మహిళలు కొంగు నడుముకు చుడితే తెలంగాణ తథ్యం:కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ మహిళా లోకం కొంగు నడుముకు చుడితే ప్రత్యేక రాష్ట్రం తథ్యమని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మజ్దూర్ యూనియన్ మహిళా సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో కేసీఆర్ ప్రసంగించారు. ఆర్టీసీలో మహిళలకు ఇవ్వాల్సిన మూడు వేల ఉద్యోగాలను మహిళలకే ఇవ్వాలని ఆర్టీసీ ఎండీని డిమాండ్ చేస్తున్నానమని తెలిపారు. ఆర్టీసీలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల నియామాకాల్లో తెలంగాణ మహిళలను ఎంపిక చేయడం లేదని పేర్కొన్నారు. విజయనగరం మహిళలను రిక్రూట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో సమర్థవంతమైన మహిళలు లేరా అని ప్రశ్నించారు. ఏ దేశంలోనూ ఆడవాళ్ల పని, మగవాళ్ల పనని తేడా లేదని తెలిపారు. ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టింది చంద్రబాబు అయితే, అమలు చేస్తున్నది కాంగ్రెస్ అని ఎద్దెవా చేశారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ అభివృద్ధి వెనుక మహిళల పాత్ర ఉందన్నారు. టీఎంయూ ఎదుగుదలలో ఆశ్వద్ధామరెడ్డి పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో టీఎంయూ ఆవిర్భావం గొప్ప పరిణామమని చెప్పారు. టీఎంయూను ఆదరించిన కార్మికులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.