మహబూబ్‌నగర్ బరిలోకి శ్రీనివాస్‌గౌడ్

  తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన టీ జేఏసీ కో చైర్మన్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ ఇక రాజకీయాల్లోకి రానున్నారు. టీఆర్‌ఎస్ తరఫున మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు శనివారం ఆయన రాజేంద్రనగర్ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

srinvagudtrsరాజీనామా లేఖను సోమవారం తమ శాఖాధిపతికి అందజేస్తానని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తాను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యానని, టీఆర్‌ఎస్ నుంచి మహబూబ్‌నగర్ శాసనసభ స్థానానికి పోటీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. శనివారం టీజీవో కార్యాలయంలో శ్రీనివాస్‌గౌడ్ విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఆ సంస్థ ప్రధానకార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలు మమత, హైదరాబాద్ జిల్లా టీజీవ్వోహక కార్యదర్శి ఎంబీ కష్ణయాదవ్, కార్యవర్గ సభ్యులు అరుణ, సత్యనారాయణ, పురుషోత్తమరెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అంతకుముందు టీజీవో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఆరుదశాబ్దాలుగా తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్ర వలస పాలనలో తీవ్ర అన్యాయాలకు గురయ్యారని, విభజన సందర్భంలో కూడా అవే అన్యాయాలు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీజీవో కార్యవర్గ సమావేశం తీర్మానాలను ప్రధానకార్యదర్శి శ్రీనివాసరావు వివరించారు. ఉపాధ్యక్షురాలు మమత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీజీవో పక్షాన ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగామన్నారు.

శ్రీనివాస్‌గౌడ్‌ను గెలిపించే బాధ్యత మీదే
– ఆయనకు భారీ మెజార్టీ అందించాలి..
– ఉద్యోగులకు టీఆర్‌ఎస్ అధినేత పిలుపు..
– కేసీఆర్ ఆశీస్సులందుకున్న శ్రీనివాస్‌గౌడ్
శ్రీనివాస్‌గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలదే.. మహబూబ్‌నగర్ పట్టణంలో ఉద్యోగుల ప్రాతినిధ్యం ఎక్కువ సంఖ్యలోనే ఉంది. ఉద్యోగులను ఆర్గనైజ్ చేసుకుంటే విజయం సులభమే అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులకు సూచించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాలకు వెళ్తున్నానని ప్రకటించిన టీ జేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ శనివారం కేసీఆర్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.

శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు సంఘం ప్రధానకార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు తదితరులు టీఆర్‌ఎస్ అధినేతతో భేటీ అయ్యారు. టీజీవో ప్రతినిధులతో కేసీఆర్ 20 నిమిషాలు మాట్లాడారు. టీ జేఏసీ నాయకత్వంలో ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ఉద్యమాలు మరువలేనివని ఆయన అభినందించారు. శ్రీనివాస్‌గౌడ్‌ను విజయపథం వైపు నడిపించాల్సిన బాధ్యత ఉద్యోగులదేనని, తనవంతు బాధ్యతను నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఉద్యమ సందర్భంలో కష్టపడిన వారందరికీ తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చేందుకు అన్నివిధాలా ప్రయత్నంచేస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న రాజకీయ లక్ష్యాలను సాధించే దిశలో భాగంగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నానని శ్రీనివాస్‌గౌడ్ టీ మీడియాతో అన్నారు.తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.