మార్చి 30న రాష్ట్రవ్యాప్తంగా మున్సిపోల్స్

మార్చి 10 : నామినేషన్ల స్వీకరణ మొదలు
14 న: నామినేషన్ల దాఖలుకు గడువు
15న: నామినేషన్ల పరిశీలన
18 న: ఉపసంహరణకు గడువు
30 న: ఎన్నికలు
ఏప్రిల్ 1 : అవసరమైనచోట్ల రీపోలింగ్
2 న: ఓట్ల లెక్కింపు
7 న: మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు

listహైదరాబాద్, మార్చి 3: ఎట్టకేలకు పురపాలక సమరానికి భేరీ మోగింది. రాష్ట్రంలోని పది నగర కార్పొరేషన్లు, 146 మున్సిపాలిటీలకు ఒకే విడతలో మార్చి 30న ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో తెలంగాణలో 53 మున్సిపాలిటీలు, 1399 వార్డులు ఉన్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మరో మూడు నాలుగు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అంటే.. 30న పోలింగ్ ముగిసి.. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ముగిసిన కొద్ది రోజులకే సార్వత్రిక ఎన్నికల సందడి మొదలుకానుంది. వెరసి.. రాష్ట్రంలో సుదీర్ఘ ఓట్ల పండుగ మొదలైనట్లే. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీలు, 158 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ప్రభు త్వం ఖరారు చేసినా.. కోర్టు కేసుల కారణంగా తొమ్మిది కార్పొరేషన్లకు, 16 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పాలకవర్గానికి 2014 డిసెంబర్ వరకు గడువు ఉంది. ఖమ్మం, వరంగల్, గ్రేటర్ విశాఖపట్నం, కాకినాడ, ఒంగోలు, తిరుపతి, కర్నూలు, గుంటూరు కార్పొరేషన్లలో పొరుగున ఉన్న గ్రామాల విలీనాలను ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించింది.

అదేవిధంగా శ్రీకాకుళం, రాజం, నెల్లిమర్ల, కందుకూరు, అనపర్తి, రాజంపేట్, సిద్దిపేట, దుబ్బాక, చేగుంట, కొల్లాపూర్, జెడ్చర్ల, అచ్చంపేట, మేడ్చల్, మందమర్రి, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల ఎన్నికలపైనా కోర్టు స్టే విధించడంతో వీటికీ ఎన్నికలు నిర్వహించటం లేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. మార్చి 30న జరిగే 10 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాల్లో ఎస్సీ జనరల్-1, బీసీ జనరల్ -2, బీసీ మహిళ-2, జనరల్ మహిళ-3, అన్‌రిజర్వ్‌డ్ 2 ఉన్నాయి. 146 మున్సిపాలిటీల చైర్మన్ స్థానాల్లో ఎస్టీ మహిళ-2, ఎస్టీ జనరల్-1, ఎస్సీ మహిళ-10, ఎస్సీ జనరల్-9, బీసీ మహిళ-22, బీసీ జనరల్-24, జనరల్ మహిళ-39, అన్‌రిజర్వ్‌డ్ -39 స్థానాలు కేటాయించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 146 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 4503 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు 6,537 పోలింగ్ స్టేషన్లు, కార్పొరేషన్లలో 2,478 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ విధుల్లో 49,583 మంది సిబ్బంది పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలకు 8వేలు, కార్పొరేషన్ ఎన్నికలకు 3వేల ఈవీఎంలను వినియోగించనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 95,35,824 మంది ఓటర్లు పాల్గొననున్నారు. 146 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 67,87,382 మందిఓటర్లుఉం డగా, వీరిలో 33,82,532 మంది పురుష ఓటర్లు, 34,04,512 మంది మహిళా ఓటర్లు, 338 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. అదే విధంగా 10 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 27,48,442 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 13,82,325 మంది పురుష ఓటర్లు, 13,65,834 మంది మహిళా ఓటర్లు, 283 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. కార్పొరేషన్లలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల డిపాజిట్‌గా జనరల్ అభ్యర్థులకు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500, మున్సిపాలిటీలలో పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.2500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1250లు చెల్లించాల్సి ఉంటుంది.

list1పకడ్బందీగా నిర్వహిస్తాం: రమాకాంత్‌రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పీ రమాకాంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఉదయం బుద్ధభవన్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో కలిసి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలను దష్టిలో పెట్టుకొని ఆదివారం రోజున ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షలతో సంబంధం లేని ఉద్యోగులను మాత్రమే ఎన్నికల విధులకు ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతిపాదికనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని పరిశీలకుడిగా నియమించనున్నామని, అందుకోసం 25మంది ఐఏఎస్‌లు అవసరమని ప్రభుత్వానికి లేఖ రాశామని వివరించారు. అవసరమైన చోట ఏప్రిల్ 1న రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పరోక్షంగా నిర్వహిస్తామని చెప్పారు. ఒక వేళ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఆటంకంగా మారితే ఒక రోజు ముందు లేదంటే మరుసటి రోజు నిర్వహిస్తామని తెలిపారు. కొత్తగా వచ్చిన నోటా పద్ధతి అమలు విషయంపై ప్రభుత్వానికి లేఖ రాశామని, ప్రభుత్వం ఆదేశిస్తే ఈ ఎన్నికల్లోనే నోటా ప్రవేశపెడతామని రమాకాంత్‌రెడ్డి చెప్పారు.

మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయడం రాజ్యాంగ విరుద్ధమని గత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పానని, అయితే వివిధ కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో కోర్టుకు వివరణ ఇవ్వాలనే ఉదేశంతో అడావుడిగా రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేసి శనివారం రాత్రి 9గంటలకు తనకు అందజేశారని, వాటిలో స్పష్టత లేకపోవడంతో తిప్పి పంపించానని తెలిపారు. తిరిగి ఆదివారం వాటిని సవరించి తెచ్చి ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల జాబితాపై న్యాయనిపుణులతో చర్చించి సోమవారం షెడ్యూల్ విడుదల చేశామని పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల్లో సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినా ఈ ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి ఉండదన్నారు. ఎన్నికల కమిషన్ కూడా సర్వ స్వతంత్ర సంఘమని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులతో ఈనెల 6న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.