మళ్లీ పుట్టండి జయశంకర్ సార్

ఆయన మాటలు.. తెలంగాణ ఉద్యమం చేతిలో తూటాలు.! ఆయన అక్షరాలు.. సమరంలో అస్త్రాలు.! ఆయన కల బంగారు తెలంగాణ.! ఆ కలను నిజం చేసుకునే తపన.! వివాహాన్ని త్యజించి తన జీతాన్ని, జీవితాన్నే తెలంగాణ సాధనకు అంకితం చేసిన త్యాగధనుడు. ఆయనే తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త కర్మయోగి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ప్రతిష్టాత్మక కాకతీయ, EFLU విశ్వ విద్యాలయాలను నడిపిన ప్రతిభావంతుడాయన..!! తెలంగాణ వ్యాప్తంగా లక్షల జయశంకర్ లను తయారుచేసిన గొప్ప ప్రభావశీలి ఆయన. సుధీర్ఘ తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి. 1952లో తన పద్దెనిమిదేళ్ల వయసులోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కు వ్యతిరేకంగా తరగతిని బహిష్కరించి బయటికి నడిచెళ్లిన వ్యక్తి. ఇక్కడి భూమి.. ఇక్కడి వనరులు.. ఇక్కడి ఉద్యోగాలు.. ఇక్కడి సంస్కృతి.. వలసవాదుల దోపిడీకి గురౌతుంటే ఐదు దశాబ్దాల క్రితమే తెలంగాణ సాధన కోసం కదనరంగం లోకి అడుగేసిన తొలి సైనికుడాయన. వలస ప్రభుత్వాల అణిచివేతలోనూ, ప్రతికూల పరిస్తితుల్లోనూ ఆయన ఉద్యమాన్ని ఆపలేదు. తెలంగాణ పేరెత్తితేనే ఎన్ కౌంటర్ చేసిన రోజుల్లోనూ జెండా వదల్లేదు. భావజాల వ్యాప్తి, ఉద్యమం, రాజకీయ ప్రక్రియలతోనే తెలంగాణ సాధ్యమని చెప్పే జయశంకర్ సార్ మొదటిదైన భావజాల వ్యాప్తినే తన ఆయుధం చేసుకున్నారు. చైతన్య జ్యోతుల్ని వెలిగించారు. పల్లెపల్లెనూ ఉద్యమ బాట పట్టించారు. ఇపుడు జయశంకర్ పేరు ఉద్యమ బావుటా. ఆయన చూపిన సిద్ధాంత బాటలో తెలంగాణ చైతన్యవంతంగా పరుగులు పెడుతుంది. ఆయన తెలంగాణ సాధికారిక స్వరం. సమస్త తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కు జయశంకర్ సార్. కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ గా పనిచేసినప్పటికీ సొంత ఇల్లుకూడా సంపాదించుకోని ఆ ఆదర్శమూర్తికి శిరస్సువంచి నమస్కరిద్దాం. ఆవేశం లేని, ఆర్భాటం లేని ఆ అభినివేశమూర్తికి తెలంగాణ బిడ్డల ప్రణామాలు చెప్దాం.

సార్.. నలబై యాబై మందితో మీరు నడిపిన చిన్న చిన్న సమావేశాలు.. ఈ రోజు లక్షల మందితో పోరుకెరటాలైనయి. మీరు చేసిన విధాన నిర్ణయాలే.. ఈ రోజు ఉద్యమంలో మేధావులకు మ్యానిఫెస్టో. ఆర్టీసీ బస్సుల్లో తిరిగి పల్లెల్లో మీరు నేర్పిన ఉద్యమ పాఠాలు.. ఈ రోజు నాలుగు కోట్ల మందికి దారిచూపే చైతన్య కాగడాలు. మనిషి దేవుడవడం. విన్నాం. ఇపుడు చూస్తున్నాం. సార్..

మీరు చూపిన తొవ్వలో తెలంగాణ సాధిస్తం.. దోపిడీ అసమానతలు లేని సమాజం కోసం చివరిదాకా పయనిస్తం. రేపటి తెలంగాణ ఎలా ఉండాలో నిర్దేశించిన మార్గదర్శీ..   మాకోసం మళ్లీ పుట్టండి సార్..

తెలంగాణకు దారిచూపిన దేవుడికి వందనం.. జయశంకర్ సార్ కు పోరుతెలంగాణ కన్నీటి నివాళి.

 

 

This entry was posted in ARTICLES, TELANGANA MONAGALLU, Top Stories.

Comments are closed.