచ్చించి భూముల కొన్నామని, ఇప్పుడు ఆ డబ్బును తాము నష్టపోయామని బిల్డర్లు గగ్గోలు పెడుతున్నారు.

దీనిపై కొందరు ప్రభుత్వాన్ని నిలదీస్తే.. ప్రత్యామ్నాయం చూపిస్తామని అప్పటికి ఆ విషయాన్ని పక్కనపడేసిన ప్రభుత్వ పెద్దలు.. ఏళ్లతరబడి సాగదీత అనంతరం ఇప్పుడే సరిగ్గా అదే స్థలంలో గేమింగ్, యానిమేషన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్ (జీఏఎంఈ పార్క్) ఏర్పాటుకు శంకుస్థాపనలకు దిగడం వివాదాస్పదమైంది. తాము కొన్న ఈ భూముల్లో నిర్మాణాలు చేసుకుంటామంటే చారిత్రక శిలలు.. వారసత్వ సంపద అంటూ నిరాకరించిన ప్రభుత్వం.. ఇప్పుడే అదే భూముల్లో గేమింగ్‌పార్క్‌కు ఎలా అనుమతిస్తారని కొనుగోలుదారులు నిలదీస్తున్నారు. తమ నోట్లో మట్టికొట్టి.. గేమింగ్‌పార్క్ పేరుతో విదేశీ సంస్థలకు ఖరీదైన స్థలాలను అప్పగిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ మోసమేనని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి మోసపూరిత విధానాలు అనుసరిస్తే విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఎలా ముందుకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు తెర వెనుక కొందరు పెద్దలు కుట్ర చేస్తున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల వ్యవధిలో ఏర్పాటు కానున్న తెలంగాణ రాష్ట్రాన్ని వివాదాల సుడిగుండంలోకి తోసి, పైశాచిక ఆనందం పొందేందుకు పథకాలు రూపొందించుకున్నారని నిప్పులు చెరుగుతున్నారు.

సర్కారే మోసం చేస్తే?
రాయదుర్గంలోని ఈ భూమి వారసత్వసంపద అన్న విషయాన్ని ఈ స్థలాలను విక్రయించే ముందు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నాలెడ్జ్ సిటీపార్కులో వేలం ప్రక్రియను ముగించిన తర్వాత దీనిని వివాదాస్పదం చేయడం మోసమేనని పలువురు అంటున్నారు. అంతాఅయిపోయి, నిర్మాణాలకు అనుమతులు కోరే సమయంలో నిరాకరిస్తే వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినవారు ఏమైపోవాలని స్థలాలు కొన్న బిల్డర్లు, సంస్థల యజమానులు ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడులను ఆహ్వానించి అభివృద్ధికి పెద్దపీట వేయాలని నిజంగానే ప్రభుత్వం భావిస్తే ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడదని మై హోం ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ జే రామేశ్వరరావు మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులో ఎకరం 20 కోట్లు పెట్టి డీఎల్‌ఎఫ్ సంస్థ ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసిందని, వారి నుంచి తాము కొన్నామని ఆయన చెప్పారు.

నిర్మాణాలు మొదలు పెట్టేందుకు జీహెచ్‌ఎంసీకి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే అది వారసత్వ సంపద అంటూ తిరస్కరించారని తెలిపారు. ‘ఐదేళ్ల క్రితం 30 ఎకరాలను రూ.613 కోట్లు పెట్టి కొనుగోలు చేశాం. ఇప్పుడు హెరి రాక్స్ ఉన్నాయని గుర్తిస్తే మేం బాధ్యులమా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు రూపొందించిన లే అవుట్ కాదని, కచ్చితత్వం ఉంటుందని నమ్మకంతోనే కొన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఐదేళ్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ఇరుక్కుపోతే మేం కంపెనీని ఎలా నడిపించగలుగుతాం?’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్నామ్నాయంగా స్థలాలు చూపిస్తామని ఏళ్ల తరబడి ఏపీఐఐసీ అధికారులు తిప్పించుకుంటున్నారని, కానీ.. వారసత్వ సంపద పేరుతో తమకు తిరస్కరించిన స్థలంలోనే గేమింగ్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడమేంటని నిలదీశారు. మాకైతే ఒక నీతి.. విదేశీ పెట్టుబడులకైతే మరో నీతా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసు తేలకుండానే మరొకరికి కేటాయింపు
రాయదుర్గం సర్వే నం.83/1(దుర్గం చెరువు పరిసరాలు)లోని 424.13 ఎకరాల్లో ఎంత వరకు చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదగా పేర్కొనవచ్చునో నిర్థారించేందుకు ఓ కమిటీని ప్రభుత్వమే వేసింది. ఆ కమిటీ ఇంకా పని మొదలు పెట్టలేదు. కనుక నివేదిక సమర్పించే ప్రసక్తి కూడా రాదు. కానీ.. ఈలోపే ఏపీఐఐసీ మరో దాష్టీకానికి తెరతీస్తూ.. వారసత్వ సంపద స్థలంగా పేర్కొన్న చోటునే గేమింగ్‌పార్క్‌కు కేటాయించిందని మోసపోయిన బిల్డర్లు మండిపడుతున్నారు. కమిటీ నివేదిక ఇచ్చి, దాని విషయం తేలేదాకా ఎవరికీ కేటాయించకూడదన్న ఆంక్షలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు.

హెరి చట్టాన్ని రిపీల్ చేయకుండానే ఈ ప్రక్రియకు పూనుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కూడా నివేదిక వచ్చిన తర్వాత ఎవరైతే నష్టపోయిన వారు ఉన్నారో వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనలను కూడా అధికారులు, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేశ్‌రంజన్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌జాజు, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలకు వివాదం గురించి తెలిసినా వారు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారని మండిపడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కులో స్థలాలు కొనుగోలు చేసి మోసపోయిన పలు సంస్థలు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించాయి. కేసులు పెండింగ్‌లో ఉండగానే అదే స్థలాన్ని మరో పార్కుకు కేటాయించారని ఓ బిల్డర్ ఆరోపించారు.

గేమింగ్ పార్కు వెనుక పెద్ద మతలబే
అంతర్జాతీయ స్థాయిలో దేశంలోనే తొలిసారిగా ఆర్భాటంగా ప్రకటించిన గేమింగ్ పార్కుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. వివాదాస్పద స్థలంలో త్వరితగతిన ఈ తంతును ముగించేందుకు అధికారులు ఆగమేఘాల మీద కదులుతున్నారు. ఇక్కడ విదేశీ కంపెనీలు వస్తాయని చెబుతున్నా.. వాటి ముసుగులో కొందరు పెద్దలు కూడా రానున్నట్లు తెలుస్తున్నది. అందుకే ఈ కుట్ర జరిగిందని ఆరోపణలు వెల్లు ఈ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కొందరు పెద్ద నాయకులు, బ్యూరోక్రాట్లు దీనిపై ఆశపడుతున్నారని సమాచారం. ఇద్దరు మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు కూడా లాభసాటిగా ఉన్న యానిమేషన్ రంగంలోకి అడుగు పెట్టేందుకు మార్గాన్ని సుగమమం చేసుకునేందుకు వ్యూహరచన చేశారని తెలుస్తున్నది. వివాదాస్పద స్థలాల్లో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆశిస్తూ పార్కులను ఏర్పాటు చేస్తే అభాసుపాలు కావడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌పై శాశ్వతంగా చెరుగని తప్పుడు ముద్ర పడుతుందని తెలంగాణ పెట్టుబడి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

This entry was posted in ARTICLES.

Comments are closed.