మావల్లే తెలంగాణ రాష్ట్రం: బీజేపీ

ఢిల్లీ, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరో అడుగుదూరంలోనే ఉండటంతో రాష్ట్రాన్ని ఇచ్చిన క్రెడిట్ సంపాదించుకొనేందుకు కాంగ్రెస్‌తో బీజేపీ పోటీ పడుతున్నది. లోక్‌సభలో బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత మీడియాతో మాట్లాడిన బీజేపీ అగ్రనేతలు తమవల్లే తెలంగాణ ఏర్పడుతోందని ప్రకటించారు. కొద్దిరోజులుగా సాగుతున్న గందరగోళానికి కాంగ్రెస్సే కారణమని నిందించారు. ప్రజలకు ఇచ్చి న వాగ్దానాన్ని నెరవేర్చామని లోక్‌సభలో సుష్మాస్వరాజ్ ప్రకటించారు. వాగ్దానాన్ని నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీమాంవూధలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.

పట్టుబట్టి బిల్లు పాస్ చేయించాం: నాగం
బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణకు మద్దతుగా నిలిచింది. పార్లమెంటులో పట్టుబట్టి బీజేపీ అగ్రనేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజనాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ బిల్లును పాస్ చేయించారు. వారికి కృతజ్ఞతలు. చంద్రబాబు కుట్రలు ఫలించలేదు. మా పార్టీది ఒకే మాట.. ఒకే బాట. అమరుల త్యాగాలతో వచ్చిన ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అమరులకు అంకితం చేస్తున్నాం. ఈ విజయం తెలంగాణ ప్రజలది.

సుష్మా అపర కాళిలా విజృంభించారు: దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు
తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్ లోక్‌సభలో అపర కాళిలా విజృంభించి మాట్లాడారు. ఆమె మాటలను బట్టి ఆమె హృదయాంతరాల్లో తెలంగాణ అంశం నాటుకొని ఉందని అర్థమవుతోంది. తెలంగాణ సాకారమవుతున్న ఈ తరుణంలో అమరులను స్మరించుకోవాలి. ఎంత ప్రతికూల వాతావరణం వచ్చినా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్ తెలంగాణకు మద్దతు ఇచ్చి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.