మన సింగరేణిపై వాటా కుట్ర! కోల్ ఇండియా పరిధిలోకి తెచ్చే యత్నం

తవ్విందెవడు? తట్ట మోసిందెవడు? భూమిలోపల మగ్గిందెవడు? మన్నైందెవడు? భూములిచ్చి బిచ్చగాడైందెవడు? ప్రాణాలిచ్చి ఆ భూమి తొలిచిందెవడు?…ఎన్ని ప్రాణాలు పోతే.. ఎన్ని ఊళ్లు మాయమైతే…ఎన్ని పంటచేలు బీడులైతే… ఎన్నిరోగాలు భరిస్తే..ఎన్ని త్యాగాలు చేస్తే ఇవాళ సింగరేణి! బ్రిటిషోడు ముట్టినపుడు లేనోడు.. ఎల్లందును తవ్వినపుడు రానోడు.. కంపెనీ పెట్టినపుడు లేనోడు.. గనుల్లో బుగులుబుగులుగా పోయినపుడు సూడనోడు.. అసలు కంపెనీ పుట్టినంక 60 ఏళ్లు ఇటు వచ్చినోడు కాడు. ఇవాళ బరితెగించి సింగరేణి తనదంటున్నడు. ఇత్తేసి పొత్తడుగుతున్నడు. ఇడుపు కాయితంల మడత పేచి పెడుతున్నడు. కన్ను మలిపితే కాటేస్తరు. మెత్తగుంటే గొంతుకోస్తరు. హోషియార్.. తెలంగాణకిది పరీక్షాసమయం!
గోదావరిఖని, నవంబర్ 24 (టీ మీడియా): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్పదని అర్థంకావడంతో తెలంగాణను సర్వనాశనం చేసేందుకు సీమాంధ్రులు కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది. తెలంగాణ ప్రయోజనాల మీద నిప్పులు చల్లే ఏ అవకాశాన్ని వారు వదలడం లేదు. రసం పీల్చి పిప్పిని వదిలేసిన రీతిలో తెలంగాణను మార్చేయడానికి కుట్రల మీద కుట్రలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్ ఆదాయానికి గండి పెట్టే యత్నం, భద్రాచలం లాక్కొని గోదావరి నీటిని కాకుండా చేసే యత్నం, శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌కేంద్రం కాజేసే యత్నాలు అయిపోయాయి. ఇపుడు వారి కళ్లు కళకళలాడుతున్న సింగరేణి మీద పడింది. 114 ఏళ్ల చరిత్ర, వైభవం ఉన్న సింగరేణినే మింగేయాలని సీమాంధ్ర కొండచిలువలు యత్నిస్తున్నాయి. రేపటి తెలంగాణలో కీలక పాత్ర పోషించగలదన్న ఈ మహా సంపదను కేంద్ర పరం చేసి, తెలంగాణకు వట్టి చేతులు మిగల్చాలని పథకాలు రచిస్తున్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే సింగరేణి సంస్థను కోల్‌ఇండియా పరంచేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తద్వారా తెలంగాణ సంపదను దక్కకుండా చేయడంతోపాటు అందులో వాటా కొట్టేయాలని చూస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న రూపంలో సింగరేణినుంచి సీమాంధ్ర వాటాలు కుదరవనే అనుమానంతో కోల్ ఇండియా పరిధికి చేర్చి లాభపడాలనే ఎత్తు వేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో గోదావరినది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 51.096%, కేంద్ర ప్రభుత్వానికి 48.902% వాటా ఉంది. సింగరేణి సంస్థలో మొత్తం ఈక్విటీ (మూలధనం) రూ.1733.20కోట్లుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.885.60 కోట్ల ఈక్విటీ (51.096%), కేంద్ర ప్రభుత్వానికి రూ.847.56కోట్ల ఈక్విటీ (48.902%) ఉంది. దీనికి తోడుగా ప్రైవేట్ షేర్ హోల్డర్స్ చేతిలో రూ.4లక్షల ఈక్విటీ (00.002%)గా ఉంది. మెజార్టీ వాటా కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగరేణిపై సర్వాధికారాలున్నాయి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ హక్కు లేకుండా చేసే కుట్రతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికున్న వాటాను రెండుగా విభజించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న వాటాలో 25%వాటాను సీమాంధ్రకివ్వాలని కొర్రీ పెట్టినట్టు తెలిసింది. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రానికి సింగరేణిలో వాటా 26.096 శాతానికి కుంచించుకుపోయి మెజార్టీ వాటా 48.902% కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వం కిందకు సంస్థ వెళ్లిపోతుంది. తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద సంపదగా ఉన్న సింగరేణిని కాకుండా చేసే కుట్రపూరిత ఆలోచనతోనే ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. సమైక్య రాష్ట్రంలోనే సింగరేణి సంస్థ అభివృద్ధి చెందిందని, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అప్పులు, ఆస్తుల లెక్కలు తేలే క్రమంలో సింగరేణిలో తమ వాటా తమకు ఇవ్వాలని పట్టుబట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తద్వారా సింగరేణి సంస్థలో బొగ్గును వాటాగా, కోటాగా సంపాదించి సీమాంధ్రలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. సమైక్య రాష్ట్రంలో సింగరేణి పన్నుల ఆదాయం మరిగిన సీమాంధ్రులు ఆ ఆదాయం తెలంగాణకు దక్కనీయరాదన్న అక్కసుతో ఈ నీచ కార్యానికి సమకట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దేశంలో ప్రభుత్వ బొగ్గు పరిశ్రమలన్నీ కోల్‌ఇండియా పరిధిలోనే ఉన్నాయని, సింగరేణిని కూడా కోల్‌ఇండియా పరిధిలోకి తీసుకురావాలని సీమాంధ్ర నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. సింగరేణి సంస్థనుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపేణా నెలకు రూ.85కోట్లు, వ్యాట్ రూపేణా మరో రూ.45కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ పేరుతో రూ.5కోట్లు వస్తున్నాయి. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపేణా కేంద్ర ప్రభుత్వానికి నెలకు రూ.40కోట్లు వెళుతున్నాయి. సింగరేణిలో వాటా కొట్టేయాలన్న కుట్ర కోసమే సంస్థకు సంబంధించిన లెక్కలను ముఖ్యమంత్రి ఇటీవలే తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జీవోఎం ఎదుట సీఎం ఈ విషయం ప్రస్తావిస్తూ సింగరేణి సంస్థ తెలంగాణలో ఉందని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఈ సమస్య ఎలా పరిష్కారిస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరం వరకు భారీ నష్టాల్లో ఉన్న సంస్థ బీఐఎఫ్‌ఆర్ పరిధిలోకి వెళ్లే పరిస్థితి నెలకొన్నప్పుడు తెలంగాణలోని నాలుగు జిల్లాలోని కార్మికులు సంస్థను కాపాడుకోవడానికి ఆహర్నిశలు కష్టపడి రూ.1219 కోట్ల నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో సింగరేణిని ఏ మాత్రం ముట్టుకున్నా బొగ్గుగనుల్లో నిప్పు రాజుకోవడం ఖాయం.

114 ఏళ్ల నల్ల బంగారం
సింగరేణిది 114 సంవత్సరాల చరిత్ర. 1870 ప్రాంతంలో భద్రాద్రి రామయ్యను సందర్శించడానికి వెళుతున్న భక్తుల బృందం గోదావరి ఒడ్డున వంటలు చేసుకునే సందర్భంగా వంటరాళ్ల నుంచి మంటలు రావడం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ వారు సర్వేకోసం డాక్టర్ విలియమ్ కింగ్ అనే జియాలజిస్టును పంపడంతో గోదావరి ప్రాణహిత తీరమంతా అపారంగా బొగ్గునిల్వలున్నట్టు వెల్లడైంది. సింగరేణి బొగ్గుగనుల ఆవిర్భావానికి ఆ ఉదంతమే నాంది పలికింది. నిజాం రాజుతో అనేక చర్చలు, ఒప్పందాల తర్వాత 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది.. బొగ్గుగనుల అన్వేషణ ప్రారంభ మైంది. 1889లో ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామం వద్ద (ఎల్లందు)లో మైనింగ్ మొదలైంది. దీనికి బెస్ట్ కంపెనీ ఒకటి సహకరించేది. 1920లో వాటాలు, అధికారాలు, మార్పు చేర్పులతో ఇది సింగరేణి కాలరీస్‌గా రూపాంతరం చెందింది. ఆ కాలంలోనే సింగరేణి కాలరీస్ లండన్ స్టాక్ మార్కెట్‌లో నమోదైంది. 1945లో నిజాం ఉస్మాన్ అలీఖాన్ కంపెనీలోని మెజారిటీ షేర్లన్నీ కొనేశాడు. ఆ కాలంలో గనుల తవ్వకాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో హైదరాబాద్ ఒక్కటే. హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పేరిట మొత్తం కంపెనీ వ్యవహారాలన్నీ ప్రభుత్వమే నిర్వహించింది. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం కూడా ఇందులో భారీగా వాటాలు కొనుగోలు చేసింది. 51 శాతం వాటాలతో నాటి హైదరాబాద్ రాష్ట్రం గనుల నిర్వహణను చేపట్టింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక నిర్వహణ దాని చేతికి వచ్చింది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.